ఇంటర్ పరీక్షలపైనే విద్యార్థులు దృష్టి
5వ వరకు మొదటి విడత దరఖాస్తు గడువు పెంపు
మనతెలంగాణ/హైదరాబాద్ : జెఇఇ మెయిన్ తొలి విడత పరీక్షలకు రాష్ట్రంలో విద్యార్థుల హాజరు తక్కువగా ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటర్ పరీక్షలకు ముందే మొదటి విడత జెఇఇ మెయిన్ జరుగనున్న నేపథ్యంలో విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నా, హాజరు కాకపోవచ్చని పలువురు నిపుణలు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో మే 6 నుంచి ఇంటర్మీడియేట్ పరీక్షలు జరుగనుండగా, తొలి విడత జెఇఇ మెయిన్ పరీక్షలు ఈ నెల 21, 24, 25, 29, మే 1, 4 తేదీల్లో జరగనున్నాయి. కరోనా కారణంగా తరగతులు సరిగ్గా జరగకపోవడంతో ఇంటర్ బోర్డు ఈసారి కూడా సిలబస్‌ను 30 శాతం తగ్గించింది. అయితే జెఇఇ మెయిన్ సిలబస్‌ను మాత్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యథాతథంగానే ఉంచింది. దీంతో విద్యార్థులు జెఇఇ మెయిన్ సిలబస్‌ను పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సి వస్తోంది.
ఇంటర్ పరీక్షల కంటే ముందుగానే జెఇఇ మెయిన్ తొలి పరీక్షలు జరుగనున్నాయి. విద్యార్థులు పూర్తిగా ఇంటర్ పరీక్షలపైనే దృష్టి సారిస్తారు కాబట్టి ముందే జరిగే జెఇఇ మెయిన్‌కు తక్కువగా హాజరు నమోదు కావచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. కరోనాతో ఈ విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైంది. ఇంటర్ సిలబస్‌ను పూర్తి చేసి పరీక్షలకు సన్నద్ధం కావడానికే విద్యార్థులకు సమయమంతా సరిపోతోందని అధ్యాపకులు చెబుతున్నారు. జెఇఇ మెయిన్ ప్రిపరేషన్‌కు అదనపు సమయం అవసరమవుతోందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్ పరీక్షల కంటే ముందు జరిగే జెఇఇ మెయిన్ తొలివిడత పరీక్షలకు విద్యార్థులు సంసిద్ధం కాలేకపోతున్నారని పేర్కొంటున్నారు. దీంతో తొలివిడత పరీక్షకు నమోదు చేసుకున్నా హాజరు కావడం కష్టమేనని చెబుతున్నారు. ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాక నిర్వహించే రెండో విడత జెఇఇ మెయిన్ పరీక్షలకు విద్యార్థులు సిద్ధంగా ఉంటారని పేర్కొంటున్నారు. మెయిన్ రెండో సెషన్ పరీక్షలు మే 24 నుంచి 29 వరకు జరగనున్నాయి.
మొదటి విడత దరఖాస్తు గడువు పొడిగింపు
జెఇఇ మెయిన్ తొలి విడత దరఖాస్తు గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) పొడిగించింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 31తో దరఖాస్తు గడువు ముగియగా, తాజాగా దానిని ఈ నెల 5వ తేదీ వరకు ఎన్‌టిఎ పొడిగించింది. ఈ నెల 21, 24, 25, 29, మే 1, 4 తేదీల్లో జెఇఇ మెయిన్ మొదటి విడత పరీక్షలు జరుగనున్నాయి.