పార్టీకి మరో మంత్రి రాజీనామా
అదే బాటలో మరో ఎంఎల్‌ఎ
మూడు రోజుల్లో 8 మంది ఎంఎల్‌ఎలు గుడ్‌బై
ఈ నెల 20 దాకా రోజుకు ఇద్దరు చొప్పున రాజీనామా చేస్తారు: రాజ్‌భర్ జోస్యం
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార భారతీయ జనతా పార్టీకి వరస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. బిసి వర్గంలో బలమైన నేతలుగా ఉన్న మంత్రులు, ఎంఎల్‌ఎలు వరసపెట్టి రాజీనామా చేస్తుండడం బిజెపిలో కాక పుట్టిస్తోంది. ఇప్పటికే సీనియర్ మంత్రులు స్వామి ప్రసాద్ మౌర్య, దారాసింగ్ చౌహాన్‌లు రాజీనామా చేయగా తాజాగా మరో మంత్రి ధరమ్ సింగ్ సైనీ కూడా యుపి మంత్రివర్గంనుంచి తప్పుకొన్నారు. రాజీనామా చేసిన కొద్ది సేపటికే ధరమ్ సింగ్ సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ను కలిశారు.ఈ ఫోటోను అఖిలేష్ ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ ధరమ్ సింగ్‌కు స్వాగతం పలుకుతున్నట్లు తెలిపారు.
దీనితో ధరమ్ సింగ్ కూడా త్వరలోనే సమాజ్‌వాది పార్టీలో చేరుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. సహరాన్‌పూర్‌లో బలమైన బిసి నేతగా ఉన్న సైనీ నకుద్‌నుంచి నాలుగు సార్లు ఎంఎల్‌ఎగా ఎన్నికయ్యారు. స్వామి ప్రసాద్ మౌర్యకు ధరమ్ సింగ్ అత్యంత సన్నిహితుడు. నిజానికి ధరమ్ సింగ్ కూడా పార్టీని వీడనున్నారని వార్తలు వస్తున్నప్పటికీ వాటిని ఆయన కొట్టిపారేశారు. తాను బిజెపిలోనే ఉన్నానని నిన్నటికి నిన్న చెప్పిన ఆయన 24 గంటలు గడవక ముందే మంత్రిపదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. స్వామి ప్రసాద్ మౌర్య రాజీనామా చేసిన తర్వాత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ధరమ్ సింగ్‌కు ఫోన్ చేసి పార్టీలోనే కొనసాగాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే ఇతర బిసి నేతలు వరసగా రాజీనామా చేస్తుండడంతో తాను కూడా పార్టీని వీడాలని ఆయన నిర్ణయించుకున్నట్లు భావిస్తున్నారు.
మరో ఎంఎల్‌ఎ రాజీనామా
అంతకు ముందు షికోహాబాద్ నియోజకవర్గం బిజెపి ఎంఎల్‌ఎ డాక్టర్ ముకేశ్ వర్మ కూడా బిజెపి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. యోగి ఆదిత్య నాథ్ ప్రభుత్వం బిసిలు, దళితులను విస్మరించిందని విమర్శించిన ఆయన అందుకే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్‌కు పంపిన రాజీనామా లేఖలో ఆయన పేర్కొన్నారు. మౌర్య నాయకత్వంలో ఒబిసిలకు న్యాయం కోసం తన పోరాటాన్ని కొనసాగిస్తానని పేర్కొన్నారు. గత మూడు రోజుల్లో యుపి బిజెపిలో ముగ్గురు మంత్రులు సహా మొత్తం 8 మంది ఎంఎల్‌ఎలు పార్టీకి రాజీనామా చేశారు. ఎంఎల్‌ఎలు బ్రిజేష్ కుమార్ ప్రజాపతి, రోషన్ లాల్ శర్మ, భగవతి సాగర్, వినయ్ సాఖ్యలు ఇప్పటికే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. వారంతా త్వరలోనే అఖిలేష్ నాయకత్వంలోని సమాజ్‌వాది పార్టీలో చేరుతారని తెలుస్తోంది.
రోజుకు ఇద్దరు మంత్రులు గుడ్‌బై!
కాగా రానున్న రోజుల్లో మరింత మంది మంత్రులు బిజెపిని వీడే అవకాశముందని సుహ్లదేవ్ భారతీయ సమాజ్ పార్టీ చీఫ్ ఓం ప్రకాశ్ రాజ్‌భర్ చెప్నారు. రోజుకు ఇద్దరు చొప్పున ఈ నెల 20 వరకల్లా 18 మంది మంత్రులు బిజెపికి గుడ్‌బై చెబుతారని అంచనా వేశారు. అటు స్వామి ప్రసాద్ మౌర్య కూడా బుధవారం ఇదే విషయాన్ని చెప్పారు. తన రాజీనామా బిజెపిలో తుపాను సృష్టించిందని వ్యాఖ్యానించిన ఆయన.. రాబోయే రోజుల్లో మరింతమంది నేతలు కాషాయపార్టీని వీడుతారని చెప్పారు.