మాస్కో: రష్యా రాజధాని మాస్కోలో గురువారం నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులకు పని నుంచి వెసులుబాటు ప్రారంభమైంది. రష్యాలో ఇటీవల కరోనా కేసుల సంఖ్య భారీగా పెరగడంతో ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ నెల 30 నుంచి నవంబర్ 7వరకు ఉద్యోగులకు పని నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు ప్రకటించారు. అయితే, కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఈ వెసులుబాటును ముందుగానే వినియోగించుకోవచ్చునని సూచించారు. దాంతో, మాస్కోలో ముందుగానే ఉద్యోగులకు పనిరహిత కాలాన్ని ప్రారంభించారు. కార్యాలయాలు,దుకాణాలు, పాఠశాలలు,జిమ్ములు, వినోద కేంద్రాలు మూతపడ్డాయి. రెస్టారెంట్లు, కేఫ్‌ల నుంచి ఆహార పదార్థాలను తీసుకెళ్లేందుకు అనుమతిచ్చారు. ఔషధ దుకాలణాలతోపాటు నిత్యావసరాలకు అనుమతిచ్చారు. తాజాగా రష్యాలో 24 గంటల్లో 40,096 కేసులు, 1159 మరణాలు నమోదయ్యాయి. దీంతో, మరణాల సంఖ్య 2,35,057కు చేరింది. యూరప్‌లో ఇదే అత్యధిక మరణాల సంఖ్య. ఈ వారంలో కేసుల సంఖ్య కూడా ఇదే అత్యధికం.