నాగర్‌కర్నూల్ : సకాలంలో వైద్యం అందకపోవడంతో తల్లి శిశువు మృతి చెందారు. నాగర్‌కర్నూల్ జిల్లా పదర మండలం వంకేష్వరం గ్రామానికి చెందిన స్వర్ణకు రెండు సంవత్సరాల క్రితం ప్రసాద్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరు హైదరాబాద్‌లో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు. డెలివరి కోసం స్వర్ణ రెండు నెలల క్రితం పుట్టింటికి వచ్చింది. సోమవారం పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు అమ్రాబాద్ ప్రాథమిక ఆసుపత్రికి తీసుకెళ్ళారు. అక్కడి నుంచి అచ్చంపేట ఆసుపత్రికి తీసుకెళ్ళారు.
అక్కడ వైద్యులు నాగర్‌కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్ళమని చెప్పడంతో నాగర్‌కర్నూల్ జనరల్ ఆసుపత్రికి తరించారు. అక్కడ వైద్యులు మహబూబ్‌నగర్ పాథమిక ఆసుపత్రికి తీసుకెళ్ళమని పంపించారు. మంగళవారం అర్ధరాత్రి 2 గంటలకు ఆసుపత్రికి చేరుకున్న స్వర్ణకు డాక్టర్లు సాధారణ ప్రసవం చేశారు. ఊపిరి పీల్చుకోలేక శిశువు వెంటనే మృతి చెందగా , ఫిట్స్, గుండెపోటుతో తల్లి స్వర్ణ మృతి చెందింది. దీంతో ఆ కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. సకాలంలో వైద్యం అందకపోవడం వల్ల వారు ఇద్దరు మరణించారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.