నిబంధనలను మరోసారి సవరించిన కేంద్ర న్యాయశాఖ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇకపై పదవీ విరమణ చేసిన రోజునుంచి జీవితకాలమంతా ఒక పని మనిషి, ఒక వంట మనిషి, ఒక సెక్రటేరియల్ అసిస్టెంట్ సదుపాయాలను కలిగి ఉంటారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా నోటిఫై చేసిన రిటైర్మెంట్ అనంతర ప్రయోజనాలలో ఈ విషయం తెలియజేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులకు రిటైర్మెంట్ అనంతరం మరిన్ని సదుపాయాలను కలుగ జేయడం కోసం సుప్రీంకోర్టు జడ్జిల నిబంధనలను మళ్లీ సవరించినట్లు కేంద్ర న్యాయశాఖలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ శుక్రవారం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఇంతకు ముందు ఈ నెల 23న ఈ నిబంధనలను ఒకసారి సవరించారు. సవరించిన నిబంధనల ప్రయోజనాలు జీవించి ఉన్న సిజెఐలు, సుప్రీంకోర్టు జడ్జిలకందరికీ వర్తిస్తాయి.
సవరించిన నిబంధనల ప్రకారం రిటైర్ట్‌సుప్రీంకోర్టు జడ్జికి రిటైరయిన రోజునుంచి అయిదేళ్ల పాటు ఉండే వ్యక్తిగత సెక్యూరిటీగార్డుతో పాటు ఆయన నివాసం వద్ద రోజులో 24 గంటలు భద్రత కల్పిస్తారు. ఒక వేళ ముప్పు దృష్టా ఇప్పటికే హైగ్రేడ్ భద్రత కల్పిస్తూ ఉంటే దాన్ని కొనసాగిస్తారు. అలాగే పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రిటైరయిన తేదీనుంచి ఆరు నెలల పాటు ఢిల్లీలో అద్దె లేని టైప్7 గృహ వసతి కల్పిస్తారు. ఈ తరహా గృహవసతిని సాధారణంగా మాజీ కేంద్రమంత్రులయిన సిట్టింగ్ ఎంపిలకు కలుగ జేస్తారు. ఈ సదుపాయాన్ని రిటైర్డ్ సిజెఐలకు కూడా ఈ నెల ప్రారంభంలో పొడిగించారు. కాగా రిటైర్డ్ సిజెఐలు, సుప్రీంకోర్టు జడ్జిలకు ఇంతకు ముందు కల్పించిన సదుపాయాలన్నీ ఇకపై కూడా కొనసాగుతాయని తాజా నోటిఫికేషన్ పేర్కొంది.