పపువా న్యూ గినీ (పిఎన్‌జి)లో పర్వత ప్రాంతంలో శుక్రవారం కొండచరియలు విరిగిపడి ఒక గ్రామం నేలమట్టం కాగా, 100 మందికి పైగా దుర్మరణం చెంది ఉంటారని దక్షిణ పసిఫిక్ దేశం ప్రధాని జేమ్స్ మరాపె వెల్లడించారు. ఆ ప్రాంతంలో వెంటనే రక్షణ, సహాయ కార్యక్రమాలు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. పపువా న్యూ గినీ రాజధాని పోర్ట్ మోర్స్‌బీకి వాయువ్యంగా దాదాపు 600 కిలో మీటర్ల దూరంలో ఎంగా ప్రావిన్స్‌లోని కావ్‌కలమ్ గ్రామంపై శుక్రవారం తెల్లవారు జామున సుమారు 3 గంటలకు కొండచరియలు విరిగిపడినట్లు ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (ఎబిసి) తెలియజేసింది. మృతుల సంఖ్య 100పైనే ఉన్నట్లు అంచనా అని నివాసులు తెలియజేశారు. కాని మృతుల సంఖ్యను అధికారులు ధ్రువీకరించలేదు. ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఇంకా అధికంగా ఉండవచ్చునని గ్రామస్థులు సూచించారు.
అధికారులు స్పందిస్తున్నారని, ఆస్తి, ప్రాణ నష్టం గురించిన సమాచారం అందుబాటులో ఉన్నప్పుడు తాను వెల్లడిస్తానని ప్రధాని మరాపె తెలిపారు. ‘పరిస్థితి గురించి నాకు ఇంకా పూర్తిగా సమాచారం లేదు. అయితే, శుక్రవారం తెల్లవారు జామున కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను’ అని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘సహాయ కార్యక్రమాలు ప్రారంభించేందుకు, మృతదేహాలు వెలికితీసేందుకు, మౌలిక వసతులు పునర్నిర్మించేందుకు విపత్తు విభాగం అధికారులను, పిఎన్‌జి రక్షణ దళం, పనులు, రహదారుల విభాగం అధికారులను పంపుతున్నాం’ అని మరాపె తెలిపారు. బండరాళ్లు, చెట్ల కింద నుంచి మృతదేహాలను నివాసులు వెలికితీస్తున్న దృశ్యాలను సోషల్ మీడియాలో వీడియోలు చూపాయి. పర్వతంలో ఒక భాగం కూలిపోయినప్పుడు ఇళ్లు నేలమట్లం అయ్యాయని పోర్జెరా బంగారం గని సమీపంలోని అదే ప్రావిన్స్‌లోని పట్టణం పోర్జెరాలో ఒక మహిళా వ్యాపార సంస్థ నిర్వాహకురాలు ఎలిజబెత్ లారుమా తెలిపారు.