తొలి రోజే రూ. 40 వేల కోట్లు దాటిన ఆదాయం!
ఐపిఎల్ ప్రసార హక్కుల కోసం హోరాహోరీ
ముంబై : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మీడియా హక్కుల సంబంధించిన ఈవేలం భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ)పై కాసుల వర్షం కురిపిస్తోంది. 2023-2027 కాలానికి గాను ముంబైలో బిసిసిఐ ఈ వేలం నిర్వహిస్తోంది. ఆదివారం ఈ ప్రారంభమైంది. ఈ వేలంను నాలుగు ప్యాకేజీలుగా విభజించి నిర్వహిస్తున్నారు. ఇక ఆదివారం మధ్యాహ్నం ఈ వేలం నిలిపి వేసే సమయానికి ఐపిఎల్ మీడియా హక్కుల విలువ రూ.40 వేల కోట్ల మార్కును దాటిందని బిసిసిఐ వర్గాల ద్వారా తెలిసింది. తొలుత ఉప ఖండంలో టివి హక్కులు, ఆ తర్వాత డిజిటిల్ హక్కుల విభాగానికి వేలం నిర్వహిస్తున్నారు. టివి ప్రసార హక్కుల కోసం ఒక్కో మ్యాచ్‌కు రూ. 49 కోట్లు బేస్ ప్రైజ్‌గా నిర్ణయించారు. ఇక ఒక్కో మ్యాచ్‌కు డిజిటిల్ హక్కులను రూ.33 కోట్లుగా నిర్ణయించారు. ఇప్పటి వరకు లభించిన సమాచారం ప్రకారం టివి ప్రసార హక్కుల వేలం రూ,24 వేల కోట్లకు చేరింది. మరోవైపు డిజిటిల్ హక్కుల వేలం రూ.19 వేల కోట్లు దాటింది. ఇక సోమవారం కూడా ఈ వేలం కొనసాగనుంది. ప్రస్తుతం వేలం పాట సాగుతున్నతీరును గమనిస్తే ప్రసార హక్కుల ద్వారా బిసిసిఐకి దాదాపు 60 వేల కోట్ల రూపాయల ఆదాయం లభించడం ఖాయంగా కనిపిస్తోంది. మీడియా ప్రసార హక్కుల రేసులో డిస్నీ స్టార్, సోనీ నెట్‌వర్క్, వయాకామ్ రిలయన్స్ 18, జీ నెట్‌వర్క్, ఫన్ ఆసియా, సూపర్ స్పోర్ట్, టైమ్స్ ఇంటర్నెట్‌లు పోటీ పడుతున్నాయి.