Tuesday, December 24, 2024

బాంబు బెదిరింపుతో మాస్కో- గోవా విమానం ఉజ్బెకిస్థాన్‌కు మళ్లింపు!

- Advertisement -
- Advertisement -

పనాజీ: రష్యా రాజధాని మాస్కో నుంచి గోవాకు వస్తున్న విమానానికి శనివారం బాంబు బెదిరింపు అందడంతో దానిని వెంటనే ఉజ్బెకిస్థాన్‌కు మళ్లించారు. దబోలిమ్ విమానాశ్రయం వద్ద అధికారులకు విమానంలో బాంబు ఉందన్న బెదిరింపు ఈమెయిల్ అందిందని పోలీసులు తెలిపారు. మాస్కో నుంచి గోవాకు వస్తున్న విమానంకు బెదిరింపు రావడం ఇది రెండోసారి. ఆ విమానం మాస్కో నుంచి గోవాలోని దబోలిమ్ విమానాశ్రయానికి వస్తూ ఉండగా ఈ బెదిరింపు అందింది. ఆ విమానాన్ని రష్యా ఎయిర్‌లైన్ అజూర్ ఎయిర్ నడుపుతోంది. గోవాలో అది తెల్లవారు జామున 4.15గంటలకు దిగాల్సి ఉండింది. కాగా రాత్రి 12.30కు దబోలిన్ విమానాశ్రయం డైరెక్టర్‌కు ఈమెయిల్ అందింది. విమానంలో బాంబు పెట్టారని అందులో పేర్కొన్నారు. దాంతో విమానాన్ని భారత గగనతలంలోకి ప్రవేశించిన వెంటనే మళ్లించేశారు. ఆ విమానం ఉజ్బెకిస్థాన్ విమానాశ్రయంలో ఉదయం 4.30 గంటలకు దిగింది. ఆ విమానంలో 240 మంది ప్రయాణికులు, ఏడుగురు విమాన సిబ్బంది ఉన్నారు.

ఇదివరలో జనవరి 9న కూడా మాస్కో నుంచి గోవా వస్తున్న విమానం కూడా గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అర్ధాంతరంగా దిగింది. ఆ విమానం కూడా అజూర్ ఎయిర్‌కు సంబంధించిందే. ఈసారి బాంబు బెదిరింపు అందగానే గోవా పోలీసు సిబ్బందిని, క్విక్ రెస్పాన్స్ టీమ్, యాంటీ టెర్రరిజం స్వాడ్, డాగ్ స్కాడ్‌లను అలర్ట్ చేశారు. అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ‘అదనపు పోలీసు బలగాలను కూడా గోవా విమానాశ్రయానికి పంపాము’ అని డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్(వాస్కో) సలీమ్ షేఖ్ తెలిపారు. కాగా దీనికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు దాఖలు చేస్తామని దబోలిన్ విమానాశ్రయానికి చెందిన ఓ సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News