మన ఆలోచనలను, భావాలను ఒకరితో ఒకరు పంచుకోవడానికి భాష చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రపంచంలో అనేక భాషలు ఉన్నాయి. చాలా దేశాలకు ఒక జాతీయ భాష కూడా ఉంది. అయినా ప్రపంచీకరణ నేపథ్యంలో ఆంగ్లభాష డిమాండ్ పెరుగుతూ ఉంది.ఇదీ ప్రపంచంలో ఉమ్మడి దేశాల భాషగా, అంతర్జాతీయ భాషగా చలామని అవుతుంది. దేశాల మధ్య అంతరాన్ని తగ్గించి, అందరికీ విస్తృత అవకాశాలను ఆంగ్ల భాష అందిస్తున్నది. భారతదేశంలో బహుళ ప్రాంతీయ భాషలు ఉన్నాయి. కానీ ప్రొఫెషనల్ లాంగ్వేజ్‌గా ఇంగ్లీష్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రపంచ దేశాలు కమ్యూనికేషన్ ప్రధాన వనరుగా ఆంగ్ల భాషను స్వీకరించడం వలన ప్రయాణం, పర్యాటకం, విద్య, వ్యాపారం, వినోదం, సైన్స్, టెక్నాలజీ మొదలైన వాటిలో అంతర్జాతీయ సంబంధాలు మెరుగుపడ్డాయి.
ఆంగ్లంలో రాయబడిన పుస్తకం, ప్రాంతీయ భాషలో రాయబడిన పుస్తకం కంటే చాలా బాగా చేరుకుంటుంది. ప్రాంతీయ భాషకు పరిమితులు ఉంటా యి, అది తెలియని ఎవరైనా దానిని అర్థం చేసుకోలేరు. ఫలితంగా, ప్రేక్షకులు తక్కువగా ఉంటారు. కానీ ఇంగ్లీష్ వంటి సాధారణ భాషకు ఈ పరిమితి ఉండదు. మొదట ఇంగ్లాండ్ జాతీయ భాషగా ఇంగ్లీషు ఉండేది. తరువాత, బ్రిటిష్ సామ్రాజ్యవాదం, వలసరాజ్యాల ఫలితంగా ఈ భాష అనేక దేశాలకు పరిచయమైంది. చివరికి ఇది భారతదేశం, ఆస్ట్రేలియా, శ్రీలంక, కెనడా మొదలైన వారి కాలనీలలో ప్రాథమిక, ద్వితీయ భాషగా మారింది. బ్రిటిష్ వారి పరిపాలన అంతరించినప్పటికీ… వారి భాష ఇప్పటికీ దాదాపు సగానికి పైగా ప్రపంచాన్ని శాసిస్తుంది. నేడు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 67 దేశాలు ఇంగ్లీషును అధికారిక భాషగా ప్రకటించుకున్నాయి. ప్రపంచ జనాభాలో నాలుగో వంతు ఇంగ్లీష్ భాషను మాట్లాడతారు. చిన్న వయస్సులోనే విద్యార్థులు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అనేక దేశాలు తమ పాఠశాల పాఠ్యాంశాల్లో ఇంగ్లీషును రెండవ భాషగా చేర్చాయి. ఈ క్రమంలో భారత్ సైతం ఇంగ్లీష్ భాషను రెండో భాషగా స్వీకరించింది.
ప్రపంచీకరణ నేపథ్యంలో భారత్ ఆంగ్లభాషణను పుణికిపుచ్చుకొని ముందుకు పోతున్నది. ఆంగ్లభాష సంభాషణా నైపుణ్యంలో ప్రపంచ సగటు (54) కంటే భారత్ (57) మెరుగ్గా ఉందని గ్లోబల్ ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ పేరుతో పియర్సన్ సంస్థ నిర్వహించిన సర్వే వెల్లడించింది. ఇంగ్లీష్ ప్రధాన వ్యాపార భాష, ప్రపంచ శ్రామికశక్తిలోకి ప్రవేశించాలంటే ప్రజలు ఇంగ్లీష్ మాట్లాడటం దాదాపుగా అవసరంగా మారింది. ఆంగ్ల పరిజ్ఞానం మెరుగైన కెరీర్‌కు, అధిక ఆదాయానికి దారితీస్తుంది. మంచి ఆంగ్ల కమ్యూనికేషన్ నైపుణ్యాలు జీవితంలో ముందుకు వెళ్లడానికి అతి ముఖ్యమైన సాఫ్ట్ స్కిల్స్. అందుకే పాఠశాల దశనుంచి అన్ని సబ్జెక్టులను ఆంగ్ల మాధ్యమంలో బోధించినప్పుడు విద్యార్థులు భవిష్యత్తులో బాగా రాణించగలరు. అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలకు వ్యాపారం, ఉపాధి, శ్రేయస్సును పెంచడానికి ఆంగ్లం ప్రధానంగా మారింది. కావున విద్యా వ్యవస్థలలో ఆంగ్ల భాషకు అపారమైన డిమాండ్ ఉంది. పాఠశాలల్లో ఇంగ్లీష్ ఒక ప్రధాన బోధనా మాధ్యమంగా మారింది. సగటు తల్లిదండ్రులు సైతం ఇంగ్లీష్ మీడియంలో తన పిల్లలు చదివిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక దశ నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాయి. పుస్తకాలను కూడా ఆంగ్లంలో ముద్రిస్తున్నారు. ఉపాధ్యాయులకు ఇంగ్లీష్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇదీ గొప్ప ముందడుగు. ఇటీవల ఇంగ్లీష్ భాషపై పట్టు సాధించడానికి తెలంగాణ ప్రభుత్వం ‘ఇంగ్లిష్ దినోత్సవం’గా సరోజినీనాయుడు జయంతి అయిన ఫిబ్రవరి 13 జరపనున్నారు. ఆమె ప్రముఖ కవయిత్రి, స్వాతంత్య్ర సమరయోధురాలు. ఆమె జయంతిని ఈ సంవత్సరం నుంచి ఇంగ్లిష్ భాషా దినోత్సవంగా జరపాలని విద్యాశాఖ ఇప్పటికే ఆదేశించింది. ఈ రోజున పాఠశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస, స్టోరీ రైటింగ్ పోటీలు నిర్వహించనున్నారు. తద్వారా విద్యార్థుల్లో ఆంగ్లం ప్రాముఖ్యతను వివరిస్తారు. పిల్లలను భవిష్యత్తు వ్యవస్థాపకులు, వైద్యులు, శాస్త్రవేత్తలు, ఇంజినీర్లుగా తయారు చేయడానికి, చిన్నప్పటి నుండే ఆంగ్లంతో పాటు బహుభాషా అభ్యాసాన్ని ప్రోత్సహించాలి. ఆంగ్ల భాష మంచిది అయినప్పటికీ మన జీవితాలపై ఆంగ్ల భాష ప్రభావంతో మాతృభాషను విస్మరించవద్దు.
(నేడు రాష్ట్ర ఆంగ్ల భాషా దినోత్సవం)
సంపతి రమేష్ మహారాజ్
7989579428