ఒంటరితనం భరించలేక, చుట్టుపక్కల వాళ్ళు ఎవరూ మాట్లాడకపోవడంతో మనస్తాపంతో తల్లి, కూతురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన మెదక్ జిల్లా, చేగుంట మండలం, రెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధిలోని మక్కరాజిపేట గ్రామానికి చెందిన లావణ్యకు, ఎల్లవ్వ కుమారుడు తలారి ముత్యంకు వివాహం జరిగింది. ఆరు నెలల క్రితం లావణ్య బావిలో పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె మృతికి అత్త, ఆడపడుచు, భర్త కారణమంటూ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో ఎల్లవ్వ, పోచమ్మతోపాటు ముత్యంపై కేసు నమోదైంది. కాగా, కుమారుడు ముత్యం జైలు నుండి వచ్చిన తర్వాత బతుకు దెరువు కోసం తన పిల్లలతో హైదరాబాద్ వెళ్లాడు. ప్రస్తుతం ఇంట్లో తల్లి (70), కూతురు (50) మాత్రమే ఉంటున్నారు. వీరితో చుట్టుపక్కల వారు ఎవరూ మాట్లాడకపోవడం, ఒంటరితనం భరించలేక మనస్తాపం చెంది మంగళవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ముత్యం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ బాలరాజ్ తెలిపారు.