Wednesday, January 22, 2025

జమ్ముకశ్మీర్‌లో పోటెత్తిన ఓటర్లు

- Advertisement -
- Advertisement -

జమ్మూకశ్మీర్‌లోని ఐదు లోక్‌సభ నియోజకవర్గాల్లో చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్ భారీగా జరగడం విశేష పరిణామంగా చెప్పవచ్చు. ప్రత్యేకించి, వేర్పాటువాదుల ప్రభావం తీవ్రంగా ఉన్న కశ్మర్ వ్యాలీలోని అనంత్ నాగ్, బారాముల్లా, శ్రీనగర్ నియోజక వర్గాల్లో కూడా గతం కన్నా ఓటర్లు ఎక్కువ శాతం నిర్భయంగా, స్వేచ్ఛగా ఓట్లు వేశారు. 2019లో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన 370 ఆర్టికల్ రద్దు తర్వాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు పారామిలిటరీ బలగాల పహారాలో పోటెత్తారు. హిందూ ఓటర్ల ప్రభావం ఉన్న ఉదంపూర్, జమ్మూ నియోజకవర్గాల్లోనే కాకుండా తరచూ హింసకు కేంద్ర బిందువులైన బారాముల్లా నియోజకవర్గంలో 59 శాతం దాకా ఓట్లు పోలు కావడం అక్కడి ఎన్నికల చరిత్రలో ఇది రికార్డు.

గడిచిన ఎన్నికల్లో ఇక్కడ 39 శాతం మాత్రమే ఓట్లు పోలయ్యాయి. కల్లోలభరిత నియోజకవర్గమైన శ్రీనగర్‌లో 2019లో 15 శాతం ఓట్లు వేస్తే ఈసారి 38 శాతానికి చేరింది. పోలింగ్ ప్రారంభమయ్యే సమయానికే ముస్లిం మహిళలు, పురుషులు, వృద్ధులు, యువకులు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరి ఓట్లు వేయడం అసాధారణ దృశ్యంగా అక్కడ ఎన్నికల తీరును పరిశీలిస్తున్న అధికారులు అభివర్ణించారు. ఇక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగినా మిలిటెంట్ల ఎన్నికల బహిష్కరణ నినాదం ప్రభావం బాగా పని చేసి ఓటర్లు ఇళ్ళ నుంచి బయటికి రావడానికి భీతిల్లేవారు. మిలిటెంట్లు పోలింగ్ కేంద్రాలపై, కాపలాగా వున్న పోలీసులపై గ్రెనేడ్లు, రాళ్ళు విసిరేవారు. ఓటు వేసిన వారిని ద్రోహులుగా అభివర్ణించి వారి ఇళ్ళపై దాడులు కూడా చేసేవారు. దీనితో కశ్మీర్ వ్యాలీలోని అనంత్ నాగ్, బారాముల్లా, శ్రీనగర్‌లలో ఓటింగ్ శాతం నామమాత్రంగా ఉండేది. కాని 370 ఆర్టికల్ రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌ను జమ్మూకశ్మీర్, లడఖ్‌లను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. మిలిటెంట్లను కఠిన చర్యలతో నియంత్రించింది.

ముఖ్యంగా ఈ ప్రాంతంలోని రాజకీయ నాయకులందరినీ నెలల పాటు హౌస్ అరెస్టులో ఉంచింది. ప్రాంతాల వారీగా మిలిటెంట్లను, వారి నేతలను గుర్తించి భారీ సంఖ్యలో జైళ్లకు పంపింది. మరోవైపు అభివృద్ధిని విస్తృతం చేసింది. ఎక్కడా రాళ్ళు విసిరే యువతను కనిపించకుండా చేసింది. శ్రీనగర్‌లో, ఇతర కల్లోల ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లు, బ్రిడ్జిలు, రింగ్ రోడ్లు, సొరంగాలు, ఎక్స్‌ప్రెస్ వేలను సాయుధ పహారాలో రేయింబవళ్ళు నిర్మించింది. దీనితో యువతకు పని దొరకడంతో పాటు అభివృద్ధి బహుముఖంగా విస్తరించింది, టూరిజం పెరిగింది. వేల సంఖ్యలో టూరిస్టులు శ్రీనగర్‌ను సందర్శించడంతో ట్రాఫిక్‌ను నియంత్రించడం సాధ్యంకాని పరిస్థితులు నెలకొన్నాయి. వ్యవసాయం, పరిశ్రమలు అన్ని వైపులా విస్తరిస్తూ పోతున్నాయి. 2019 కి ముందు ఇక్కడ స్థూల రాష్ట్రీయ ఉత్పత్తి లక్ష కోట్ల నుంచి రెండు లక్షల 25 వేల కోట్లకు పెరిగింది. ఎక్కడ చూసినా అభివృద్ధి పనులు ముమ్మరం కావడంతో ప్రజలకు చేతి నిండా పని దొరికింది.

శాంతియుత వాతావరణంతో పాటు అభివృద్ధి కళ్ళ ముందు కనిపించడంతో ఓటర్ల ఆలోచన సరళి కూడా మారడంతోనే మరింత మార్పును కోరుతూ ఓటర్లు ఈసారి పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారని సామాజిక శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. 2018 నుంచి ఇక్కడ ప్రజలు ఎన్నుకొన్న ఎంఎల్‌ఎలు లేరు. అసెంబ్లీని రద్దు చేసి లెఫ్టినెంట్ గవర్నర్ చేతుల్లోకి పాలన వెళ్ళి ఐదేళ్లవుతున్నది. లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిన దృష్టా అసెంబ్లీ ఎన్నికలు కూడా ఈ ఏడాదిలోనే జరపడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి ఇక్కడ కశ్మీర్ వ్యాలీలో మూడు నియోజక వర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టలేదు. కాని అప్‌ని, పీపుల్స్ కాన్ఫరెన్స్ లాంటి పార్టీల అభ్యర్థులకు బిజెపి మద్దతు పలికింది.

370 ఆర్టికల్ ప్రభావంతో ముస్లింలు ఎక్కువగా ఉండే ఈ మూడు నియోజక వర్గాల్లో పోటీ చేసి ఓడిపోవడం కన్నా తప్పుకోవడమే మేలనేది బిజెపి వ్యూహంగా కనిపిస్తున్నది. ఈ పార్టీ హిందువులు ఎక్కువగా ఉన్న ఉదంపూర్, జమ్మూ నియోజక వర్గాల్లో పోటీ చేసింది. కశ్మీర్ వ్యాలీలో ప్రశాంతతను పునరుద్ధరించి అభివృద్ధిని ముమ్మరం చేయడానికి కారణమైన బిజెపి ఇక్కడ పోటీలో లేకపోవడం పరిశీలకులను విస్మయానికి గురి చేసినా ఇది పార్టీ ఎత్తుగడగా ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఎన్నికల్లో మిత్రులైన పార్టీ అభ్యర్థులు గెలిస్తే ఆ తర్వాత నేరుగా రంగంలోకి దిగాలనేది బిజెపి రాజకీయ వ్యూహంగా ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News