Saturday, December 21, 2024

మార్ఫింగ్‌తో బ్లాక్‌మేయిల్

- Advertisement -
- Advertisement -

సాధారణ యువతుల నుంచి ప్రముఖుల వరకు బాధితులే
ఫొటోల అశ్లీల మార్ఫింగ్
సోషల్ మీడియాలో పోస్టింగ్
మనోవేదనకు గురవుతున్న బాధితులు

మనతెలంగాణ: మార్ఫింగ్‌కు సాధారణ యువతులే కాకుండా, ప్రముఖులు కూడా బలవుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారిని టార్గెట్‌గా చేసుకుని వేధింపులకు దిగుతున్నారు. దీంతో బాధితులు తమ విషయాలను బయటికి చెప్పుకోలేకుండా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఎక్కువగా సైబర్ నేరస్థులు సోషల్ మీడియాలో యువతుల ఫోటోలు తీసుకుని మార్ఫింగ్ చేసి డబ్బులు డిమాండ్ చేసేవారు. వాటిని ఇవ్వకుంటే మార్ఫింగ్ ఫొటోలు మీ బంధువులు, స్నేహితులకు పంపిస్తామని చెప్పడంతో అడిగిన డబ్బులు ఇచ్చేవారు. కొందరు వినకపోవడంతో వారి ఫోటోలను ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాలో పోస్టింగ్ చేసేవారు.

దీంతో వారి బంధువులు, స్నేహితులు చూసి బాధితులకు చెబితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసేవారు. ఇప్పటి వరకు ఇలాంటి కేసులు సాధారణ యువతులు ఎక్కువగా ఫేస్ చేసేవారు. తాజాగా సినీ ప్రముఖులను టార్గెట్‌గా చేసుకుని చాలామంది యువకులు వారి ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టి పరువు తీస్తున్నారు. ఇందులో సినిమాల్లో ఎక్కువగా నటించే అనసూయ, ప్రతిభ తదితర యాక్టర్ల ఫొటోలు మార్ఫింగ్ చేస్తున్న యువకుడిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు సోషల్ మీడియాలో వారి ఫొటోలను డౌన్‌లోడ్ చేసుకుని మార్ఫింగ్ చేసి ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో పోస్టింగ్ చేస్తున్నాడు. యాంకర్, యాక్టర్ అనసూయ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఫొటోలు మార్ఫింగ్ చేస్తున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

లోన్ యాప్‌ల కేసులో…

మార్ఫింగ్ కేవలం సోషల్ మీడియాలో ఉంటే వారికే పరిమితం కాలేదు, ఇటీవల సంచలనం సృష్టించిన లోన్ యాప్‌ల కేసులో కూడా ఇలాంటి సంఘటనలే చోటుచేసుకున్నాయి. లోన్ యాప్‌ల ద్వారా రుణాలు తీసుకున్న వారు డబ్బులు చెల్లించకపోతే వారి కాంటాక్ట్ లిస్టులో ఉన్న బంధువులు, స్నేహితులకు బాధితుల ఫొటోలు మార్ఫింగ్ చేసి పంపిస్తున్నారు. ఇలాంటి కేసుల్లో ఏకంగా బాధితుల బంధువులు, స్నేహితుల వాట్సాప్ నంబర్లు ఉండడంతో వారికి బాధితురాలి ఫొటోను మార్ఫింగ్ చేసి అశ్లీల ఫొటోలు పంపించేవారు. చాలామంది బాధితులకు ఇలా చేస్తున్న విషయం వారి స్నేహితులు, బంధువులు చెప్పేవారకు తెలియడంలేదు. వీరి వేధింపులు భరించలేక చాలామంది పరువు పోతుందని భావించి రుణాలు కట్టేవారు. లోన్ యాప్‌ల కేసులో కూడా మార్ఫింగ్ చేశారు.

ప్రేమించేందుకు నిరాకరించినా….

అన్ని కేసుల్లో యువతులు, మహిళలు బాధితులుగా మారుతున్నారు. కాలేజీ యువతులు తనతోటి చదువుతున్న వారి ప్రేమను నిరాకరించినా కూడా మార్ఫింగ్ బలవుతున్నారు. చాలామంది యువతులు కాలేజీ సమయంలో యువకులతో ప్రేమలో పడుతున్నారు. కానీ కొంత కాలం తర్వాత ఇద్దరు విడిపోవడంతో అక్కడి నుంచి వారికి వేధింపులు ఎదురవుతున్నాయి. ఇలా చాలామంది బాధితులు ఉన్నారు, ఇటీవల జరిగిన ఓ సంఘటనలో యువతి కాలేజీ సమయంలో ఓ యువకుడిని ప్రేమించింది. ఆ సమయంలో ఇద్దరు కలిసి ఉన్న ఫొటోలను మార్ఫింగ్ చేసిన నిందితుడు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. వాటిని చూసిన బాధితురాలి స్నేహితులు, బంధువులు వెంటనే చెప్పారు. దీంతో ఒక్కసారిగా షాక్‌గురైన బాధితురాలు వెంటనే రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇలా చాలామంది యువతులు, మహిళలు మార్ఫింగ్ బారిపడుతున్నారు. యువతులు, మహిళలు తమకు తెలిసిన వారైనా, తెలియని వారైనా ఎలాంటి వేధింపులు ఎదుర్కొన్నా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News