Thursday, January 23, 2025

గాజాలో ఆకలి కేకలు..

- Advertisement -
- Advertisement -

డీర్ అల్ బలా( గాజా):హమాస్ లక్షంగా గాజాపై ఇజ్రాయెల్ ముప్పేట దాడులు చేస్తోంది.ఈ నేపథ్యంలో గాజా ప్రజలు ప్రాణ భయంతో చెల్లా చెదరవుతున్నారు. కనీసం తిండి, నీరు, మందులు లాంటి అత్యవసరాలు సైతం లభించక ప్రాణాలు నిలబెట్టుకోవడమే పెద్ద సమస్యగా మారుతోంది. దేశం విడిచి వెళ్లలేక, అక్కడ ఉండలేక ఏం చేయాలో తెలియని పరిస్థితి. తిండీ, నీరు లేకుండా ఎన్నాళ్లు గడపాలో అర్థం కాని పరిస్థితి. దీంతో నిస్సహాయులుగా మారిన వేలాది మంది ప్రజలు గాజాలోని ఐక్యరాజ్య సమితి సహాయ కేంద్రాల వద్దకు చొచ్చుకు వచ్చినట్లు గాజాలోని ఐరాస సహాయ ఏజన్సీ పేర్కొంది. సాలస్తీనియన్ శరణార్థుల కోసం యుఎన్ రిలీఫ్ ఏజన్సీ నిర్వహిస్తున్న అనేక గిడ్డంగుల్లో ఉన్న గోధుమలు, పిండి, ఇతర అత్యవసర వస్తువులను ప్రజలు దోచుకు వెళ్లినట్లు తెలిపింది.ఈ పరిణామాలు నేపథ్యంలో గాజాలో ‘ సివిల్ ఆర్డర్’ గాడి తప్పుతోందని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది.

అక్టోబర్ 7న గాజాలోని హమాస్ సంస్థ ఇజ్రాయెల్‌పై అనూహ్య దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. దాదాపు 5 వేల క్షిపణులను ప్రయోగించింది. అలాగే హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ నగరాల్లోకి చొరబడి పౌరుల్లో పలువురిని దారుణంగా హతమార్చడంతో పాటుగా పలువురిని బందీలుగా పట్టుకెళ్లారు. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడుల్లో 1400 మందికి పైగా చనిపోగా వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలే ఉన్నారు. ఈ దాడులపై తీవ్రంగా రగిలిపోయిన ఇజ్రాయెల్ గాజాపై దాడులను ఉధృతం చేసింది.అలాగే గాజాలోకి ఇంధనం, నీరు. ఆహారం,ఔషధాల పంపిణీని పూర్తిగా దిగ్బంధించింది. దీంతో గాజాలోని లక్షలాది ప్రజలు ఆకలితో అల్లాడిపోతున్నారు. ఓ వైపు బాంబుల వర్షం, మరో వైపు ఆకలి బాధతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.ఈ నేపథ్యంలో ఈ నెల 21న ఈజిప్టువైపునుంచి మానవతా సహాయం తొలి కాన్వాయ్ గాజాలోకి ప్రవేశించింది. అయితే అరకొరగా సరఫరా అవుతున్న ఆహారం, మానవతా సహాయం గాజా ప్రజలకు ఏమాత్రం సరిపోవడం లేదని ఐరాస పేర్కొంది.

ఈ నేపథ్యంలో సహాయక కేంద్రాల ్వద్దకు చొచ్చుకొస్తున్న ప్రజలు ఆహారం, ఇతర వస్తువులను దోచుకుంటున్నారని తెలిపింది. అయితే తమ గోడౌన్లలో ఇంధనం లేదని ఐరాస సహాయక ఏజన్సీ ప్రతినిధి జూలియట్ టౌమా తెలిపారు. శనివారం జనాలు నాలుగు గోడౌన్లలోకి చొరబడి దోచుకున్నారని ఆమె తెలిపారు. కాగా గాజాలో పరిస్థితి రోజురోజుకు దిగజారి పోతోందని, తక్షణమే కాల్పులు విరమించి మానవతా సాయం అందేలా చూడాలని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి గుటెరస్ మరోసారి విజ్ఞప్తి చేశారు. మరో వైపు గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి అయిన షిఫా ఆస్పత్రి సమీపంలో శనివారం రాత్రి ఇజ్రాయెల్ వైమానిక దళాలు దాడి చేశాయని ఆస్పత్రి చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలు చెప్పారు. దీంతో ఆస్పత్రికి వెళ్లే మార్గంలోని రోడ్లన్నీ ధ్వంసమయ్యాయని, దీంతో ఆస్పత్రికి వెళ్లడం కష్టగా మారిందని వారు చెప్పారు. వేలాది మంది షిఫా ఆస్పత్రిలో ఆశ్రయం పొందుతున్నారు. దీంతో ఆస్పత్రి కిక్కిరిసి పోయి ఉంది. దీంతో వైద్య సిబ్బంది అక్కడి రోగులకు చికిత్స అందించడం కూడా కష్టంగా మారింది. అయితే ఈ ఆస్పత్రి కింద భూగర్భంలో హమాస్‌కు రహస్య కమాండ్ పోస్టు ఉందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది.

హమాస్‌పై మలివిడత దాడి మొదలైంది: ఇజ్రాయెల్
ఇదిలా ఉండగా హమాస్‌ను తుదముట్టించడమే లక్షంగా గాజాపై మలివిడత పోరును ఇజ్రాయెల్ ఉధృతం చేసింది. భూతల ఆపరేషన్స్‌లో భాగంగా 150 సొరంగాలు, బంకర్లు సహా 150 హమాస్ స్థావరాలే లక్షంగా ముందుకు సాగుతున్నామని ఇజ్రాయెల్ సైన్యం (ఐడిఎఫ్)ప్రకటించింది. గాజా రణత్క్రంగా మారిందని ఉత్తర గాజా పౌరులను ఐడిఎఫ్ హెచ్చరించింది. గాజాలో హమాస్‌పై రెండవ దశ యుద్ధాన్ని తమ దళాలు మొదలు పెట్టాయని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు టెల్ అవీవ్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో స్పష్టం చేశారు. ఉపరితలంలో, గగన తలంలో శత్రువును తుదముట్టించేందుకు శత్రుమూకలను వెంటాడుతున్నామని వెల్లడించారు. ఇజ్రాయెల్ మనుగడకోసం పోరాడుతున్నామని చెప్పారు.గాజాలో మలివిడత భూతల దాడులు దీర్ఘకాలం కొనసాగుతాయని చెప్పారు. హమాస్‌ను అంతమొందించే వరకు పోరాటం కొనసాగించి విజేతలగా నిలుస్తామని ఆయన స్పష్టం చేశారు.

8 వేలు దాటిన మరణాలు

మరో వైపు గత 21 రోజులుగా ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో గాజాలో 8 వేల మందికి పైగా జనిపోయినట్లు హమాస్ ప్రకటించింది. మృతుల్లో 3,300 మంది మైనర్లు, 2 వేల మంది మహిళలు ఉన్నట్లు గాజాలోని హమాస్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ మంత్రిత్వ శాఖ గత వారం చనిపోయిన వారి పేర్లు వయసులు, ఐడి నంబర్లతో రికార్డులను విడుదల చేసింది. కొన్ని మృతదేహాలను ఇంకా గుర్తించాల్సి ఉందని ఆ శాఖ వెల్లడించింది.
అలా చేస్తే బందీలను విడిచిపెడ్తాం: హమాస్
ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ హమాస్ మధ్య పోరు రోజురోజుకు ఉధృతం అవుతూ ఉండడం, ఈ యుద్ధంలో అమాయక పౌరులు మృతి చెందుతుండడంతో ఈ రెండింటిమధ్య రాజీ కుదిర్చేందుకు మధ్యప్రాచ్య దేశాలు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా ఇరుపక్షాలు కాల్పులు విరమించాలని, బందీలుగా ఉన్న పౌరులను విడిచిపెట్టేలా రాజీ కుదిర్చేలా ప్రయత్నిస్తున్నాయి. దీనికి హమాస్ వైపునుంచి సానుకూల ప్రకటన వెలువడింది. ఖైదీల మార్పిడికి తాము సిద్ధంగా ఉన్నామని హమాస్ ప్రకటించింది. ప్రతిగా బందీలుగా ఉన్న పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ విడిచిపెట్టాలని షరతు విధించింది. తమ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయలీలను విడిచిపెడతామని ఎజ్జెడిన్ అల్ కస్సామ్ బ్రిగేడ్స్ ప్రతినిధి అబు ఒబెయిడా చెప్పారు. దీనికి బదులుగా ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలందరినీ విడుదల చేయాలి. అలా అయితే తక్షణమే ఖైదీల మార్పిడి ఒప్పందానికి సిద్ధమేనని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News