Sunday, January 19, 2025

ధన ప్రభావం!

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: ఎన్నికలు తమకోసం తాము జరుపుకొనేవి అనే స్పృహ ప్రజల్లో లోపించడం వల్లనే అవి అక్రమార్జనపరుల చేతిలోని కీలుబొమ్మలవుతున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రూ. 3456.22 కోట్ల ధనం పట్టుబడింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ప్రభుత్వం చేసిన రూ. 3470.34 కోట్లు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఎన్నికలుగా భారత ఎన్నికలు కీర్తి ప్రతిష్ఠలను మోస్తున్నాయి. ఇంతకంటే అవమానకరమైన అంశం భారత ప్రజాస్వామ్యానికి ఇంకేముంటుంది? మెజారిటీ ప్రజలు నిరుపేదలు కావడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. పేదలైనంత మాత్రాన ఓటు చైతన్యం, ప్రజాస్వామిక బాధ్యత వారిలో ఇంతగా లోపించాలా? అక్రమంగా సంపాదించి కోట్లాది రూపాయల గుప్తధనం పోగులు వేసుకొంటున్న సంపన్నులు పేదల ఓటును చెరబడుతూ వుండడం వల్లనే ఈ దుస్థితి నెలకొంటున్నది. డబ్బుకి, మద్యానికి, బిర్యానికి ఓటును అమ్ముకోవాలన్న దుర్బుద్ధి ప్రజల్లో సహజంగా వుండదు.

వాటిని ఆశ చూపి వారిని తమ బుట్టలోకి రప్పించుకొనే చాకచక్యాన్ని ధనిక అభ్యర్థులే ప్రదర్శిస్తున్నారు. అందులో సఫలీకృతులవుతున్నారు. ఈ కారణంగా పేద, మధ్య తరగతికి చెందినవారు ఎన్నికల బరిలో నిలబడడానికి భయపడుతున్నారు. చదువుకొన్నవారు, ఆలోచనాపరులు జంకుతున్నారు. ఈ పరిస్థితి దేశానికి స్వాతంత్య్రం వచ్చిన, గణతంత్రం ఆవిర్భవించిన ఇన్ని సంవత్సరాలకు కూడా తొలగకపోడం శోచనీయం. అన్ని రకాల సమాచారం అందుబాటులోకి వస్తున్న వర్తమానంలోనైనా సగటు భారతీయులు ఎన్నికల ప్రాధాన్యాన్ని గుర్తించి తమ ఓటు విలువ అసాధారణమైనదని, దానిని అమ్ముకోకూడదనే కర్తవ్య స్పృహతో ఓటు వేసే సమయం రాదా? తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల శాసన సభల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఇటీవల రాష్ట్రానికి వచ్చి స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన, పారదర్శకమైన, ప్రలోభాలకు ఆస్కారం లేని ఎన్నికలు జరిపించడానికి కట్టుబడి వున్నామని ప్రకటించారు. ఎన్నికలలో డబ్బును ప్రయోగించడాన్ని గట్టిగా అడ్డుకోవాలని అధికారులకు స్పష్టం చేసినట్టు ఆయన చెప్పారు. డబ్బు, ఉచితాల పంపిణీపై దృష్టి పెట్టాలని సూచించినట్టు వివరించారు.

అలాగే ఓట్ల కోనుగోలుకు డబ్బును ఆన్‌లైన్ బదలాయింపు ద్వారా పంపించే వారి మీద దృష్టి పెట్టాలని బ్యాంకులకు కూడా చెప్పినట్టు ఆయన తెలియజేశారు. ఆచరణలో ఏమి జరుగుతుందనేది ప్రశ్నార్థకమే. ఎన్నికలు జరిగే ప్రతి సమయంలోనూ వాటి స్వచ్ఛతను కాపాడుతామని, ప్రజలు తమ ఓటును అమ్ముకోకుండా చూస్తామని అధికార్లు మాట ఇవ్వడం మామూలే. మరుక్షణమే అది గాలిలో కలిసిపోతుంది. రాజీవ్ కుమార్ మాట్లాడి వెళ్ళిన తర్వాత, ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రెండవ రోజునే హైదరాబాద్ నగరంలో అధికారుల దాడుల్లో రూ. 3 కోట్ల 80 లక్షల నగదు పట్టుబడినట్టు వార్తలు చెబుతున్నాయి. ఇది దాదాపు ప్రతిరోజూ సంభవిస్తూనే వుంటుంది. రాజకీయ పార్టీలే ఎన్నికల నిధుల పేరిట కార్పొరేట్ శక్తుల నుంచి డబ్బును స్వీకరిస్తున్న చోట ఓటర్లు ఈ ప్రలోభాలకు లొంగిపోడం విచిత్రం కాదు.

202122లో గుర్తింపు పొందిన ఎనిమిది జాతీయ రాజకీయ పార్టీలు తమ మొత్తం ఆదాయం రూ. 3289.34 కోట్లని వెల్లడించాయి. ఇందులో సగానికి పైగా ధనం బిజెపి వద్దనే వున్నదని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఎడిఆర్) అనే స్వచ్ఛంద సంస్థ అధ్యయనంలో తేలింది. ఎన్నికల విరాళాలు చెల్లించడానికి కేంద్రం కొంత కాలాన్ని కేటాయించి, ఆ సమయంలో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఇచ్చే ఫారాల ద్వారా తాము కోరుకునే పార్టీలకు డబ్బు జమ చేసే ఎలెక్టోరల్ బాండ్ల విధానాన్ని బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇది ఎంత అక్రమమైనదో, ఎన్నికలను ఎంతగా కలుషితం చేస్తుందో చెప్పనక్కర లేదు. ఈ డబ్బును ఎన్నికల్లో జల్లి పార్టీలు ఫలితాలను తమకు అనుగుణంగా మలుచుకోగలుగుతున్నాయి.

దొంగ ఓట్ల బెదడ ఇప్పటికీ కొనసాగుతున్నది. పాశ్చాత్య ప్రజాస్వామ్యాల్లో ఓటర్లు విద్యావంతులు కావడం వల్ల, జీవితావసరాలకు డబ్బు లోటు లేనివారు కావడం వల్ల అక్కడ ఓటుపై ధనప్రభావం వుండదని చెబుతున్నారు. కాని అక్కడ కూడా సామాన్యులు ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదు. కార్పొరేట్ సంపన్నుల చేతిలోనే అక్కడి ఎన్నికలు కూడా బందీ అయి వున్నాయి. డబ్బు ప్రభావం ఎక్కువైపోతున్న కొద్దీ పార్టీలు తమ టికెట్లను అమిత సంపన్నులకే ఇచ్చి తీరవలసిన పరిస్థితిలో చిక్కుకొంటున్నాయి. ఇది ఎన్నికయ్యే పార్టీల, వాటి ప్రభుత్వాల పని తీరును కూడా కళంకితం చేస్తున్నది. తాము పెట్టిన డబ్బును అసలువడ్డీలతో సహా వసూలు చేసుకోడానికి తమ చేతిలో వున్న అధికారాన్ని వారు దుర్వినియోగపరుస్తున్నారు. ఇదంతా ఒక విషవలయం. ఈ ఎన్నికల్లోనైనా ధన ప్రభావం పరిమితం కావాలని ఆశిద్దాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News