వచ్చే ఐదేళ్లలో భూగోళం అగ్నిగుండంలా వేడిసెగలు కక్కుతుందని ఐక్యరాజ్యసమితి గత ఏడాది హెచ్చరించడం చూస్తే అదంతా వాస్తవమే అన్న ఆందోళన ఇప్పుడు కలుగుతోంది. ఢిల్లీలో బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయానికి 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఢిల్లీయే కాదు దేశంలోని దాదాపు అన్ని నగరాల పరిస్థితి ఇదే విధంగా ఉంటోంది. రాజస్థాన్‌లోని ఫలోడీలో 2016 మే 15న 51 డిగ్రీల ఉష్ణోగ్రత అప్పటికి ఆల్‌టైమ్ రికార్డు సృష్టించగా, ఇప్పుడు ఆ రికార్డును ఢిల్లీలోని ముంగేష్‌పుర్ మే 29న అధిగమించడం విశేషం. 2019 జూన్ 1న రాజస్థాన్ చురులో 50.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ఉత్తరాదిలోని అనేక ప్రాంతాలు నిప్పుల కుంపటిలా వేడిగాలులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. గత కొన్ని రోజులుగా దేశం లోని వాయువ్య ప్రాంతాల్లోని వాతావరణ కేంద్రాల్లో 50 డిగ్రీల ఉష్ణోగ్రతను నమోదు చేస్తున్నాయి. బీహార్‌లో బుధవారం నాడు అత్యంత వేడికి 50 మంది విద్యార్థులు సొమ్మసిల్లి పోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తున్నది. వడగాడ్పుల కారణం గానే రాజస్థాన్‌లో గత వారం రోజుల్లో 33 మంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో బుధవారం 45 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చెన్నై నగరంలో కూడా మంగళ, బుధవారాల్లో 42 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.ఈ నేపథ్యంలో భూతాపం రానురాను పెరుగుతుండడమే ఈ పరిస్థితికి కారణమన్న చర్చ తెరపైకి వస్తోంది.
వచ్చే ఐదేళ్లలో 2028 నాటికి ఏదో ఒక సంవత్సరం అత్యంత అసాధారణ వేడి సంవత్సరంగా రికార్డు కెక్కుతుందని, మిగతా మూడు సంవత్సరాల్లోని రెండు సంవత్సరాల్లో ఒక సంవత్సరం కీలకమైన భూతాప పరిధి 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్ స్థాయి దాటే ప్రమాదం కనిపిస్తోందని ప్రపంచ వాతావరణ సంస్థ తాజాగా అంచనా వేసింది. 2030 లోపుగానే 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్ పరిధి దాటిపోవచ్చునేమో అన్న భయం శాస్త్రవేత్తల్లో కలుగుతోంది. గత ఏడాది మే నెలలో కూడా తెలుగు రాష్ట్రాల్లో 45.2 నుంచి 46.4 డిగ్రీల వరకు అత్యంత గరిష్ఠంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ వేడిమికి భూతాపం, ఎల్‌నినో (వర్షాభావ పరిస్థితి)ప్రధాన కారణాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అసాధారణ ఉష్ణోగ్రతల కారణంగా దేశంలో ఏటా 84 వేల మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారు.
వడగాడ్పుల తీవ్రతకు 2030 నాటికి దేశంలో 5.8 శాతం వరకు పని గంటలు తగ్గుతాయని నివేదికలు చెబుతున్నాయి. రెండేళ్ల క్రితం 2022 ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదై ఎన్నో అనర్ధాలు దాపురించాయి. దాదాపు 90 శాతం మంది తమ మనుగడ సరిగ్గా సాగక ఆదాయం కోల్పోయి దారిద్యాన్ని అనుభవించారని నివేదికల ద్వారా వెల్లడైంది. గర్భస్థ శిశువులపై కూడా వడగాడ్పులు విపరీత ప్రభావం చూపించాయి. పుట్టకుండానే తల్లి కడుపున కన్నుమూసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. 2015లో వడగాడ్పులకు 2330 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక గ్రామీణ ప్రాంతాల నుంచి ఉపాధి కోసం నగరాలకు ఏటా వలస వచ్చే కొన్ని లక్షల మంది నగరాల్లోని అసాధారణ వేడి వాతావరణానికి తట్టుకోలేకపోతున్నారు. ఉదాహరణకు 2022లో ఢిల్లీలోని 32 మిలియన్ మంది వడగాడ్పులకు నరకయాతన అనుభవించారు. ఆరుబయలు ప్రాంతాల్లోని నిర్మాణాల్లో పని చేసే కార్మికులు వడగాడ్పులు భరించలేక ఏడాదికి 162 పని గంటలు కోల్పోతున్నారని ఓ అధ్యయనంలో వెల్లడైంది.
విపరీతమైన ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు వల్ల వ్యవసాయ ఉత్పత్తులు కూడా తగ్గిపోతున్నాయి. పంజాబ్, హర్యానాల్లో గోధుమ దిగుబడి గత ఏడాది తగ్గింది. ఈ తగ్గుదల 8 శాతం వరకు ఉందని రైతులు చెప్పారు. గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఉత్పత్తి అయ్యే జీలకర్ర సాగులో 90 శాతంపై ఈ వేడి ప్రభావం పడుతోంది. అత్యధిక ఉష్ణోగ్రతలు ఇదే విధంగా కొనసాగుతుంటే రానున్న ఏడేళ్లలో జిడిపిలో 2.5 శాతం నుంచి 4.5 శాతం వరకు దేశం నష్టపోవలసి వస్తుందని మెకెన్సీ గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్ హెచ్చరించింది. వ్యవసాయం అనేది ఇతర రంగాల కన్నా వాతావరణ మార్పులకు ఎక్కువగా ప్రభావితం అవుతుంటుంది. పర్యావరణం మార్పుతో తెగుళ్లు పుట్టుకొచ్చి పంటల దిగుబడి తగ్గిపోతుంది.
కీటకాల ద్వారా శ్వాసకోశ, హృదయ కోశ వ్యాధులతో పాటు మధుమేహం, మూత్రపిండాల వ్యాధులు దాపురిస్తుంటాయి. పని చేసే సామర్ధం కోల్పోయి, కార్మికశక్తి క్షీణిస్తుంది. విద్యుత్ కొరతతో సకాలంలో వైద్య చికిత్సలు అందని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉష్ణ కార్యాచరణ ప్రణాళిక అమలు చేయడం తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ప్రణాళిక సరిగ్గా అమలు కాకుంటే అత్యధిక వేడి వల్ల దేశంలో 2050 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక ప్రగతిని సాధించాలన్న లక్షం దెబ్బతింటుంది.