బెల్‌గ్రేడ్: కెరీర్ ముగిసేలోగా మరిన్ని గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించడమే తన ముందున్న ఏకైక లక్షమని సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్ స్పష్టం చేశాడు. పూర్తి ఫిట్‌నెస్‌తో ఉంటే అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించిన ఆటగాడిగా తాను నిలువడం ఖాయమన్నాడు. ప్రస్తుతం తన దృష్టంతా మెరుగైన ప్రదర్శన చేయడంపైనే కేంద్రీకృతమైందన్నాడు. ప్రస్తుతం పురుషుల సింగిల్స్‌లో ఆటగాళ్ల మధ్య తీవ్ర పోటీ నెలకొందన్నాడు. స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్‌తో పాటు డొమినిక్ థిమ్, సిట్సిపాస్, రుబ్లేవ్, మెద్వెదేవ్, బెర్రెటెని, షావర్ట్‌మాన్ వంటి ప్రతిభావంతులు నిలకడైన ఆటతో ముందుకు సాగుతున్నారన్నాడు.
దీంతో వీరి పోటీని తట్టుకుని టైటిల్స్ సాధించడం అనుకున్నంత తేలికేం కాదన్నాడు. గతంలో తనకు ఫెదరర్, నాదల్, ముర్రేలతోనే పోటీ ఉండేదన్నాడు. కానీ ప్రస్తుతం చాలా మంది యువ ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారన్నాడు. దీంతో పురుషుల సింగిల్స్‌లో విపరీత పోటీ నెలకొందన్నాడు. పోటీని తట్టుకుని ముందుకు సాగడంపైనే తాను దృష్టి పెట్టానని జకోవిచ్ స్పష్టం చేశాడు. ఓ వార్త సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో ఈ విషయాలు వెల్లడించాడు.