అఖిల్, పూజా హెగ్డే జంటగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. అల్లు అరవింద్ సమర్పణలో వాసు వర్మ, బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాగచైతన్య మాట్లాడుతూ- “అఖిల్ ఓ సినిమా ఫలితం కన్నా దానికి ప్రిపేర్ అయ్యే విధానాన్ని ఎక్కువ ప్రేమిస్తాడు. తనలో అదే నాకు బాగా ఇష్టం. రానున్న ఐదారేళ్లల్లో ఎలాంటి సినిమాలు, ఎలాంటి పాత్రలు చేయాలనే మాస్టర్ ప్లాన్ తన మైండ్‌లో ఉంటుంది. ‘సిసింద్రీ’ నుంచి ఇప్పటివరకు తనను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది.. ప్రతి ఏడాది ఇంట్లో కొత్త అఖిల్‌ని చూస్తుంటాను.. తను సినిమాకి అంత అంకితమవుతాడు. ఇక ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ట్రైలర్ చూస్తుంటే ఓ సెలబ్రేషన్‌లా అనిపించింది. ఇలాంటి సమయంలో థియేటర్స్‌లో మన ప్రేక్షకులకు సెలబ్రేషన్ కావాలి.
ఈ సినిమా ఆ సెలబ్రేషన్‌ని ఇస్తుందని నమ్ముతున్నా”అని అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ – “ఈ సినిమాలో అఖిల్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పగలను. భాస్కర్ ఈ సినిమాను బాగా తీశాడు” అని తెలిపారు. అఖిల్ మాట్లాడుతూ – “నాపై నమ్మకం ఉంచిన అక్కినేని అభిమానులకు ధన్యవాదాలు. మీరు ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టే వరకు నేను నిద్రపోను.. నాకు నిద్ర రాదు. నేను నిద్రపోలేను. ఇది ఖాయం. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’తో మంచి విజయాన్ని అందుకుంటానన్న నమ్మకం ఉంది”అని చెప్పారు. ఈ కార్యక్రమంలో దిల్ రాజు, బన్నీ వాసు, బొమ్మరిల్లు భాస్కర్, పూజా హెగ్డే, ఆమని, గోపీ సుందర్, హరీష్ శంకర్, మారుతి, అల్లు బాబీ, శ్రీమణి తదితరులు పాల్గొన్నారు.