న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో జాతీయ దర్యాప్తు సంస్థ ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల్లో కీలక విజయం సాధించింది. ఐసిఎస్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మహమ్మద్ షానవాజ్ అలియాస్ షఫీ ఉజామాను అరెస్టు చేసింది. ఇతడి వివరాలు వెల్లడించిన వారికి రూ.3 లక్షల రివార్డును కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. కొన్నాళ్ల క్రితం ఢిల్లీ మాడ్యూల్ ఐసిస్ ఉగ్రవాదిని అరెస్టు చేసి రాబట్టిన సమాచారం ఆధారంగా షానవాజ్‌ను బంధించారు. ఢిల్లీలో ఇతడు ఉగ్రదాడులకు పన్నాగం పన్నినట్టు ఎన్‌ఐఏ అధికారులు చెబుతున్నారు. వృత్తి రీత్యా ఇంజినీర్ అయిన షానవాజ్ పుణే ఐసిస్ మాడ్యుల్ కేసులో కీలక నిందితుడు. ఇతడు పుణే పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకొని వచ్చి ఢిల్లీలో ఉంటున్నారు. ఇప్పటికే ఐసిస్ అనుమానితులుగా అరెస్టు చేసిన ఇద్దరు వ్యక్తులతో కలిసి షానవాజ్‌ను పోలీస్‌లు విచారిస్తున్నారు.
ఇతడి వద్ద నుంచి ఐఈడీలను తయారు చేయడానికి ఉపయోగించే పలు రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు , ఎన్‌ఐఎ అధికారులు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ఆగస్టులో ఠాణె జిల్లాలో షమిల్ షకీబ్ నాచాన్ అనే ఉగ్రవాదిని అరెస్టు చేసి పేలుడు పదార్థాలకు ఉపయోగించే మెటీరియల్‌ను స్వాధీనం చేసుకొన్నారు. ఈ సందర్భంగా వీరితోపాటు మరికొందరు కూడా ఉగ్రకార్యకలాపాల్లో పాల్గొన్నట్టు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురిని ఎన్‌ఐఏ అదుపు లోకి తీసుకొంది. వీరంతా ఐఈడీలను వాడి 26/11 పేలుళ్ల కంటే పెద్ద దాడిని దేశంలో చేయాలని కుట్ర పన్నుతున్నట్టు అధికారులు చెప్పారు. ఇప్పటికే నాచాన్, పుణెలో బాంబుల తయారీపై ఓ వర్క్‌షాప్ నిర్వహించినట్టు అధికారులు గుర్తించారు. దీంతో ఎన్‌ఐఏ బృందాలు ఐసిస్ పుణే మాడ్యుల్ లోని వ్యక్తులను అరెస్టు చేయడం కోసం ప్రత్యేక గాలింపు బృందాలను ఏర్పాటు చేసింది.