Saturday, November 23, 2024

కృష్ణానదిపై మరిన్ని ఎత్తిపోతలు

- Advertisement -
- Advertisement -

More lift irrigation schemes on Krishna River

జోగులాంబ బ్యారేజ్ సర్వేకు ఆదేశాలు
ప్రాథమిక అంచనా రూ.2వేల కోట్లు

సుంకేసుల, పులిచింతల, నాగార్జున సాగర్ టెయిల్‌పాండ్ ఎత్తిపోతల సర్వే పనులకూ ఉత్తర్వులు
కల్వకుర్తి ఎత్తిపోతల జలాశయాల నీటి నిల్వ సామర్థం 20టిఎంసిలకు పెంచేలా ఉత్తర్వులు
మంత్రివర్గం నిర్ణయాల అమలుకు జీఓలు విడుదల

మనతెలంగాణ/హైదరాబాద్ :కృష్ణానది జలాలాను సామర్ధ్యం మేరకు ఉపయోగించుకుని తెలంగాణ రాష్ట్రానికి నీటివాటాలో జరిగిన అన్యాయాలను సరిదిద్దేందుకు టిఆర్‌ఎస్ సర్కారు చకచకా పనులు చేపట్టింది. ఇటీవల సిఎం కెసిఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు కృష్ణానదిపై కొత్త ఆనకట్టు నిర్మాణంతోపాటు పలు ప్రతిపాదిత కొత్త పథకాల పనుల సర్వేకోసం రాష్ట్ర ప్రభుత్వం గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణానదిపైన 256మీటర్ల స్థాయిలో ఆనకట్ట నిర్మాణానికి అవకాశం ఉన్నట్టు ప్రాధమికంగా అంచనా వేసింది. ఈ ఆనకట్ట నిర్మాణం కోసం సుమారు రూ.2వేలకోట్లు అవసరం అని అంచనావేసింది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేసేందుకు డిపిఆర్ బాధ్యతలను త్వరలోనే కన్సల్టెన్సీ సంస్థకు అప్పగించనున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం గొందిమల్ల , వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం వెల్లటూరు గ్రామాల మధ్యన బ్యారేజి నిర్మాణానికి అనుకూలతలు ఉన్నాయని ఇప్పటికే నీటిపారుదల రంగం నిపుణులు ప్రభుత్వానికి నివేదిక అందచేశారు.

ప్రతిపాదిత బ్యారేజి నిర్మాణం ద్వారా పాలమూరురంగారెడ్డి ,కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల ఆయకట్టుకు సాగునీరందిచాలనేది ఈ పథకం ప్రధాన లక్షంగా ఎంచుకున్నారు. అనకట్టతోపాటు ఇతర ప్రాజెక్టుల నిర్మాణ పనుల సర్వేకోసం ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.కృష్ణానది తుంగభద్ర నది కలిసే చోట 40టిఎంసిల నీటిని నిలువ చేసేలా జోగులాంబ ఆనకట్ట నిర్మాణం తలపెట్టింది.తెలంగాణ రాష్ట్రంలోకి భీమా నది ప్రవేశించే నారాయణ పేట జిల్లా కుసుమర్తి వద్ద వరద కాలువ నిర్మాణం చేపట్టి రోజుకు ఒక టిఎంసి నీటిని తరలించేలా భీమా వరద కాలువ నిర్మాణం చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్దం చేయిస్తోంది. అదే విధంగా అలంపూర్ ,గద్వాల ప్రాంతాల్లోని 2లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు సుంకేసుల జలాశయం వద్ద ఎత్తిపోతల పథకం నిర్మానాన్ని చేపట్టేందుకు సర్వేకు ఆదేశాలిచ్చింది.

ఈ ఎత్తిపోతల పథకం ద్వారా నడిగడ్డ ప్రాంతంలో లక్ష ఎకరాలకు సాగునీటిని అందించాలని లక్షంగా పెట్టుకుంది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద జలాశయాల నీటి నిలువ సామర్ధాన్ని 20టిఎంసిలకు పెంచేందుకు అవసరమైన సర్వే పనులకు ఆదేశాలిచ్చింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 2లక్షల ఎకరాలకు సాగునీటిని అందచేసేందుకు పులిచింతల వద్ద ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టబోతోంది. నాగార్జనసాగర్ టెయిల్ పాండ్ నుంచి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి ఎగువ ప్రాంతాలకు చెందిన 2లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించేందుకు అవసరమైన సర్వేపనులకోసం ఆదేశాలిచ్చింది.

61ప్యాకేజిల పనులకు గడువు పెంపు:

తెలంగాణలో చేపట్టిన వివిధ నీటిపారుదల ప్రాజెక్టు పనుల పూర్తికి గడువు పొడిగించారు. పలు కారణాలతో అలస్యమైన పనుల పూర్తి కోసం గడువు పెంచారు. ఈ మేరకు నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.జలయజ్ఞంలో భాగంగా రాష్ట్రంలో చేపట్టిన వివిధ నీటిపారుదల ప్రాజెక్టు పనుల పూర్తికి గడువు పొడిగించారు. పలు కారణాలతో ఆలస్యమైన పనుల పూర్తి కోసం గడువు పెంచారు. భూసేకరణ, సహాయ, పునరావాస చర్యల్లో ఆలస్యం, పనుల స్వరూపంలో మార్పులు, ఇతర కారణాల వల్ల ఆలస్యమైన పనుల పూర్తికి అవకాశం ఇచ్చారు.కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, దేవాదుల, ఎస్సారెస్పీ రెండో దశ, ఎల్లంపల్లి, కోయిల్ సాగర్, వరదకాల్వ, ఏఎమ్మార్పీ, ఎస్సెల్బీసీ సొరంగం, కుమురం భీం ప్రాజెక్టులకు చెందిన 61 ప్యాకేజీల పనుల గడువును పొడిగించారు. గతంలో జారీ చేసిన 146వ జీఓలోని అంశాలు ఈ పనులకు వర్తించనున్నాయి. ఈ మేరకు నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు

ప్రాజెక్టుల పూర్తికి రూ.1.10లక్షల కోట్లు అవసరం :

బంగారు తెలంగాణ లక్షంగా రాష్ట్రంలో కోటి ఎకరాలక సాగునీటి కలను సాకారం చేసే దిశగా కెసిఆర్ సర్కారు పెద్ద సాహసానికే పూనుకుంది. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి మరో రూ. లక్షా పదివేల కోట్లు అవసరమవుతాయి. అందులో 90 శాతానికి పైగా నిధులను 5 ప్రాజెక్టుల్లో ఖర్చు చేయాల్సి ఉంది. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోతల, దేవాదుల, డిండి ఎత్తిపోతల పథకాలకే రూ. 98 వేల కోట్లు వెచ్చించాల్సి ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి చేసిన కేటాయింపులను పరిగణనలోకి తీసుకుంటే ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయిలో సిద్ధం కావడానికి కనీసం మూడు నుంచి నాలుగేళ్లు పట్టనుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News