తెలంగాణలో పెట్టడానికి సహకరిస్తాం, మంత్రి కెటిఆర్‌ను కలుసుకొని ప్రకటించిన ఫ్రెంచ్ రాయబారి ఇమాన్యూయెల్ లెనైన్
మన తెలంగాణ/ హైదరాబాద్ : శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో దేశంలో తెలంగాణ ముందు వరుసలో ఉన్నదని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. రాష్ట్రాభివృద్ధిలో అత్యంత కీలకమైన పరిశ్రమలు, పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకురావడం కోసం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నుంచి టిఆర్ఎస్ ప్రభుత్వం అనేక విప్లవాత్మకమైన విధానాలను చేపట్టిందన్నారు. ప్రధానంగా టిఎస్ఐపాస్ ద్వారా కంపెనీ ఏర్పాటుకు అవసరమైన అన్ని రకాల అనుమతులను కేవలం 15 రోజుల్లో మంజూరు చేస్తున్నామన్నారు.
ఈ విధానం భారత దేశంలో ఎక్కడా లేదన్నారు. శుక్రవారం హెచ్ఐసిసిలో జరిగిన ఇండో,- ఫ్రెంచ్ ఇన్వెస్ట్మెంట్ కంక్లేవ్‌లో మంత్రి కెటిఆర్, ఫ్రెంచ్ రాయబారి ఇమాన్యుల్ లెనైన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, టిఎస్ ఐపాస్ విధానం ఇప్పటికే విజయవంతమైన నేపథ్యంలో అనతి కాలంలోనే రాష్ట్రానికి వేలాది కోట్ల పెట్టుబడులను, లక్షలాది సంఖ్యలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలను సాధించగాలిగామని వెల్లడించారు. ప్రభుత్వాలు మారినా ప్రభుత్వ విధానాలు స్థిరంగా ఉండాలన్న స్ఫూర్తితో అనేక కార్యక్రమాలను, పాలనా సంస్కరణలను చేపట్టామన్నారు.
ప్రభుత్వ పాలసీలే కాకుండా అనేక ఇతర అంశాల్లోనూ తెలంగాణ ఆదర్శవంతమైన పద్ధతులను అనుసరిస్తున్నదన్నారు. భారతదేశాన్ని కేవలం కేంద్ర ప్రభుత్వ విధానాలను ఆధారంగా మాత్రమే చూస్తే సరిపోదని, భారతలో తెలంగాణ లాంటి రాష్ట్రాలను ఇక్కడి ప్రభుత్వ విధానాలు, పెట్టుబడి అవకాశాల దృక్కోణంతో చూడాలని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ నగరం, ఏ రాష్ట్రం వారికైనా… ప్రపంచంలోని ఏ దేశం వారికైనా నివసించేందుకు అత్యంత అనుకూలమైన మౌలిక వసతులతో పాటు సాంస్కృతికంగా కూడా ఎంతో అనుకూలమైన నగరంగా ఆయన అభివర్ణించారు. హైదరాబాదులో ఉన్న అనేక రంగాల ఇకో సిస్టమ్‌పై ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.
లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాలతో పాటు ఐటి, ఇన్నోవేషన్, ఎరోస్పేస్ డిఫెన్స్ వంటి రంగాల్లో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్నదని కెటిఆర్ తెలిపారు. హైదరాబాద్ ప్రపంచవ్యాప్త వ్యాక్సిన్ క్యాపిటల్ గా కొనసాగుతోందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద టాప్ టెక్ కంపెనీల భారీ కార్యాలయాలకు హైదరాబాద్ కేంద్రంగా మారిందన్నారు. ఇప్పటికే అనేక ఫ్రెంచ్ కంపెనీలు తెలంగాణలో భారీ ఎత్తున తమ పెట్టుబడులను పెట్టి కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయన్నారు. ఇక్కడ తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫ్రెంచ్ కంపెనీలు తెలంగాణ రాష్ట్ర విధానాలు, ఇక్కడ ఉన్న స్నేహపూర్వక వ్యాపార వాతావరణం పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలోఫ్రెంచ్ దేశానికి సంబంధించిన భారీ కంపెనీలతో పాటు మధ్యతరహా కంపెనీలను సైతం తెలంగాణకు ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆయా కంపెనీల భవిష్యత్తు అభివృద్ధిలో భాగస్వామిగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చే కంపెనీకి అన్ని రకాలుగా సహకరిస్తామని ఈ సందర్భంగా కెటిఆర్ హామి ఇచ్చారు. దేశం లేదా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతిపాదనలకు సమానంగా లేదా అంతకు మించి సహాయ సహకారాలను తెలంగాణ రాష్ట్రం అందిస్తుందని కెటిఆర్ స్పష్టం చేశారు.
మరిన్ని పెట్టుబడులకు సహకరిస్తాం
తెలంగాణలో ఫ్రెంచ్ దేశం పక్షాన మరిన్ని పెట్టుబడులకు పూర్తిగా సహకరిస్తామని ఫ్రెంచ్ రాయబడి ఇమాన్యూల్ లెనైన్ అన్నారు. ఈ ఇన్వెస్టెమెంట్ కాంక్లేవ్ ద్వారా తెలంగాణలోని పెట్టుబడి అవకాశాలను ఫ్రెంచ్ కంపెనీలు తెలుసుకునేందుకు మరింత అవకాశం కలుగుతుందన్నారు. ఇప్పటికే అనేక ఫ్రెంచ్ వ్యాపార వాణిజ్య వర్గాలు తెలంగాణలో కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయన్నారు. తెలంగాణలో తమ పెట్టుబడి అనుభవం పట్ల, ఇక్కడి స్నేహపూర్వక వాతావరణం పట్ల సంతృప్తిగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. తెలంగాణలోకి మరిన్ని పెట్టుబడులు వచ్చేందుకు తన వంతు సహకారం ఎప్పుడు ఉంటుందన్నారు. ఇందుకు సంబంధించి ఒక ప్రత్యేక భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఫ్రెంచ్ వ్యాపార వర్గాలతో కలసి పనిచేస్తామన్నారు. ఈ సమావేశానికి హాజరైన ఫ్రెంచ్ వ్యాపార వాణిజ్య రంగాలకు చెందిన ప్రతినిధులతో జరిగిన ఈ సమావేశంలో ప్రసంగించడానికి ముందు రాయబారితో మంత్రి కెటిఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశం తర్వాత అనేక ఫ్రెంచ్ వ్యాపార వర్గాలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఆయా కంపెనీల పెట్టుబడి ఆలోచనలు, ఆసక్తిని తెలుసుకున్నారు.