నగరంలో 200పైగా నమోదైన పాజిటివ్ కేసులు
సీజనల్ వ్యాధులు పెరుగుతుండటంతో జాగ్రత్తలు తప్పనిసరి
మాస్కులు, భౌతికదూరం పాటించాలని వైద్యశాఖ సూచనలు
హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కరోనా మహమ్మారి మళ్లీ ఉనికి చాటుతుంది. గత రెండు వారాలుగా క్రమంగా పెరుగుతున్న కేసులు, మంగళవారం ఊహించని విధంగా 240 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో వైద్య అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర వైద్యశాఖ హెచ్చరించిన విధంగా జూన్ మూడోవారంలో వైరస్ విజృంభణ చేస్తుందని ఆగస్టు వరకు కేసుల సంఖ్య భారీగా నమోదైయ్యే అవకాశం ఉందని పేర్కొంది. దీని దృష్టిలో పెట్టుకుని వైద్యశాఖ అన్ని విధాలుగా అప్రమత్తమైన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇటీవల వర్షాలు కురుస్తుండటంతో చాలామంది దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలలో బాధపడుతూ పరీక్షలకు వెళ్లితే పాజిటివ్‌గా బయటపడుతుందన్నారు. గత వారం రోజుల నుంచి నగరంలో నమోదైన పాజిటివ్ కేసులు పరిశీలిస్తే ఈనెల 15వ తేదీన 132 మందికి, 16న 188 కేసులు, ఈనెల 17వ తేదీన 172మందికి సోకగా, ఈనెల 18న 157 కేసులు, ఈనెల 19వ తేదీన 180 మందికి, ఈనెల 20న 185 కేసులు, ఈనెల 21వ తేదీన 240 వైరస్ సోకినట్లు వైద్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
పరిస్దితులు అంచనా వేసిన వైద్యశాఖ ఉన్నతాధికారులు కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు. సీజనల్ వ్యాధులు పెరుగుతుండటంతో జాగ్రత్తలు పాటించాలని మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, శానిటైజర్ తప్పనిసరిగా వినియోగించాలని జిల్లా వైద్యాధికారులు పేర్కొంటున్నారు. కరోనా రెండు డోసు వెంటనే తీసుకోవాలని, పదేళ్లలోపు పిల్లలు, 60 ఏళ్ల దాటిన వారు అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు వెళ్లొదని చెప్పారు. ప్రస్తుతం కోవిడ్ వేగంగా పుంజుకునే ప్రమాదం ఎక్కువగా ఉందని 20 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు వారు బయటకు వెళ్లేటప్పడు కోవిడ్ నిబంధనలు తీసుకోవాలన్నారు. అధిక రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి, కేన్సర్, ఇతర దీర్ఘకాలిక అనారోగ్యం ఉన్నవారు కోవిడ్‌కు గురికాకుండా చూసుకోవాలని, వైద్యం కోసం తప్ప ఎలాంటి దూర ప్రయాణాలు చేయవద్దని హెచ్చరిస్తున్నారు. రెండు నెలల పాటు ప్రజలు నిర్లక్షం చేయకుండా జాగ్రత్తలు పాటిస్తే వైరస్ ముప్పు నుంచి బయటపడవచ్చని వెల్లడిస్తున్నారు.