ఉత్తర భారత దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు వంద మందికి పైగా మృతి చెందినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అత్యధికంగా హిమాచల్ ప్రదేశ్ లోనే 80 మంది వరకు చనిపోయారు. ఆ రాష్ట్రంలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. అనేక చోట్ల రోడ్లు కొట్టుకు పోయాయి. కొండచరియలు విరిగి పడ్డాయి. హిమాచల్ పర్వత ప్రాంతాల్లో దాదాపు 300 మంది పర్యాటకులు చిక్కుకు పోయారు.
కుల్లు జిల్లాలో కసోల్ ఏరియాలో 2000 మంది టూరిస్టులు చిక్కుకు పోయారని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్‌వీందర్‌సింగ్ సుఖు వెల్లడించారు. లహౌల్‌లో 300 టూరిస్టు వాహనాలు ఇరుక్కుపోయాయన్నారు. కులు మనాలి రోడ్డు మంగళవారం సాయంత్రం ప్రారంభం కావడంతో దాదాపు 2200 వాహనాలు ఆ రూటులో వెళ్లాయి. హిమాచల్ ప్రదేశ్‌లో ఆస్తినష్టం రూ. 4000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.
ఇంకా 873 రోడ్లు జలదిగ్బంధంలో ఉన్నాయి. 1956 ట్రాన్స్‌ఫార్మర్లు, 1369 నీటి సరఫరా పథకాలు దెబ్బతిన్నాయి. పంజాబ్‌లో 15 మంది, ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగిపడి 9 మంది చనిపోయారు. 13 మంది గాయపడ్డారు.ఉత్తరాఖండ్‌లో నైనిటాల్, చంపావత్, ఉదమ్‌సింగ్ నగర్, పౌరీగడ్ వాల్ జిల్లాలకు ప్రభుత్వ రెడ్ అలర్ట్ జారీ చేసింది. హరిద్వార్, డెహ్రాడూన్, తెహరీ, గఢ్‌వాల్ , రుద్రప్రయాగ్, జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేశారు.