ఆఫ్ఘనిస్తాన్‌లో అసాధారణంగా కురిసిన భారీ సీజనల్ వర్షాల వల్ల ఆకస్మిక వరదలు సంభవించి 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు, వెయ్యికి పైగా ఇళ్లు ధ్వంసమైనట్లు యుఎన్ ఆహార సంస్థ శనివారం వెల్లడించింది. గత కొన్ని వారాలలో ఆఫ్ఘనిస్తాన్‌లో సంభవించిన వరదల్లో ప్రాణాలతో బయటపడిన వారికి తాము పుష్టికరమైన బిస్కట్లు పంపిణీ చేస్తున్నట్లు ప్రపంచ ఆహార సంస్థ (డబ్లుఎఫ్‌పి) తెలియజేసింది. ఆఫ్ఘన్ ఉత్తర ప్రాంతంలోని బాఘ్లాన్ రాష్ట్రం ఎక్కువగా నష్టపోయింది. పొరుగున ఉన్న తఖర్ ప్రావిన్స్‌లో కనీసం
20 మంది మరణించినట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోని మీడియా సంస్థలు తెలిపాయి. ఈ విపత్కర వరదల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని, గణనీయ సంఖ్యలో క్షతగాత్రులు ఉన్నారని తాలిబన్ ప్రభుత్వ ముఖ్య అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ‘ఎక్స్’ పోస్ట్‌లో తెలియజేశారు. బడఖ్షాన్, బాఘ్లాన్, ఘోర్, హెరత్ ప్రావిన్స్‌లు తీవ్రంగా నష్టపోయాయని ముజాహిద్ తెలిపారు. ‘విస్తార విధ్వంసం వల్ల గణనీయ స్థాయిలో ఆర్థిక నష్టాలు’ సంభవించాయని ఆయన తెలిపారు.