Saturday, November 16, 2024

అసలైన ఆదివాసుల దయనీయత

- Advertisement -
- Advertisement -

ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం ప్రపంచంలోని 100 కి పైగా దేశాలలో గిరిజన ప్రజలు నివసిస్తున్నారు. ప్రపంచంలోని గిరిజన జనాభా దాదాపు 50 కోట్లు. ఇందులో దాదాపు 5000 విభిన్న గిరిజన తెగలు ఉన్నాయి. వారికి సుమారు 7 వేల భాషలు ఉన్నాయి. అయినప్పటికీ గిరిజన ప్రజలు తమ ఉనికిని, సంస్కృతిని, గౌరవాన్ని కాపాడుకోడానికి పోరాడవలసి వసున్నది. నేడు ప్రపంచ వ్యాప్తంగా జాత్యహంకారం, వర్ణవివక్ష, సరళీకరణ వంటి అనేక కారణాల వల్ల గిరిజన ప్రజలు తమ ఉనికిని, గౌరవాన్ని నిలబెట్టుకోడానికి కష్టపడుతున్నారు. భారత దేశంలో సుమారు 705 రకాల ఆదివాసీ తెగలు వివిధ రాష్ట్రాలలో, వివిధ కేంద్ర పాలిత ప్రాంతలలో విస్తరించి ఉన్నారు. వారిలో చెప్పుకోదగిన కొన్ని ముఖ్యమైన తెగలు బిల్, గొండి, సంతాల్, ముండా, ఒరయున్, బైగా, ఇతరులు ఉన్నారు. 2011 లెక్కల ప్రకారం 10 కోట్ల నలభై రెండు లక్షల మంది, మొత్తం దేశ జనాభాలో 8.6 శాతంగా ఉన్నారు. అందులో కొంత మంది భారత రాజ్యాంగంలో పొందుపరచిన ఐదో షెడ్యూల్ ప్రాంతంలో ఉంటే, మరి కొంత మంది ఆరో షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నారు.

ఐదో షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నవారు ఈశాన్య భారతంలో, ఆరో షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న వారు మధ్య, దక్షిణ భారతంలో విస్తరించి ఉన్నారు. చట్టబద్ధంగా వీరిని ‘షెడ్యూల్డ్ తెగలు’ అని పేర్కొనగా, వారిని నేడు దేశంలో వివిధ పేర్లతో ఆదివాసులని, వనవాసులని, గిరిజనులని, ఆటవికులని పిలుస్తున్నారు. భారత దేశంలో 1951వ సంవత్సరంలో ‘షెడ్యూల్డ్ ట్రైబ్స్’ అని పేర్కొన్నారు. అయితే నేటి వరకు వీరిని అధికారికంగా ‘షెడ్యూల్డ్ ట్రైబ్స్’ అని పిలుస్తున్నారు. నేడు తెలుగు రాష్ట్రాలలో చూసినట్లయితే ఆదివాసులు లేదా గిరిజనులని వీరిని పిలుస్తున్నారు. కాకపోతే రాజ్యాంగంలో గుర్తించిన షెడ్యూల్డ్ తెగల వారందరినీ ‘ఆదివాసులని’ అంటే కుదరదు అని చెప్పవచ్చు. ఎందుకంటే కొన్ని తెగల వారు మైదాన ప్రాంతాలలో ఉంటూ అభివృద్ధికి దూరంగా ఉన్నారు. ఇటువంటి తెగల వారిని ‘ఆదివాసులని’ పిలవలేం. ఎవరైతే పూర్వం నుంచి నాగరిక (అభివృద్ధి) సమాజానికి దూరంగా అడవిలో జీవిస్తూ అడవి తల్లిని నమ్ముకొని బతికే తెగలను ఆదివాసులు అనవచ్చు.

సమాజంలోని ప్రధాన స్రవంతికి దూరంగా వున్న కారణంగా, ప్రపంచ వ్యాప్తంగా గల గిరిజన ప్రజలు ఇప్పటికీ చాలా వెనుకబడి ఉన్నారు. ఏదేమైనా ప్రధాన స్రవంతితో వారిని కలపడానికి, ముందుకు సాగడానికి వివిధ రకాల ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వేతర కార్యక్రమాలు దేశ వ్యాప్తంగానూ, ప్రపంచమంతా అమలు చేస్తున్నారు. మన దేశ విషయానికి వస్తే దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో గిరిజన సమాజంలోని ప్రజలు ఎంతో దోహదపడ్డారు. బిర్సా ముండా జార్ఖండ్, చోట నాగ్పూర్ ప్రాంతంలోనూ, కొమురం భీం తెలంగాణ ప్రాంతంలో, అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లాలో మన్యం ఆదివాసీలు, ఇంకా వివిధ ప్రాంతాల గిరిజనులు మన స్వాతంత్య్రోద్యమంలో చెప్పుకోదగ్గ పాత్ర పోషించారు. నేడు ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో, జిల్లాల్లో ఎక్కడైనా సరే ఆదివాసీలు అస్తిత్వం అంచులో కొట్టుమిట్టాడుతున్నారు. తరతరాలుగా అడవిలో, కొండలలో జంతువులతో మమేకమై వాటితో అవినాభావ సంబంధం కలిగి సహజీవనం గడిపే ఆదివాసీలు దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారు.

ఐక్యరాజ్య సమితి తీర్మానించిన విధానాలు, లక్ష్యాలు, ఆశయాలు ప్రధానంగా ఆదివాసీల స్వయంపాలన హక్కు, స్వేచ్ఛ హక్కు, మానవ హక్కులు సంరక్షించే హక్కు, సంస్కృతి, సాంప్రదాయాలు, జీవన విధానం, భాష, వేషధారణనూ రక్షించే హక్కు 5వ షెడ్యూల్, 6వ షెడ్యూల్ ఆదివాసీ భూభాగంలో ఉన్న ప్రాంతాలలోనూ రాజ్యాంగ వ్యతిరేకంగా పాలకులు పెత్తనం చేస్తున్నారు.
నేడు ఆదివాసీ ప్రాంతాలు, ఆదివాసేతర (గిరిజనేతర) రాజకీయ యంత్రాంగంలో బందీలుగా మిగిలిపోతున్నాయి. ఏజెన్సీలో ఆదివాసీ ప్రజాప్రతినిధులు గిరిజనేతర రాజకీయ పార్టీలలో కీలుబొమ్మలుగా, తోలుబొమ్మలుగా మారిపోయారు. ఆదివాసీల సామాజిక, ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా, విచారకరంగా ఉంది. దేశంలో వారు దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. అతి బీదలుగా పేదరికంలో మగ్గుతున్నారు. వారికి సరైన భూమి, ఉపాధి లేదు. వారి జీవనానికి ఎలాంటి ఆదాయ మార్గం లేదు. కట్టుబానిసలై కార్మికులుగా పని చేస్తున్నారు. జీవన భృతి కోసం కొన్ని కుటుంబాలు లిక్కర్ తయారీని ఎంచుకుంటున్నారు. కొన్ని తెగలకు చెందిన కుటుంబాలు తమ సొంత పిల్లలనే విక్రయిస్తున్నారు.

కొంత మంది మహిళలు ‘కిరాయి’ తల్లులుగా ఉంటున్నారు. పందులు, కుక్కలు వంటి జంతువుల మీద జరగాల్సిన వైద్యపరమైన కొత్త ఔషధ ప్రయోగాలకు అమాయక ఆదివాసీ తెగల కుటుంబాలు బలవుతున్నాయి. సహజ వనరులను ఆదివాసీ తెగలు సంరక్షిస్తుంటే, నాయకులు, మధ్య దళారులు బినామీ పేర్లతో వాటిని దోచుకుంటున్నారు. ఇన్ని సమస్యలు ఆదివాసీలను పీడిస్తున్నాయి. ఇంకా వారు తమ ఆరోగ్య సంరక్షణ కోసం అనాదిగా ఆచరిస్తున్న సంప్రదాయ ఔషధ మొక్కల పైనే ఆధారపడుతున్నారు.ఒడిశా, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, మిజోరం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆదివాసీల ముఖ్యమైన నివాస ప్రాంతాలు. అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా వీరి నివాసాలున్నాయి. తెలంగాణలోని భద్రాద్రి, ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ఆదివాసీ ప్రాంతాల్లో చిన్న చిన్నగూడేలు ఎక్కువ. ఒక్కో పంచాయితీ పరిధిలో అనేక గూడేలు ఉంటాయి.

గోండు, నాయకపోడు, గొత్తికోయ, కోలాము, కొండరెడ్డి, చెంచు, సవర, కొండదొర, భగత తదితర జాతుల తెగలు ఉన్నాయి. నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న చెంచు జాతులయితే ఇంకా పాత వ్యవసాయోత్పత్తి విధానంలోనే కొనసాగుతున్నారు. గోండు, కోయ తదితర తెగలు గోదావరి తీరంలో నల్లరేగడి నేలల్లో పత్తి, పొగాకు, మిర్చి లాంటి వాణిజ్య పంటలు పండించడం నేర్చుకున్నారు. నిజానికి పోడు వ్యవసాయమే ఈ అడవి బిడ్డల ప్రధాన జీవనాధారం. మన దేశంలో ప్రధానంగా మూడు రకాల గిరిజన తెగలు కనిపిస్తాయి. వ్యవసాయం ప్రధానంగా చేసే ఆదిమ తెగలు. వీరికి పాక్షికంగా గిరిజనేతరులతో సంబంధాలుంటాయి.
సామాజిక, వ్యాపార లావాదేవీలు ఉండే అవకాశముంది. ప్రభుత్వం కల్పించే చాలా అభివృద్ధి పథకాలు మైదాన ప్రాంతాల్లో స్థిరపడి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు దగ్గరగా ఉన్న తెగలు ఎక్కువగా ఉపయోగించుకుంటున్నాయి. అందుకే వీరిలో విద్య, ఉద్యోగాలు, ఆర్థిక అభివృద్ధి కనిపిస్తున్నది. ఉదాహరణకు ఉత్తర భారత దేశంలో భిల్లులు, మధ్యప్రదేశ్‌లో సంతాల్‌లు, బీహార్‌లో ముండాలు, మహారాష్ట్ర, తెలంగాణల్లో రాజ్ గోండులు, లంబాడీలు జనజీవన స్రవంతికి చాలా దగ్గరగా ఉండే సమూహాలు.

అందుకనే వీరిలో రాజకీయ, ఆర్థిక, విద్యాపరమైన అభివృద్ధి కనిపిస్తున్నది. అదే చెంచు లాంటి తెగలను గమనిస్తే వారింకా జనజీవన స్రవంతికి దూరంగానే ఉన్నారు. దేశంలో సుమారు 705 ఆదివాసీ జాతుల అక్షరబద్ధం కాని భాష కారణంగా వారు చేసిన త్యాగాలు చరిత్ర పుటలకు ఎక్కలేదు. ప్రచారంలోకి రాక మసకబారిపోయాయి. 75 ఏండ్ల స్వాతంత్య్ర భారత దేశంలో ఒక గిరిజన మహిళ దేశ రాష్ట్రపతిగా ఎన్నిక కావడం హర్షించదగిన విషయం. కానీ, ఈ పరిణామంతో గిరిజనుల ఆత్మగౌరవం పెరుగుతుందేమో కానీ, వారి బతుకుల్లో సమూల మార్పులు వస్తాయనుకోవడం అసంబద్ధమే.ఆర్టికల్ 15 (4), 16 (4) ప్రకారం దేశంలో గిరిజనులకు అన్ని రంగాల్లో సరైన ప్రాతినిధ్యం ఉండాలి. కానీ, 2001 జనాభా లెక్కల ప్రకారం నిర్ధారించిన 7.5 శాతం రిజర్వేషన్లను మాత్రమే కేంద్రం కొనసాగిస్తున్నది. 2011 లెక్కల ప్రకారం 9.9 శాతం మేర పెంచాల్సి ఉంది. కానీ, ఇంకా పెంచలేదు.స్వాతంత్య్రం సిద్ధించి ఏడు దశాబ్దాలు దాటిపోయినా ఆదివాసీ గిరిజనులకు ఇంకా సామాజిక, ఆర్థిక స్వాతంత్య్రం రాలేదని చెప్పాలి.

ఇప్పటికీ రవాణా సౌకర్యం, రక్షిత మంచి నీరు, విద్యుత్తు, విద్యా సౌకర్యాలు లేని ఆదివాసీ గిరిజన గూడేలు అనేకం ఉన్నాయి. ప్రభుత్వాలు గిరిజనుల కోసం కేటాయిస్తున్న బడ్జెట్ అర్హులకు దక్కడం లేదు. ఆదివాసీ గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం ఎన్ని ప్రభుత్వ సంస్థలు వచ్చినా, ఎన్నెన్నో పథకాలు తెచ్చినా వారి జీవితాలలో విప్లవాత్మకమైన మార్పు రాలేదన్నది వాస్తవం. హక్కులు, అభివృద్ధి, అధికారాల కోసం వారికి ప్రత్యేకంగా సంక్రమించిన చట్టాల పరిరక్షణ కోసం గిరిజన సోదరులు ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయ పోరాటాలు చేపట్టాలి. పభుత్వాలు ఆదివాసీ గిరిజనుల ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ అభివృద్ధి, సంక్షేమం కోసం, రాజ్యాంగబద్ధంగా వారికి దక్కవలసిన హక్కులు, అధికారాలు, ఫలాలు దక్కే విధంగా పటిష్టమైన చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైన ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News