మన తెలంగాణ/హైదరాబాద్: ఇంధన, నిత్యావసరవస్తువుల ధరలు తరచుగా పెరుగుదల వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజల కష్టాలపై నిర్లక్షంగా వ్యవహరిస్తోందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపి సయ్యద్ అజీజ్ పాషా మండిపడ్డారు. ధరల పెరుగుదలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సమర్థవంతమైన చర్యలు తీసుకోకుండా సామాన్యుల జీవన ప్రమాణాలను దెబ్బ తీస్తుందని తెలిపారు. బిజెపి దుష్ట రాజకీయాలు, నిరంకుశ మోడీ ప్రభుత్వ భయంకరమైన పాలనా, విధానాలు ప్రజల జీవితాలను, జీవనోపాధిని నాశనం చేస్తున్నాయని, భారతదేశాన్ని, భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని, నేడు దేశ ప్రజలు చాలా ప్రమాదకరమైన కూడలిలో ఉన్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఇంధన, నిత్యావసరాల ధరల పెరు గుదలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా వారం రోజులు ప్రదర్శన నిర్వహించాలని సిపిఐ జాతీయ సమితి ఇచ్చిన పిలుపు మేరకు సిపిఐ హైదరాబాద్ జిల్లా సమితి శుక్రవారం హైదరాబాద్, నారాయణగూడా వైఎంసిఎ నుండి హిమాయత్‌నగర్ వై జంక్షన్ వరకు వినూత్న ప్రదర్శన నిర్వహించింది. సిపిఐ శ్రేణులు డిమాండ్ల ప్లకార్డులు చేతబూని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అజీజ్ పాషా మాట్లా డుతూ ప్రజల పక్షపాతిగా కాకుండా కార్పొరేట్‌లకు అనుకూలంగా ప్రధాని మోడీ వ్యవహరిస్తూ దేశంలో అసమర్థ, పనికిమాలిన ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు.