రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువా అనే ప్రాచీన నానుడి రాచరిక పాలనకు సంబంధించినది. ఆధునిక ప్రజాస్వామిక ప్రభుత్వాలు కూడా ఇదే పద్ధతి పాటిస్తున్నాయి. ప్రజా ప్రభుత్వాలు అనిపించుకోడానికి కనీస అర్హతను కూడా కోల్పోతున్నాయి. నేటి మన కేంద్ర పాలకుల నిర్ణయాలను పరిశీలించినప్పుడు వీరు కూడా రాచరిక నిరంకుశత్వాన్ని చలాయించడానికే ఇష్టపడుతున్నారని రుజువవుతున్నది. కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీలో ప్రజా ప్రభుత్వాన్ని నామమాత్రం చేసి లెఫ్టినెంట్ గవర్నర్‌కు సర్వాధికారాలు కట్టబెడుతూ ప్రధాని మోడీ ప్రభుత్వం తాజాగా రూపొందించిన బిల్లు చట్టంగా మారితే దేశ రాజధాని నిస్సందేహంగా కేంద్రం నిరంకుశత్వ చెప్పుచేతల్లోకి జారుకుంటుంది. లెఫ్టినెంట్ గవర్నర్ పాత్ర, అధికారాలను నిర్వచించే పేరిట రూపొందించిన ఈ బిల్లును సోమవారం నాడు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. పాలక పక్షానికి లోక్‌సభలో తిరుగులేని, ఎదురులేని ఆధిక్యత ఉన్నందున అక్కడ అది సుళువుగానే ఆమోదం పొందుతుంది.
ఈ బిల్లు ప్రకారం ఢిల్లీ ప్రభుత్వమంటే లెఫ్టినెంట్ గవర్నరే (ఎల్‌జి), శాసన సభకు, ముఖ్యమంత్రికి ఎటువంటి స్వతంత్ర అధికారాలు ఉండవు. అవి తీసుకునే నిర్ణయాలన్నింటినీ ముందుగా లెఫ్టినెంట్ గరవ్నర్‌కు పంపించి ఆమోదం తీసుకోవలసి ఉంటుంది. 2018లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుకి ఇది పూర్తి విరుద్ధమైనది. ఢిల్లీ ప్రభుత్వం తన నిర్ణయాలను ఎల్‌జి ఆమోదానికి పంపించనవసరం లేదని, నిర్ణయం తీసుకున్న తర్వాత దాని నకలును పంపిస్తే చాలని ఆ తీర్పు స్పష్టంగా చెప్పింది. అందుకు పూర్తి విరుద్ధమైన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకు రాదలచింది. ఇక ఢిల్లీ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి ఏమి విలువ ఉంటుంది, అటువంటి అసెంబ్లీ, ప్రభుత్వం ఉనికికి నిరర్ధకమైపోదా? కేంద్ర పాలిత రాష్ట్రాల్లో లెఫ్టినెంట్ గవర్నర్‌కు, ప్రభుత్వానికి మధ్య లడాయి కొత్తది కాదు. ఇటీవలే పుదుచ్చేరిలో అక్కడి మాజీ గవర్నర్ కిరణ్ బేడీకి ముఖ్యమంత్రి నారాయణస్వామికి మధ్య భగ్గుమన్న విభేదాలు దాదాపు వ్యక్తిగత స్థాయికి చేరిపోయి రాజ్‌భవన్‌ను సమాంతర ప్రభుత్వ కార్యాలయంగా మార్చివేసిన పరిణామం తెలిసిందే.
కేంద్రం నుంచి తనకున్న మద్దతును ఆసరా చేసుకొని ఆమె అక్కడి ప్రభుత్వాన్ని అడుగడుగునా అడ్డుకున్న తీరు రాజ్‌భవన్ నిరంకుశ పాలనగా మార్చిన విషయం అనుభవమే. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు అక్కడి ప్రభుత్వాలకు తలెత్తిన వివాదాలు, విభేదాలు తక్కువేమీ కాదు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం నుంచి ఎదుర్కొన్న కష్టనష్టాలు ప్రపంచానికి తెలుసు. పుదుచ్చేరిలోనైతే ముఖ్యమంత్రి స్వయంగా లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం వద్ద నిరసన దీక్ష చేశారు. ఇటువంటి అవాంఛనీయ పరిస్థితులను శాశ్వతంగా తొలగించడానికి కేంద్ర పాలిత ప్రాంతాలను, లెఫ్టినెంట్ గవర్నర్ పదవిని పూర్తిగా రద్దు చేసి మామూలు రాష్ట్రాలుగా వాటిని మార్చడానికి గల అభ్యంతరమేమిటో తెలియదు. కేంద్రంలోని పాలకుల నిరంకుశాధికార దాహాన్ని చల్లార్చుకోడానికే గవర్నర్లను కీలుబొమ్మలుగా చేసుకొని లెఫ్టినెంట్ గవర్నర్లను ప్రజా ప్రభుత్వాలకు గుదిబండగా మార్చివేశారు. ఈ విషయం ప్రస్తుత ఎన్‌డిఎ ప్రభుత్వం హయాంలో మరింత స్పష్టంగా రుజువవుతున్నది. అందుకు పరాకాష్ఠే ఢిల్లీ పాలనపై లెఫ్టినెంట్ గవర్నర్ పెత్తనాన్ని మరింతగా రుద్దే బిల్లు రూపకల్పన అనవలసి ఉంది.
తమను ఎన్నుకోని రాష్ట్రాల్లో పరోక్షంగా తమ పాలనను రుద్దడానికి ఎన్‌డిఎ పాలకులు ఎంత మాత్రం వెనుకాడడం లేదని అర్ధ ఫెడరల్ రూపాన్ని సంతరించుకున్న భారత దేశంలో పూర్తి కేంద్రీకృత పాలనను మరింతగా గట్టిపరచడమే లక్షంగా కేంద్రం పావులు కదుపుతున్నదని స్పష్టపడుతున్నది. రాష్ట్రాల జాబితాలోని వ్యవసాయ రంగం మీద కూడా తనంత తానుగా పట్టు పెంచుకొని తీసుకు వచ్చిన వివాదాస్పద సాగు చట్టాలు ఇందుకు ప్రబల తార్కాణాలు. ఢిల్లీ ప్రభుత్వమంటే లెఫ్టినెంట్ గవర్నర్ అని నిర్వచించిన బిల్లు ఎన్నికైన ప్రభుత్వం ఊపిరి తీస్తుందని అక్కడి ఆప్ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. బిల్లులోని 33వ సెక్షన్ అసెంబ్లీ ఏ విషయం మీదనైనా కమిటీలను నియమించకుండా నిషేధించింది. ఈ నిబంధన వెనుకటి తేదీ నుంచి అమలయ్యేలా నిర్ణయం తీసుకుంది. అంటే అక్కడి ప్రజా ప్రభుత్వం కాళ్లూ చేతులను కట్టి వేసిందని ప్రత్యేకించి చెప్పనక్కర లేదు. ఢిల్లీ ప్రజలు తమను తిరస్కరించడంతో బిజెపి పాలకులు అక్కడ ఎన్నికైన ప్రభుత్వ అధికారాలను మూలమట్టంగా నరికివేయడానికి నిర్ధారించుకున్నారని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు. ఈ బిల్లు రాజ్యాంగ ధర్మాసనం తీర్పుకి విరుద్ధం కనుక న్యాయస్థానంలో వీగిపోక తప్పదు.