Thursday, January 23, 2025

ఆర్టీసీ ఆసుపత్రిలో అత్యాధునిక వసతులు

- Advertisement -
- Advertisement -

రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్

More Facilities in RTC Hospital
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఆర్టీసీ సిబ్బందికి మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిలో అత్యాధునిక వసతులు కల్పిస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. గురువారం నర్సింగ్ కళాశాలతో పాటు ఆక్సిజన్ ప్లాంట్, ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్, అంబులెన్స్‌లు, ఆసుపత్రి పరిపాలన భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

నామమాత్రపు వైద్యసేవలకే పరిమితమైన ఈ దవాఖానను ప్రభుత్వం సకల వసతులతో బలోపేతం చేస్తున్నదని ప్రత్యేకించి ఆర్టీసీ సిబ్బంది వైద్యానికి భరోసా ఇచ్చేలా దవాఖానను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ప్రైవేటు దవాఖానలకు సిబ్బంది రిఫర్ చేయడంతో సంస్థ మీద ఏటా రూ.40 కోట్ల భారం పడేదని ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని శాశ్వత ఏర్పాట్లు చేసే వెసులుబాటు కలిగిందన్నారు. తార్నాక ఆర్టీసీ ఆసుపత్రి ఆవరణలోనే ఈ ఏడాది నుంచి నర్సింగ్ కళాశాలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని దీనిలో ఆర్టీసీ సిబ్బంది పిల్లలకు ఐదు సీట్లను కేటాయిస్తున్నారని తెలిపారు. త్వరలోనే వొకేషనల్ కాలేజీ ఏర్పాటుకు కృషి చేస్తానని అజయ్ కుమార్ హామీ ఇచ్చారు.

రూ.80 లక్షల వ్యయంతో 20 పడకల ఐసియూను తొలిసారిగా అందుబాటులోకి తెచ్చామని నాలుగు బెడ్లతో కిడ్నీ సెంటర్ నెలకొల్పామని రూ.15 లక్షల వ్యయంతో డయాలసిస్ మిషన్ ఏర్పాటు చేశామని మంత్రి చెప్పారు. రూ.1.2 కోట్లతో రౌండ్ టేబుల్ ఇండియా సంస్థ ఆక్సిజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడంతో రోగులకు ఉపశమనంగా మారిందని అన్నారు. రోగులు, వారి సహాయకులు, సిబ్బంది కోసం రూ.1.5 కోట్లతో క్యాంటీన్‌ను అందుబాటులో ఉందని రోగులకు అన్ని రకాల మందులను ఉచితంగా అందిస్తున్నామని అన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో నాలుగు ఆపరేషన్ థియేటర్లు అందుబాటులో ఉన్నాయని, త్వరలోనే ఎంఆర్‌ఐ, సీటీస్కాన్, క్యాథ్‌ల్యాబ్ సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి వివరించారు. కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్టీసీ ఎండీ విసి. సజ్జనార్, తదితరులు పాల్గొన్నారు.

క్లిష్ట పరిస్థితులను సమర్ధవంతంగా..

క్లిష్ట పరిస్థితులను ఆర్టీసీ సమర్ధవంతంగా ఎదుర్కొన్నదని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. సంస్థను బలోపేతం చేస్తున్నామని.. ఇందులో భాగంగా కొత్త బస్సులు కొనుగోలు చేయాలని భావిస్తున్నామని వెల్లడించారు. ఎలక్ట్రిక్ బస్సులు వాడితే డీజిల్ ధరల భారం తగ్గించుకోవచ్చని వెల్లడించారు. డీజిల్ ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయని చెప్పారు. డీజిల్ ధరలు పెంచుతున్న కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ను తగ్గించుకోవాలని అంటున్నదని విమర్శించారు. లాభాల బాటలో ఉన్న సంస్థలను కేంద్రం అమ్మకానికి పెడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News