Thursday, January 23, 2025

హరితహారం స్ఫూర్తితో అభయారణ్యాలు అభివృద్ధి

- Advertisement -
- Advertisement -

అటవీశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి శాంతికుమారి

More greenary with Haritha haram

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో హరితహారం విజయవంతం చేసినట్లే.. రక్షిత అటవీ ప్రాంతాలు, టైగర్ రిజర్వులు, అభయారణ్యాలను అభివృద్ది చేసుకోవాలని అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ. శాంతికుమారి అన్నారు. శనివారం అరణ్యభవన్‌లో అటవీ ప్రాంతాల రక్షణ, టైగర్ రిజర్వుల సమర్థ నిర్వహణ, ఎకో టూరిజం అభివృద్దిపై సంబంధిత జిల్లాలకు చెందిన అటవీ అధికారులతో సదస్సు నిర్వహించారు. పర్యావరణ పర్యాటక పరంగా రాష్ట్రంలో చాలా చక్కని అవకాశాలు ఉన్నాయని, అందుబాటు వనరులను సద్వినియోగం చేసుకుంటూ వాటిని అభివృద్ది చేయాలని స్పెషల్ సిఎస్ ఈ సందర్భంగా సూచించారు.

రాష్ట్రంలో హరితహారం విజయవంతం ద్వారా అటవీశాఖ రోల్ మోడల్ గా నిలిచిందని, అదే విధంగా టైగర్ రిజర్వులు, అభయారణ్యాలు, రక్షిత అటవీ ప్రాంతాలను పూర్తి స్థాయిలో అభివృద్ది చేసుకోవాలన్నారు. తెలంగాణలో ఎక్కడ కూడా చెట్లు లేని రోడ్డు ఉండవద్దనే లక్ష్యంతో పనిచేయాలన్నారు. మిగతా రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి అడుగుపెట్టగానే హరితహారం ఫలితాలు కన్పిస్తున్నాయని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారని, అదే స్ఫూర్తితో అటవీ ప్రాంతాల పునరుద్దరణ జరగాలని కోరారు. మండు వేసవిలో వన్యప్రాణుల రక్షణ సవాల్ తో కూడుకున్నదని, అడవుల్లో ఉన్న సహజ నీటి కుంటలను కాపాడుతూనే, లేని ప్రాంతాల్లో కృత్రిమ నీటి వసతులు కల్పించాలని శాంతికుమారి కోరారు. అటవీ పునరుద్దరణ అనగానే ఇప్పుడు గజ్వేల్ గుర్తుకు వస్తోందని, అలాగే టైగర్ రిజర్వులు అనగానే అమ్రాబాద్, కవ్వాల్ పేరు చెప్పేలా పోటీ పడి పనిచేయాలని అధికారులు, సిబ్బందిని కోరారు.

ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. టైగర్ రిజర్వులు, అభయారణ్యాల్లో తాజా పరిస్థితులు, మరింత సమర్థవంగా నిర్వహణకు అవసరమైన అదనపు వనరులపై ప్రధాన అటవీ సంరక్షణ అధికారి (పిసిసిఎఫ్), అటవీ దళాల అధిపతి (హెచ్‌ఓఎఫ్‌ఎఫ్) ఆర్‌ఎం డోబ్రియాల్ సమీక్షించారు. ఒక్కో ప్రాంతం నిర్వహిస్తున్న అధికారులతో విభాగాల వారీగా చర్చించారు. అడవుల రక్షణకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం అద్భుతంగా ఉందని, పూర్తి స్థాయిలో బ్లాకుల వారీగా అటవీ పునరుద్దరణ, టైగర్ రిజర్వుల్లో రక్షణ, గడ్డి మైదానాల పెంపు, నీటి వసతుల నిర్వహణ, పర్యావరణహిత ఎకో టూరిజం ప్రాంతాల గుర్తింపు- అభివృద్ది జరగాలని పిసిసిఎఫ్ సూచించారు. రక్షిత అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణ, చెట్ల నరికివేత, వన్య ప్రాణుల వేట పూర్తి స్థాయిలో అరికట్టడమే లక్ష్యంగా సిబ్బంది పనిచేయాలని తెలిపారు. సమావేశంలో పిసిసిఎఫ్ (కంపా) లోకేష్‌జైస్వాల్, పిసిసిఎఫ్ (అడ్మిన్) స్వర్గం శ్రీనివాస్, అదనపు పిసిసిఎఫ్‌లు వినయ్ కుమార్, ఎంసీ పర్గెయిన్, ఏకే సిన్హా, అమ్రాబాద్, కవ్వాల్ ఫీల్డ్ డైరెక్టర్లు శ్రీనివాస్, వినోద్‌కుమార్, అభయారణ్యాలకు చెందిన చీఫ్ కన్జర్వేట్లరు, జిల్లా అటవీ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News