వాషింగ్టన్ : భారతదేశంలో ప్రజా రవాణా అంటే బస్సులు, రైళ్లలో అత్యధికంగా ప్రయాణించేది మహిళలే. ఈ విషయాన్ని ప్రపంచ బ్యాంకు నివేదికలో వ్లెడించారు. ఈ నివేదిక ప్రకారం చూస్తే మహిళల్లో 84 శాతం వరకూ ప్రయాణాలు ఎక్కువగా ప్రజా రవాణా వ్యవస్థ వాహనాలలోనే సాగుతున్నాయి. భారతదేశంలో మహిళలు, పురుషుల ప్రయాణ సరళిని కూడా ప్రపంచ బ్యాంక్ నివేదికలో వెల్లడించారు. పట్టణాలలో సంచార వ్యవస్థ, ప్రజా రవాణాల్లో వాడకపు తీరుతెన్నులు స్త్రీ పురుషులలో ఏ విధంగా ఉన్నాయనే క్రమాన్ని విశ్లేషించారు. మహిళలే ఎక్కువగా సాధ్యమైనంత వరకూ తాము పనిచేసే చోటుకు నడిచే వెళ్లుతుంటారు. పాదచారులై ఆఫీసులు, ఇతరత్రా పని చోట్లకు వెళ్లే ఆడవారు 45.4 శాతం వరకూ ఉన్నారని, ఇక మగవారి సంఖ్య 27.4 శాతం అని తేల్చారు.
భారతదేశ నగరాలు పట్టణాలలో రవాణా వ్యవస్థ ఏ విధంగా ఉంటే బాగుంటుందనేది తేల్చడానికి ప్రపంచ బ్యాంకు నివేదికను ఉద్ధేశించారు. ప్రజా రవాణా వ్యవస్థలో మహిళా సౌకర్యాలు, వారి అవసరాలు తీరే విధంగా మరిన్ని ఏర్పాట్లు ఉండాలని కూడా సూచించారు. ఎక్కువ మంది మహిళలు బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారని , ఇందుకు కారణం ఖర్చు ఆదా అవుతుందని భావించడం, పైగా ప్రజా రవాణా వ్యవస్థలో అయితే నెమ్మదిగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చుననే ధీమా వారిలో ఉండటం అని తెలిపారు. పైగా ఎక్కువ మంది ప్రయాణించే ప్రజా రవాణా వ్యవస్థ తమకు భద్రతాయుతంగా ఉంటుందని కూడా మహిళలు కృతనిశ్చయంతో ఉన్నారు.
మహిళలలో చాలా మంది ఎక్కువగా బయటకు రాకపోవడానికి కారణం భద్రతా లేమి అని విశ్లేషణలో వెల్లడైంది. బహిరంగ ప్రదేశాలలో తాము ఎక్కువగా కన్పించకుండా ఉంటేనే తమకు భద్రత అనే భావన వారిలో నెలకొందని పేర్కొన్నారు. ప్రపంచబ్యాంకు సర్వే విభాగం ప్రత్యేకంగా ఓ ప్రశ్నావళిని రూపొందించుకుని ముంబై, ఇతర నగరాలలో కొన్ని పట్టణాలల్లో శాంపుల్ సర్వే నిర్వహించింది. దీని మేరకు చూస్తే 2004 నుంచి 2019 మధ్యలో ఇండియాలో మగవారిలో అత్యధికులు బైక్‌లు ఇతరత్రా ద్విచక్రవాహనాలను ఎంచుకుని ప్రయాణాలు సాగిస్తున్నట్లు వెల్లడైంది. ఇదే దశలో మహిళలు బైక్‌లతో పోలిసేత ఆటోరిక్షాలు, టాక్సీలు, క్యాబ్‌లలో ఎక్కువగా ప్రయాణిస్తున్నారని తేల్చారు.