Wednesday, January 22, 2025

మాస్కోలో ఐఎస్ మారణ కాండ

- Advertisement -
- Advertisement -

మాస్కోలోని ఒక పెద్ద కచేరి మందిరంలోకి శుక్రవారం దుండగులు దూసుకువచ్చి, కాల్పులు జరపగా 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరి 100 మందికి పైగా క్షతగాత్రులు అయ్యారు. ఈ హింసాకాండ చాలదన్నట్లు ముష్కరులు ఆ మందిరానికి నిప్పు పెట్టారు కూడా. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన కొన్ని రోజులకే ఈ మారణ కాండ చోటు చేసుకోవడం గమనార్హం. ఈ దాడి తరువాత 11 మందిని నిర్బంధంలోకి తీసుకున్నట్లు రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ శనివారం అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు తెలియజేసింది. సోషల్ మీడియాలో అనుబంధిత చానెల్స్‌లో పొందుపరచిన ప్రకటనలో ఇస్లామిక్‌స్టేట్ (ఐఎస్) గ్రూప్ ఈ దాడికి తనదే బాధ్యత అని ఒప్పుకున్నది. ఆఫ్ఘనిస్తాన్‌లోని ఐఎస్ గ్రూప్ శాఖ మాస్కోలో దాడికి పథక రచన చేస్తున్న సంగతి తెలుసుకున్న యుఎస్ నిఘా విభాగం రష్యా అధికారులకు సమాచారం చేరవేసినట్లు అమెరికన్ నిఘా విభాగం అధికారి ఒకరు ఎపి వార్తా సంస్థతో చెప్పారు.

దాడి అనంతరం దుండగులను ఏమి చేశారన్నది వెంటనే తెలియరాలేదు. కాని ప్రభుత్వ దర్యాప్తు అధికారులు ఉగ్రవాద ఘటనగా దర్యాప్తు చేస్తున్నారని తెలియవచ్చింది. కచేరి మందిరాన్ని భస్మీపటలం చేసిన ఈ దాడి రష్యాలో కొన్ని ఏళ్లలో అత్యంత దారుణ మారణకాండ. ఉక్రెయిన్‌లో రష్యా సాగిస్తున్న పోరు మూడవ సంవత్సరంలోకి ప్రవేశించిన సమయంలో ఇది జరిగింది. మాస్కో మేయర్ సెర్జీ సోబ్యనిన్ ఈ దాడిని ‘భారీ విషాద ఘటన’గా పేర్కొన్నారు. మాస్కో పశ్చిమ శివారులోని పెద్డ సంగీత మందిరం క్రోకస్ సిటీ హాల్‌లోకి దుండగులు దూసుకువచ్చిన కొన్ని నిమిషాలకు పుతిన్‌కు దీని గురించి నివేదించినట్లు క్రెమ్లిన్ వెల్లడించింది .ఆ హాలులో 6200 మంది కూర్చునే అవకాశం ఉంది. రష్యన్ రాక్ బ్రాండ్ పిక్నిక్ ప్రదర్శన కోసం జనం సమీకృతమైనప్పుడు ఈ డాది చోటు చేసుకున్నది. దాడిలో 60 మందికి పైగా హతులైనట్లు ప్రభుత్వ అగ్రశ్రేణి దర్యాప్తు సంస్థ ఇన్వెస్టిగేటివ్ కమిటీ శనివారం తెల్లవారు జామున తెలియజేసింది.

ఆరోగ్య శాఖ అధికారులు 145 మంది క్షతగాత్రుల జాబితా విడుదల చేశారు. వారిలో ఐదుగురు పిల్లలతో సహా 115 మందిని ఆసుపత్రిలో చేర్పించారు. దుండగులు పేలుడు పదార్ధాలను విసిరిన తరువాత ప్రజ్వరిల్లిన మంటలలో మరింత మంది బాధితులు చిక్కుకుపోయి ఉండవచ్చునని కొన్ని రష్యన్ వార్తా సంస్థలు సూచించాయి. అగ్నిమాపక శాఖ హెలికాప్టర్లు ఆ భవనంపై నుంచి నీటిని విరజిమ్ముతూ మంటలను ఆర్పడానికి ప్రయత్నించడం వీడియోలో కనిపించింది. మంటలను నియంత్రించేందుకు కొన్ని గంటలు పట్టింది. సైనిక దుస్తులలో పలువురు వ్యక్తులు కచేరి మందిరంలోకి ప్రవేశించి జనంపై కాల్పులు జరిపారని ప్రాసిక్యూటర్ కార్యాలయం తెలిపింది. హాలు వద్ద భద్రత విధులలో ఉన్న గార్డుల దగ్గర తుపాకులు లేవని, వారిలో కొందరు దాడి మొదలైన తరువాత మరణించి ఉండవచ్చునని రష్యన్ మీడియా తెలిపింది.

ప్రత్యేక బలగాలు, రయట్ పోలీసులు వచ్చే లోపలే దుండగులు పారిపోయారని కొన్ని రష్యన్ వార్తా సంస్థలు తెలియజేశాయి. మాస్కో శివార్లలోని క్రాస్నోగార్‌స్క్‌లో ‘క్రైస్తవుల’ భారీ సమూహంపై తాము దాడి చేశామని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ తెలిపినట్లు సంస్థకు చెందిన ఆమక్ వార్తా సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. అయితే, ఆ క్లెయిమ్ నిర్ధారణ వెంటనే సాధ్యం కాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News