ఎలాన్ మస్క్.. యావత్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. టెస్లా అధిపతిగా, అపర కుబేరుడిగా ఘనత వహించిన మస్క్ ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్‌ను టేకోవర్ చేసుకున్న తర్వాత అందరి నోళ్లలో మరింత నానుతున్నారు. సామాజిక మాధ్యమం అధిపతిగా ఆయన వ్యవహార శైలి అందరినీ విస్మయపరుస్తోంది. ట్విటర్‌కు సంబంధించి గడియగడియకు తీసుకుంటున్న నిర్ణయం అందరినీ గందరగోళంలోకి నెట్టేస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించగల సామర్థం ఉన్న మస్క్ చౌకబారు నిర్ణయాలు ఆయన ప్రతిష్టను మసకబారుస్తున్నాయి. కేవలం ట్విటర్‌కు సంబంధించిన కీలక నిర్ణయాల్లో ఆయన వేసిన పిల్లిమొగ్గలు, సంచలన నిర్ణయాలు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. వాణిజ్య, వ్యాపార రంగాల్లో మస్క్ ఆచితూచి తీసుకోవాల్సిన నిర్ణయాలు మరొకరి పాలిట శాపంగా కూడా మారుతున్నాయి. ఆయన వ్యవహారశైలి ఇదే పద్దతిలో కొనసాగితే తద్వారా ప్రపంచంలోని వివిధ రంగాలపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశాలు లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ట్విటర్‌ను కైవసం చేసుకోవడానికి గంటల ముందు మస్క్ శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలోకి ఎవరూ ఊహించని రీతిలో ఎంట్రీ ఇచ్చారు. బాత్‌రూంల్లో అమర్చే సింక్‌ను చేతబట్టుకుని ప్రవేశించారు. ఇది ఆ సంస్థ ఉద్యోగులతో పాటు అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. మీడియాలో ప్రచారం కోసమే ఆయన ఇలాంటి జిమ్మిక్కులు చేశారని సామాజిక మాధ్యమాల్లో విమర్శలు కూడా వెల్లువెత్తాయి.
ట్విటర్ ఉద్యోగులను తొలగించబోనని చెబుతూనే మస్క్ ఉన్నత పదవుల్లోని కీలక వ్యక్తులు సిఇఒ పరాగ్ అగర్వాల్, విజయ గద్దె లాంటి కీలక వ్యక్తులను తొలగించారు. సంస్థకు చెందిన 3700 మంది అంటే సుమారు సగం మందిని ఉద్యోగాల నుంచి అకారణంగా తొలగించి వారిని రోడ్డున పడేశారు. నిపుణులపై వేటు వేస్తే భవిష్యత్‌లో సంస్థ మేథోపరమైన నష్టాలను చవిచూడాల్సి వస్తుందని కూడా సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సహజంగా సాఫ్ట్‌వేర్ కంపెనీలు వారి ఉద్యోగుల సౌకర్యార్థం భోజన వసతిని సబ్సిడీపైనో, ఉచితంగానో వారి పనిగంటల సమయంలో అందిస్తుంటాయి. టీ, కాఫీలతో మరిన్ని విలాసాలను సమకూర్చడం పరిపాటి. ప్రపంచంలోనే పేరెన్నికగన్న ట్విటర్ లాంటి సంస్థ ఉద్యోగులకు ఉండే సౌకర్యాల గురించి ఇక చెప్పనక్కర్లేదు. అలాంటి సౌకర్యాలను అనుభవిస్తున్న ఉద్యోగులను మస్క్ ఒక్కసారిగా చిన్నచూపు చూశారు. ఉచిత భోజనాన్ని రద్దు చేశారు. వారానికి పని గంటలను 80కి పెంచేశారు. ఉద్యోగుల మనోభావాలను తెలుసుకోకుండానే వర్క్‌ఫ్రం హోంకు టాటా చెప్పాలని హుకుం జారీ చేశారు.
మస్క్ నిర్ణయాల్లో ఇక అత్యంత వివాదాస్పదమైనది ‘బ్లూ టిక్’. ఇంతకుముందు ప్రముఖులు, ప్రముఖ సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, పాత్రికేయులు తదితరుల ఖాతాను పరిశీలించి వారిదే అని నిర్ధారించుకున్న తర్వాత బ్లూ టిక్ ఇచ్చేవారు. మస్క్ వచ్చాక ఆ పద్ధతికి చెల్లుచీటి ఇస్తున్నామని, నెలకు 8 డాలర్లు చెల్లిస్తేనే ఖాతాదారులకు బ్లూ టిక్ సదుపాయం కల్పిస్తామని ప్రకటించారు. దీంతో ప్రఖ్యాత సంస్థల పేరిట నకిలీ ఖాతాలు సృష్టించిన కొందరు దుండగులు లక్షల కోట్ల సంపద ఆవిరైపోవడానికి కారణమయ్యారు.
మధుమేహంతో బాధపడేవారికి ఇన్సులిన్ అందించే అమెరికాకు చెందిన ‘ఎలీ లిల్లీ’ అనే కంపెనీ పేరిట నకిలీ ఖాతా సృష్టించి బ్లూటిక్ సంపాదించిన దుండుగులు ‘ఇన్సులిన్ ఉచితంగా అందించనున్నామని ప్రకటించడానికి సంతోషిస్తున్నాం’ అని చేసిన పోస్టు ఆ కంపెనీ కొంప ముంచింది. ఎలీ లిల్లీ 15 బిలియన్ డాలర్లు (రూ.1.20లక్షల కోట్లు) స్టాక్ మార్కెట్‌లో నష్టపోయింది. ప్రఖ్యాత ఆయుధాల ఉత్పత్తి, పంపిణీ సంస్థ లాక్‌హీడ్ మార్టిన్ కూడా బ్లూ టిక్ బారిన పడి తీవ్రంగా నష్టపోయింది. దీంతో బ్లూ టిక్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.