Thursday, January 9, 2025

ఓటర్ల జాబితాలో మూడొంతులకు పైగా…

- Advertisement -
- Advertisement -

20 నుంచి 49 సంవత్సరాల వయస్సు వారే
30 నుంచి 49 ఏళ్లతో పాటు 20 నుంచి 49 ఏళ్ల వయస్సు ఓటర్లే
ఈ ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకోనున్న మూడు కోట్ల 26 లక్షల 2799 మంది ఓటర్లు

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రం మొత్తం ఓటర్లలో 30 నుంచి 49 ఏళ్ల మధ్య వయసున్న ఓటర్ల సంఖ్య కోటిన్నరకు పైగా ఉంది. వీరితో పాటు 20 నుంచి 49 ఏళ్ల మధ్య వయసున్న వారు ఓటర్ల జాబితాలో మూడొంతులకు పైగా ఉన్నారు. 30 నుంచి 49 ఏళ్లు, 20 నుంచి 49 ఏళ్ల వయస్సు ఓటర్లను కలిపితే సుమారుగా రెండు కోట్ల 24 లక్షల 25 వేల 817గా నమోదయ్యింది. ఇక మొదటి సారి ఓటుహక్కు పొందిన యువఓటర్లు దాదాపు పది లక్షల వరకు ఉన్నారు. ఈ నెల 30వ తేదీన ఓటర్లు తమ తీర్పును ఈవిఎం యంత్రాల్లో నిక్షిప్తం చేయనున్నారు. ఈ మారు ఎన్నికల్లో మూడు కోట్ల 26 లక్షల 2799 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. అందులో పురుషులు కోటి 62 లక్షల 98 వేల 418 మంది కాగా, మహిళలు కోటి 63 లక్షల 1705 మంది ఉన్నారు. ఇతరులు 2,676 మంది ఉన్నారు. మొదటి సారి ఓటుహక్కు వినియోగించుకోనున్న వారి సంఖ్య దాదాపు పది లక్షల వరకు ఉంది. ఓటర్ల జాబితాలో 18 నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న ఓటర్ల సంఖ్య 9,99,667. మొదటి సారి యువ ఓటర్లు ఎక్కువ మంది తమ ఓటుహక్కు నమోదు చేసుకున్నారు. ఇక 20 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసున్న ఓటర్ల సంఖ్య 64 లక్షల 36 వేల 335గా నమోదయ్యింది.

30 నుంచి 39 ఏళ్ల మధ్య వయసున్న వారు 92 లక్షల మంది
రాష్ట్రంలోని ఓటర్లలో 30 నుంచి 39 ఏళ్ల మధ్య ఉన్న ఓటర్ల సంఖ్య అధికంగా ఉంది. మొత్తం మూడు కోట్ల 26 లక్షలకు పైగా ఓటర్లు ఉండగా అందులో 30 నుంచి 39 ఏళ్ల మధ్య వయసున్న వారే 92 లక్షల 93 వేల 393 మంది ఉన్నారు. 40 నుంచి 49 సంవత్సరాల మధ్య వయసున్న ఓటర్ల సంఖ్య 66 లక్షల 96 వేల 89గా నమోదయ్యింది. ఈ రెండు వయస్సుల వారిని కలిపితే వారి సంఖ్య కోటిన్నర దాటుతుంది. మొత్తం మూడు కోట్ల్ల 26 లక్షలకు పైగా ఓటర్లలో 30 నుంచి 49 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఓటర్ల సంఖ్య కోటి 59 లక్షల 89,482గా ఉంది. అంటే మొత్తం ఓటర్లలో దాదాపు సగం మంది 30 నుంచి 49 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారే ఉన్నారు. వారికి 20 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్సు వారిని కూడా కలిపితే ఆ సంఖ్య ఏకంగా రెండు కోట్ల 24 లక్షల 25 వేల 817గా ఉంది. అంటే మూడో వంతు ఓటర్లు 20 నుంచి 49 ఏళ్ల మధ్య వయస్సు వారే ఉన్నారు. ఇక 50 నుంచి 59 ఏళ్ల మధ్య 45 లక్షల 66 వేల 306 మంది, 60 నుంచి 69 ఏళ్ల మధ్య వయస్సు వారు 27 లక్షల 72 వేల 128 మంది ఉన్నారు.
70 నుంచి 79 సంవత్సరాల మధ్య వయస్సు ఓటర్ల సంఖ్య 13 లక్షలు
70 నుంచి 79 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఓటర్ల సంఖ్య 13 లక్షల 98 వేల 511లు కాగా, 80 ఏళ్లు పైబడిన ఓటర్ల సంఖ్య నాలుగు లక్షల 40 వేల 371గా నమోదయ్యింది. రాష్ట్రంలో మొదటిసారి పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. నియోజకవర్గాల వారీగా చూస్తే మొత్తం 119 నియోజకవర్గాలకు గాను ఏకంగా 76 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువగా ఉంది. 33 జిల్లాలకు గాను 26 జిల్లాల్లో మహిళా ఓటర్లు పురుషుల కంటే ఎక్కువగా ఉన్నారు.
రాష్ట్రంలో ఓటర్లు 3,26,02,799
రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 3,26,02,799లు కాగా, అందులో పురుషులు 1,62,98,418 ఓటర్లు, మహిళలు 1,63,01,705, ఇతరులు 2,676గా ఓటర్ జాబితాలో తమపేరును నమోదు చేసుకున్నారు.
వయస్సు                                                                         ఓటర్ల సంఖ్య
18 నుంచి 19 సంవత్సరాలు                                                    9,99,667
20 నుంచి 29 సంవత్సరాలు                                                  64,36,335
30 నుంచి 39 సంవత్సరాలు                                                  92,93,393
40 నుంచి 49 సంవత్సరాలు                                                  66,96,089
50 నుంచి 59 సంవత్సరాలు                                                  45,66,306
60 నుంచి 69 సంవత్సరాలు                                                  27,72,128
70 నుంచి 79 సంవత్సరాలు                                                  13,98,511
80 ఏళ్లు పైన సంవత్సరాలు                                                     4,40,371
30 నుంచి 49 సంవత్సరాలు                                               1,59,89,482
20 నుంచి 49 సంవత్సరాలు                                               2,24,25,817

ఎల్బీనగర్ నియోజకవర్గంలో నాలుగు బ్యాలెట్ యూనిట్‌లు
శాసనసభ ఎన్నికల్లో గరిష్టంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో నాలుగు బ్యాలెట్ యూనిట్లను వినియోగించనున్నారు. అక్కడ 48 మంది అభ్యర్థులు పోటీలో ఉండడమే ఇందుకు కారణం. ఈవిఎంలో వినియోగించే బ్యాలెట్ యూనిట్లో గరిష్టంగా 16 మంది చొప్పున అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. పోటీ చేస్తున్న అభ్యర్థులతో పాటు నోటా కూడా ఉండడంతో ఎల్బీనగర్ లో మొత్తం నాలుగు బ్యాలెట్ యూనిట్లను వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 15 లేదా అంతకంటే తక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉన్న నియోజకవర్గాల సంఖ్య 54గా నమోదయ్యింది. ఆ నియోజకవర్గాల్లో నోటా కలిపితే 16 పేర్లు బ్యాలెట్‌లో ఉంటాయి. అందువల్ల ఈ 54 నియోజకవర్గాల్లో ఒకే బ్యాలెట్ యూనిట్ అవసరం అవుతుంది. 16 నుంచి 31 మంది లోపు అభ్యర్థులు పోటీలో ఉన్న నియోజకవర్గాలు 55 ఉన్నాయి. ఇక్కడ ఒక్కో పోలింగ్ కేంద్రంలో రెండు చొప్పున బ్యాలెట్ యూనిట్లు వినియోగిస్తారు. ఇక 32 నుంచి 47 లోపు మంది అభ్యర్థులు ఉన్న నియోజకవర్గాల సంఖ్య తొమ్మిది కాగా, ఆ నియోజకవర్గాల్లోని ఒక్కో పోలింగ్ కేంద్రంలో మూడు చొప్పున బ్యాలెట్ యూనిట్లు అవసరమవుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News