Sunday, December 22, 2024

మోస్ట్ వాంటెడ్ అంతరాష్ట్ర నేరస్తుడు అరెస్టు, రిమాండ్

- Advertisement -
- Advertisement -

నాలుగేళ్లుగా పోలీసుల కళ్లుగప్పి దొంగతనాలకు పాల్పడుతున్న తీరు
‘కిక్’ సినిమా తరహాలో నేరాలకు పాల్పడిన వైనం
ఆధునిక రాబిన్‌హుడ్..దోచిన సొమ్ముతో పేదలకు ఆర్ధిక సాయం
స్వగ్రామానికి విద్యుత్ వెలుగులను అందించి ‘ఉజ్వల్’గా గుర్తింపు

మన తెలంగాణ/హైదరాబాద్ : నాలుగేళ్లుగా పోలీసుల కళ్లుగప్పి దొంగతనాలకు పాల్పడుతూ నాలుగు రాష్ట్రాలకు మోస్ట్‌వాంటెడ్ బీహార్‌కు చెందిన మహ్మద్ ఇర్ఫాన్ అలియాస్ రాబిన్‌హుడ్ ఉజ్వల్ ను ఎట్టకేలకు తెలంగాణ పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. నిందితుడు ఇతర రాష్ట్రాల్లో దొంగతనం చేస్తూ తన స్వగ్రామంలో పేదలకు ఆర్థిక సహాయం చేస్తుంటాడు. దొంగతనం చేసేటప్పుడు ఆధారాలు లభించకుండా తనదైన పంథాలో చేస్తుంటాడు. నాలుగు రాష్ట్రాల్లో కేసులు నమోదవ్వగా చివరకు తెలంగాణ పోలీసులకు పట్టుబడ్డాడు. రాబిన్ హుడ్.. ఈ పేరు వినగానే ‘కిక్’ సినిమా గుర్తుకు వస్తుంది. ఈ సినిమా రాబిన్ హుడ్ స్ఫూర్తి తో తెరకెక్కింది. బడాబాబుల వద్ద దోచుకొని మొహం కనిపించకుండా, కెమెరాలకు చిక్కకుండా, దొరకకుండా పెద పిల్లలకు, క్యాన్సర్ తో బాధ పడుతున్న వారికి తాను దోచుకున్నదంతా పంచిపెడతాడు హీరో.

ఇదంతా ఓ సినిమా కానీ నిజ జీవితంలో కూడా ఓ రాబిన్ హుడ్ ఒకడున్నాడు అతడే పోలీసులకు చిక్కిన ఆధునిక రాబిన్‌హుడ్ మహ్మద్ ఇర్ఫాన్. హైదరాబాద్ ముంబై మధ్య రాకపోకలు కొనసాగిస్తు నిందితుడు మహ్మద్ ఇర్ఫాన్ చోరీలు చేసేందుకు ముందుగా ఆధునిక సాంకేతికత సాయం తీసుకుంటాడు. ఖరీదైన ప్రాంతాలపై కన్నేస్తాడు. సెల్‌ఫోన్, చెప్పులు ఉపయోగించ డు. చోరీ సమయంలో సిసి కెమెరాల కళ్లకు చిక్కకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటాడు. అంతేకాదు హైదరాబాద్ నగరంలో జూబ్లీహిల్స్‌లోనే దొంగతనాలు పాల్పడతాడు. ఏదైనా ప్రాంతంపై దృష్టి పెట్టాడు అంటే పోలీసులకు ఎటువంటి చిన్న క్లూ కూడా దొరక్కుండా సెల్ ఫోన్‌లో సిమ్ వేసుకోకుండా కేవలం నెట్టుతోనే వాట్స్‌అప్ కాల్స్ మాత్రమే వాడుతూ అత్యంత పకడ్బందీగా దొంగతనాలకు పాల్పడతాడు. గత నాలుగేళ్లుగా బెంగళూరు ,ఢిల్లీ ,హైదరాబాద్ పోలీసులు ఇతని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
పట్టుబడింది ఇలా…!
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం బిహార్‌లోని గర్హ సమీప జోగియా గ్రామానికి చెందిన మహ్మద్ ఇర్ఫాన్ అలియాస్ రాబిన్ హుడ్ ఉజ్వల్ ఈ నెల 8న హైదరాబాద్ లక్షీకాపూల్‌లోని మెరిడియన్ గోల్డెన్ లాడ్జ్‌లోకి దిగాడు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో ఓ సినీ ప్రముఖుడు నివసించే ఇంటి సమీపంలో రెక్కీ చేశాడు. దొంగతనానికి అనుకూలంగా లేకపోవడంతో జూబ్లీహిల్స్ ఎంఎల్‌ఎ కాలనీకి వెళ్లాడు. ధృవ అనురాగ్ రెడ్డి అనే ప్రైవేట్ ఉద్యోగి ఇంట్లోకి ప్రవేశించి రూ.5 లక్షల రుద్రాక్షతో కూడిన బంగారు గొలుసు చోరీ చేసి ముంబయికు ఉడాయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రాబిన్‌హుడ్ కోసం గాలించిన పోలీసులు నాలుగైదు రోజులలో 75 పైగా సిసి కెమెరాలు వెతకగా వెంకటగిరిలోని ఓ ఇంటి వద్ద ఏర్పాటు చేసినటువంటి సిసి కెమెరాలు అతని ఆనవాళ్లు కనిపించాయి. ఈ విధంగా రాబిన్‌హుడ్ మొదటిసారిగా కెమెరాకు చిక్కాడు. పాత నేరస్తుల ఫోటోలను పరిశీలనలో రాబిన్ హుడ్ మామూలోడు కాదని కరుడుగట్టిన అంతర్రాష్ట్ర దొంగగా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలో అతను మళ్లీ నగరానికి వచ్చి మెరిడియన్ గోల్డెన్ లాడ్జిలో దిగినట్లు తెలుసుకున్న పోలీసులు శుక్రవారం యూసుఫ్‌గూడ చెక్‌పోస్టు వద్ద మహమ్మద్ ఇర్ఫాన్‌ని పట్టుకున్నారు. ఢిల్లీలో 4, హైదరాబాద్‌లో 4, బెంగళూరులో 7 కేసుల్లో ఇతడు నిందితుడు. ఇతని నుంచి ఒక పెద్ద స్క్రూ డ్రైవర్, చిన్న స్క్రూ డ్రైవర్, జియో డాంగిల్, టెక్నో స్మార్ట్ సెల్‌ఫోన్, ఆకుపచ్చ రంగు హుడీ(మంకీ క్యాప్ ఉండే చొక్కా), నలుపు రంగు టోపీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు రాబిన్‌హుడ్ ముంబయిలో బ్యాగులు కుడుతూ వివిధ నగరాల్లో చోరీలకు పాల్పడుతుండేవాడు. దొంగతనం చేయడానికి రెక్కీ నిర్వహించే సమయంలో సిసి కెమెరాలపై నిఘా పెట్టడం, ఒక ఇంటిపై నుంచి మరో ఇంటిపైకి వేగంగా దూకుతూ వెళ్లడం, ఖరీదైన కారు చోరీ చేసి అందులోనే దొంగతనాలకు వెళ్లడం చేసేవాడు.

చోరీ చేసిన డబ్బులో అత్యధిక భాగం సొంతూరిలో పేద విద్యా ర్థులు, రైతుల కోసం ఖర్చు చేస్తుంటాడు. చోరీ చేసిన సొమ్ముతో తన గ్రామంలో విద్యుత్ స్తంభాలు వేయించి కరెంట్ వచ్చేలా చేయడంతో గ్రామస్థులు అతనికి ఉజ్వల్ అని పేరు పెట్టినట్లు పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. ఇతని దొంగతనంలో మరో ప్రత్యేకత ఇమిడి ఉంది. కేవలం నగదు, బంగారం, వజ్రాలనే చోరీ చేస్తాడు. వెండి వస్తువుల జోలికి పోడు. మొదటి భార్య ఉండగా, ముంబయి పబ్‌లో బార్ గర్ల్‌గా పని చేసే గుల్షన్‌ను రెండో వివాహం చేసుకున్నాడు. కోల్‌కత్తాకు చెందిన మరో యువతితో మూడో పెళ్లి చేసుకున్నాడు. ఇటీవలే పూజ అనే అమ్మాయిని ప్రేమించి తన చేతిపై ఆమె చిత్రాన్ని పచ్చబొట్టు వేయించుకున్నాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News