బడ్జెట్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అధిక కేటాయింపులు
రూ.12,571 కోట్లను కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం
ఈ నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక
ఎంపిక ప్రక్రియను ముమ్మరం చేసిన అధికారులు
ఈనెలాఖరులోగా లబ్ధిదారులను ప్రకటించనున్న ప్రభుత్వం
మన తెలంగాణ / హైదరాబాద్ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఊపందుకోనుంది. పేదల సొంతింటి కలను నెరవేర్చాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో ఇందిరమ్మ ఇళ్లకు పెద్దపీట వేసి ఈ పథకానికి నిధుల కేటాయింపులో ప్రాధాన్యత ఇచ్చింది. కాంగ్రెస్ పేర్కొన్న ఆరు గ్యారంటీల్లో ఒకటైన ఇందిరమ్మ ఇళ్లను ఎక్కువగా నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటిలో కొత్త ఇళ్లను నిర్మించడమే కాకుండా గత ప్రభుత్వ హయాంలో వివిధ దశల్లో నిలిచిపోయిన రెండు పడక గదుల ఇళ్లను కూడా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు రాష్ట్ర బడ్జెట్‌లో రూ.12,571 కోట్లను కేటాయించింది.
లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో శుభవార్త చెప్పనుంది. మొదటి విడతలో ఇళ్లు మంజూరు కానీ వారి కోసం మరో జాబితా తయారు చేస్తోంది. రెండో విడతలో 30 వేల మందికి ఇళ్లు ఇవ్వనుండగా వారి జాబితాను ఈ నెలాఖరులోగా విడుదల చేయనుంది. 2025- 26 ఆర్థిక సంవత్సరానికి ఇందిరమ్మ ఇళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.12,571 కోట్లను కేటాయించింది. గత బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.8,424.06 కోట్లను కేటాయించగా ఈసారి ఆ నిధులను రూ.4,147 కోట్లకు పెంచింది. ఏటా నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్రంలో గరిష్ఠంగా 4.50 లక్షల ఇళ్లను అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున కేటాయిస్తోంది. కానీ ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం చూస్తే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఏటా రూ.22,500 కోట్లు అవసరమవుతాయి. ఇందులో ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లను కేటాయించనుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఒక్కో ఇంటికి పట్టణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.72 వేల రూపాయలను అందిస్తోంది. కేంద్ర వాటాగా రాష్ట్రానికి మరో రూ.1000 కోట్లు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 80.54 లక్షల దరఖాస్తులు రాగా అధికారులు వాటిని ఇందిరమ్మ ఇళ్ల యాప్‌తో సర్వే జరిపి ఎల్- 1,2,3 విభాగాలుగా వర్గీకరించారు.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై దృష్టి : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ప్రతి నియోజక వర్గానికి 3500 ఇళ్ల చొప్పున, ప్రతి గ్రామంలో లబ్ధిదారుల ఎంపిక ఉండేలా జాబితాను సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. మొదటి విడతలో మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి 72 వేల లబ్ధిదారులతో జాబితాను రూపొందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ గ్రామాన్ని వదిలేసి మిగతా గ్రామాల నుంచి ఇందిరమ్మ కమిటీలు లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నాయి. పలు నియోజకవర్గాల్లో సంబంధిత జాబితాలు ఎమ్మెల్యేల చేతికి వెళ్లాయి. లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేల సూచనలను కూడా అధికారులు పరిగణనలోకి తీసుకుంటూ, మొత్తంగా రెండు విడతల్లో కలిపి రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల మందితో జాబితా రూపొదించారు. దాన్ని ఈ నెలాఖరులోగా లబ్ధిదారులను ప్రకటించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూన్ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో అప్పటిలోగా కనీసం పునాది, పిల్లర్ల వరకు నిర్మాణాలు పూర్తి చేయనున్నారు.
అలాగే లబ్ధిదారుల ఖాతాలో సంబంధిత సొమ్ము జమచేసేందుకు సర్కారు సిద్ధమవుతోంది. అందుకు అనుగుణంగా అధికారులు కూడా ఆ ప్రక్రియను వేగవంతం చేశారు. మొదటి విడతలో మండలానికి ఒక గ్రామం చొప్పున 72 వేల మంది లబ్ధిదారులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో చాలా మంది అనర్హులు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో 72 వేల మందికి గాను 42 వేల మందికే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల మంజూరు పత్రాలను ప్రభుత్వం జారీ చేసినట్లు సమాచారం. మిగతా 30 వేల మంది లబ్ధిదారులపై మళ్లీ విచారణ చేపడుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో రెండో జాబితాలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా క్షేత్రస్థాయిలో జల్లెడ పట్టాలని జిల్లా అధికారులకు గృహ నిర్మాణశాఖ నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఇటీవల జరిగిన సమావేశంలోనూ ఈ మేరకు గృహ నిర్మాణశాఖ అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందికి మార్గదర్శకం చేసి ఆ విధంగా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
లబ్దిదారులను గుర్తించేందుకు ఇంటింటి సర్వే : నిరుపేదలకు ఆవాస సదుపాయం కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ’ఇందిరమ్మ’ పేరిట ఇళ్లు నిర్మించనున్న విషయం తెలిసిందే. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం ఇంటింటి సర్వే నిర్వహిస్తోంది. పథకం లబ్ధిదారులు అందుబాటులో ఉన్న స్థలంలోనే రూ.5 లక్షలతో అందంగా ఎలా ఇంటిని కట్టుకోవాలో అధికారులు సుదీర్ఘ కసరత్తు చేశారు. ఇందుకు సంబంధించి 2 నమూనాలు రూపొందించారు. ఆయా నమూనాల్లో ఇళ్లను నిర్మించుకునేందుకు వీలుగా లబ్ధిదారులకు అవగాహన కోసం అక్కడక్కడ ఓ మోడల్ గృహం నిర్మించారు. ఈ పద్ధతుల్లో ఇంటి పనులు చేపడితే రూ.5 లక్షలతోనే పూర్తి చేయొచ్చునని అధికారులు చెబుతున్నారు. మోడల్ నిర్మాణాల కోసం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా స్థలాలను ఇప్పటికే ఎంపిక చేశారు. ఎంపీడీవో కార్యాలయంలో వీటిని నిర్మించాల్సి ఉండగా స్థలాభావం వల్ల కొన్ని చోట్ల తహసీల్దార్ కార్యాలయాల్లో ఏర్పాటు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల మందితో జాబితా : జూన్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగే అవకాశం ఉండడంతో ఈ ఎన్నికల లోపు ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. మొదటి విడతలో ఎంపిక చేసిన గ్రామాలను కాకుండా మిగతా గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీల లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. మరికొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు జాబితాలు అందాయి. లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేల సలహాలు కూడా తీసుకుంటున్నారు. మొత్తం రెండు విడతల్లో రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల మందితో జాబితా తయారు చేస్తున్నారు. తుది జాబితాను ఈ నెలాఖరులోగా ప్రకటించనున్నట్లు తెలిసింది.