హైదరాబాద్: దేశంలో తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం అని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. వ్యవసాయాధారిత పరిశ్రమలు, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర పార్కుల అభివృద్ధికి చర్యలు చేపడుతుందని, దేశవాసులకే కాదు, యావత్ ప్రపంచానికి తెలంగాణ పెట్టుబడుల స్వర్గధామం అని అన్నారు. మ్యారీగోల్డ్ హోటల్‌లో 41వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పాల్గొన్నారు. 2024-25 వార్షిక రుణ ప్రణాళికపై విస్తృత సమావేశంలో భట్టి మాట్లాడారు.
రాజధానిలో ఒఆర్ఆర్ , ఎయిర్ పోర్టు, చౌకగా మానవ వనరులు, మంచి వాతావరణం, ఫ్రెండ్లీ గవర్నమెంట్, కాస్మోపాలిటన్ సిటీ, భాషా సమస్య లేదన్నారు. అర్బన్, సెమీ అర్భన్, గ్రామీణ ప్రాంతాలను క్లస్టర్లుగా విభజించి అభివృద్ధి చేస్తామన్నారు. తెలంగాణలో శాంతి భద్రతలకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. బలహీన వర్గాలకు రుణాలు ఇస్తేనే తెలంగాణ అభివృద్ధి సాధిస్తుందని, సబ్సిడీ పథకాలకు సంబంధించి ప్రభుత్వం తన వాటాను విడుదల చేస్తున్న బ్యాంకర్లు ఎందుకు సహకరించడం లేదని భట్టి ప్రశ్నించారు. సాధారణంగా బ్యాంకర్లు మంజూరులు ఇచ్చినప్పటికీ సబ్సిడీ మొత్తం విడుదలలో జాప్యం జరుగుతుంది కానీ రాష్ట్రంలో ఎందుకు వ్యతిరేకంగా పరిస్థితి కనిపిస్తుందో అర్థం కావడం లేదన్నారు.
రుణాల విషయంలో ప్రైవేట్ బ్యాంకులు లక్ష్యాలు సాధిస్తున్నప్పటికీ, జాతీయ బ్యాంకులు వెనుకంజ లో ఉంటున్నాయని, జాతీయ బ్యాంకుల బ్రాంచీల సంఖ్య తగ్గడం మంచిది కాదననారు. జాతీయ, గ్రామీణ బ్యాంకులు విస్తృతంగా బ్రాండ్ ఇమేజ్ ని ప్రచారం చేసుకోవాలని, ఈ మధ్యకాలంలో జనం ఎక్కువగా ప్రైవేటు బ్యాంకుల వైపు వెళుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయని వివరించారు. బ్యాంకర్లకు పాజిటివ్ దృక్పథం లేకపోతే ఏ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందదన్నారు. కేవలం బడా పారిశ్రామిక వేత్తలకే కాకుండా నిరుపేదలు, మధ్యతరగతి వర్గాలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలని భట్టి కోరారు.