హైదరాబాద్: శబరిమలకు వెళ్లే అయ్యప్ప స్వామి భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ ప్రత్యేక రైళ్ల వివరాలను ద.మ.రైల్వే తన ట్విట్టర్ ఖాతాలో శనివారం వెల్లడించింది. కాకినాడ టౌన్ – శబరిమల మధ్య ఈ ప్రత్యేక రైళ్లను నడపనుంది. ప్రత్యేక రైలు (నెం.07147) జనవరి 04, 11 తేదీల్లో (మంగళవారం) సాయంత్రం 05.10 గం.లకు కాకినాడ టౌన్ నుంచి బయలుదేరి మరుసటి రోజు(బుధవారం) మధ్యాహ్నం 03.15 గం.లకు శబరిమలకు చేరుకుంటుంది. అలాగే ప్రత్యేక రైలు (నెం.07148) జనవరి 05, 12 తేదీల్లో(బుధవారం) సాయంత్రం 07.00 గం.లకు శబరిమల నుంచి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 07.30 గం.లకు కాకినాడ టౌన్‌కి చేరుకుంటుంది.
ఈ ప్రత్యేక రైళ్లు సామర్లకోట, ద్వారపూడి, రాజమండ్రి, నిడుదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట (07148 మినహా), చిత్తూరు, కాట్పాడి, జోలార్‌పేట్టై, సేలం, ఈరోడ్, కోయంబత్తూరు, పాలక్కాడ్, త్రిశూర్ రైల్వే స్టేషన్లలో ఆగనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లలో ఏసి 2 టైర్, ఏసి 3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉండనున్నాయి. పూర్తి రిజర్వేషన్లతో ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్లకు రిజర్వేషన్లు ఇప్పటికే మొదలయ్యాయి.