ఉచితంగా సాఫ్ట్‌వేర్ అందించడానికి భారత్ సంసిద్ధత
వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ ఆర్‌ఎస్ శర్మ వెల్లడి
న్యూఢిల్లీ : వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో టీకాల లబ్ధిదార్ల పేర్ల నమోదుకు భారత్ రూపొందించిన కొవిన్ యాప్ వ్యవస్థపై దాదాపు 50 దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయని, ఈమేరకు ఆయా దేశాలకు ఉచితంగా సాఫ్ట్‌వేర్ అందించడానికి భారత్ సిద్ధంగా ఉందని కొవిడ్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ ఎంపవర్డ్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ ఆర్‌ఎస్ శర్శ సోమవారం వెల్లడించారు. ఈ వ్యవస్థను ఏ దేశం కోరినా ఉచితంగా సాఫ్ట్‌వేర్ అందించాలని ప్రధాని మోడీ అధికారులను ఆదేశించారని ఆయన చెప్పారు. ఈ కొవిన్ ప్లాట్‌ఫారమ్ చాలా పేరుపొందిందని, కెనడా, మెక్సికో, నైజీరియా,పనామా, తదితర సెంట్రల్ ఆసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికాకు చెందిన 50 దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయని ఆయన వివరించారు.
భారత పరిశ్రమల సమాఖ్య (కన్‌ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో జరిగిన రెండో ప్రజారోగ్య సదస్సు 2021 లో ఆయన ఈ వివరాలు తెలియచేశారు. ‘దేశంలో ప్రజారోగ్య వ్యవస్థ పటిష్టతకు అభివృద్ది చెందుతున్న అత్యవసరాలు’ అన్న అంశంపై ఈ సదస్సు నిర్వహించారు. ప్రపంచం లోని ఆరోగ్య, సాంకేతిక నిపుణులతో జులై 5న నిర్వహించనున్న సదస్సులో ఈ కొవిన్ వ్యవస్థ పనిచేస్తుందో వివరాలు పంచుకోవడమౌతుందని పేర్కొన్నారు. ఆయా దేశాల్లో కొవిన్ వ్యసస్థను అమలు చేయడానికి వియత్నాం, ఇరాక్, డొమినికన్ రిపబ్లిక్, అరబ్ ఎమిరేట్స్, ఆసక్తి చూపించాయని వివరించారు. ఐదు నెలల్లో 30 కోట్ల టీకా లబ్ధిదారుల రిజిస్ట్రేషన్లు, వ్యాక్సినేషన్లను నిర్వహించే స్థాయికి కొవిన్ చేరుకుందని చెప్పారు.