ఎంఎస్‌ఎంఈ పాలసీ 2024తో పారిశ్రామికవేత్తలకు రాయితీలు
దావోస్ పర్యటనతో 14,900 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు
ఈ ఏడాది పరిశ్రమల శాఖకు 3,527 కోట్ల నిధులు
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి రూ. 774 కోట్లు
మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రం పెట్టుబడులకు ఆకర్షణ కేంద్రంగా మారుతోంది. 2050 నాటికి తెలంగాణ రాష్ట్రం అంతటా పారిశ్రామిక వృద్ధి జరగాలనే లక్ష్యంతో మెగా మాస్టర్ ప్లాన్-2050 పాలసీని ప్రభుత్వం రూపొందించింది. హైదరాబాద్ ఒక్క చోటే పారిశ్రామిక ప్రగతి కేంద్రీకృతం కాకుండా,పారిశ్రామిక వికేంద్రీకరణ జరిపి తెలంగాణలోని అన్ని ప్రాంతాలు, హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చెందాలన్నది ఈ పాలసీ ప్రధాన లక్ష్యం. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలోను ఐటీ, ఫార్మా, హెల్త్‌తో పాటు ఫుడ్ ప్రాసెసింగ్, స్పోరట్స్, ఆటోమొబైల్, గార్మెంట్స్, మెటల్ వేర్, చేనేత, ఆభరణాల తయారీ మొదలైన క్లస్టర్లను ఏర్పాటు చేసి, పరిశ్రమలనుఅభివృద్ధి పరచడానికి కావలసిన అన్ని చర్యలు చేపడతున్నారు. అంతేకాకుండా హైదరాబాద్, వరంగల్ పారిశ్రామిక కారిడార్ ను ఎన్‌హెచ్ 163 కి ఇరువైపుల ఏర్పాటు చేయనున్నారు.
ఈ ఏడాది జనవరిలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో దావోస్‌లో జరిగిన వార్షిక సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐ.టి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొని, ప్రపంచ పారిశ్రామికవేత్తలను కలిసి వారిని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానించారు. దీంతో టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, డిఫెన్స్ , డాటా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి కీలక రంగాల్లో ఉన్న 16 ప్రపంచ అగ్రగామి కంపెనీలతో సుమారు ఒక లక్ష డ్బ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయలు (1.78 లక్షల కోట్లు) పెట్టుబడుల ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకుంది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది పెట్టుబడుల విలువ నాలుగు రెట్లు ఎక్కువ. అమెరికా, సౌత్ కొరియా, సింగపూర్ దేశాల పర్యటనలో ముఖ్యమంత్రి మరో 14,900 కోట్ల రూపాయలు పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్నారు. దీంతో పారిశ్రామిక రంగానికి ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రభుత్వం పెద్దపీట వేసింది. గత ఏడాది బడ్జెట్‌లో రూ. 2543 కోట్లను కేటాయించిన ప్రభుత్వం ఈ సారి పరిశ్రమల శాఖకు ఈ బడ్జెట్ లో 3,527 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు.
అదనంగా రూ.984 కోట్లను పెంచారు. సూక్ష్మ,చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) ఎదుర్కొంటున్న కీలక సవాళ్లను పరిష్కరించే లక్ష్యంతో ఎంఎస్‌ఎంఈ పాలసీ 2024ను తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చింది. రాబోయే ఐదేళ్లలో ఎంఎస్‌ఎంఈల అభివృద్ధి కోసం నాలుగు వేల కోట్ల రూపాయలు (4,000 కోట్లు) ఖర్చు చేసి, 25,000 కు పైచిలుకు కొత్త ఎంఎస్‌ఎంఈపరిశ్రమలను స్థాపించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పాలసీతో స్వయం సహాయక బృందాలు, ఎంఎస్‌ఎంఈ లుగా మారేందుకు అన్ని దశల్లో సహాయం అందించనున్నారు.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి రూ. 774 కోట్లు : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐ.టి ఆధారిత సేవలపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సేవా రంగం అభివృద్ధికి దోహదపడే సానుకూల ప్రభుత్వ కీలక నిర్ణయాల ఫలితం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజి రంగం గత సంవత్సరంగా ఎంతో అభివృద్ది చెందింది. కృత్రిమ మేథ, బ్లాక్ చైన్ వంటి కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీలకు ప్రాధాన్యత ఇస్తూ ఆధునిక ప్రక్రియల అభివృద్దికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఏఐ గ్లోబల్ సమ్మిట్-2024ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. యుఎస్‌ఏ, యుకె, నెదర్లాండ్స్, మలేషియాతో పాటు దాదాపు 100 దేశాల కంపెనీ యజమానులు, ఏఐ నిపుణులు, స్టార్టప్‌లు, విద్యార్థులతో సహా 10,000 మంది ప్రతినిధులు ఈ సమ్మిట్ కు హాజరయ్యారు. ఫ్యూచర్ సిటీలో అంతర్భాగంగా 200 ఎకరాల్లో ప్రత్యేకంగా ఏఐ సిటీని నిర్మిస్తున్నారు. ఈ ఏఐ సిటీ ప్రపంచంలోని పారిశ్రామిక దిగ్గజ కంపెనీలకు కేంద్రంగా మారనుంది. గూగుల్ కంపెనీ ఇక్కడ ఏఐ ఆధారిత యాక్సిలరేటర్ సెంటర్ ను నెలకొల్పేందుకు సిద్ధంగా ఉంది.
పారిశ్రామిక ప్రోత్సాహకాలు : నూతన పారిశ్రామిక పార్కుల్లో 5 శాతం ప్లాట్లు మహిళా పారిశ్రామికవేత్తలకు, 15 శాతం ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు కేటాయించాలని నిర్ణయించారు. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు 50 లక్షల రూపాయల పరిమితికి లోబడి50 శాతం వరకు భూమి ధరలో రాయితీని ఇస్తుంది. అదనంగా ప్రైవేట్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌ల అభివృద్ధిని ప్రోత్సహించడానికిప్రభుత్వం స్టాంప్ డ్యూటీ తగ్గింపులు, విద్యుత్ వినియోగ చార్జీలు, భూమి ధర రాయితీలను అందించనున్నారు. ఆర్థిక సవాళ్లను పరిష్కరించడానికి, పాలసీలో మూలధన పెట్టుబడి రాయితీ పథకాన్ని కూడా ప్రవేశపెట్టారు. అలాగే రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలో గ్రీన్ ఫీల్ ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఔషధాల తయారీ కంపెనీలకు, బయోటెక్ , లైఫ్ సైన్సెస్ కంపెనీలకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించి గ్రీన్ ఫీల్ ఫార్మా క్లస్టర్ల ఏర్పాటుకు ప్రభుత్వం తోడ్పడనుంది. యాంటీ బయాటిక్స్, సింథటిక్ డ్రగ్స్, వ్యాక్సిన్లు, న్యూట్రాస్యూటికల్స్, హెర్బల్ ఔషధ ఉత్పత్తులు, కాస్మోటిక్స్ సంబంధిత ఉత్పత్తులన్నింటికీ ఫార్మా సిటీలో ప్రాధాన్యత ఉంటుంది.