Thursday, November 21, 2024

వరకట్న వేధింపులతో తల్లి, కూతుర్లు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -
Mother and daughters killed in dowry harassment
చెరువులో శవాలై తేలిన తల్లి సహా ఇద్దరు చిన్నారులు,  భర్త, అత్తపై ఫిర్యాదు.. అత్తింటిపై దాడి..

గంభీరావుపేట : సిరిసిల్ల రాజన్న జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపెల్లి గ్రామానికి చెందిన వర్కుటి రేఖ తన కూతుళ్లు అభిజ్ఞ(3), 6నెలల పాప అన్సికతో శుక్రవారం తెల్లవారుజామున ఊర చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు కూతుళ్లతో తల్లి చెరువులో దూకి తనువు చాలించిన ఘటన స్థానికంగా విషాదం నింపింది. మూడేళ్లు కూడా దాటని చిన్నారులకు అప్పుడే నూరేళ్లు నిండాయా అంటూ సంఘటనా స్థలం వద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో రేఖ తన కూతుళ్లతో ఇంటి నుంచి వెళ్లి చెరువులో శవాలై తేలడంతో అటు లింగన్నపేట, ఇటు కొత్తపెల్లికి చెందిన ప్రజలు ఊరచెరువు కట్ట వద్దకు పరుగులు తీశారు. చెరువులో చిన్నారుల మృతదేహాలను చూచి ఆ ప్రాంతం అంతా విషాదంలో మునిగిపోయింది.

మండలంలోని లింగన్నపేటకు చెందిన రేఖకు ఐదేళ్ల కిందట కొత్తపెల్లికి చెందిన వర్కుటి రాజుతో అన్ని కట్నకానుకలతో పెళ్లి చేశారు. రేఖను తల్లితండ్రులు చిన్న వయస్సులోనే మృతి చెందడంతో అన్న నరేష్ వివాహం జరిపించాడు. పెళ్లి నాటి నుంచి అత్తింటి వారు వేధిస్తూ వచ్చారు. పెళ్లి సమయంలో కట్నంతోపాటు, 10తులాల బంగారం ఇచ్చినా.. అదనపు కట్నం కోసం భర్త రాజు, అత్త లక్ష్మి నిత్యం రేఖను వేధిస్తూ వచ్చేవారు. మద్యం మత్తులో భర్త రాజు రేఖను చిత్రహింసలకు గురిచేసేవాడని సంఘటనా స్థలంలో బంధువులు తెలిపారు. విషయం కులపెద్దలవరకూ వెళ్లడంతో పలుమార్లు పంచాయితీలు కూడా జరిగాయి. ఆరు నెలల కిందట అదనంగా లక్ష రూపాయలతోపాటు రాజుకు బైక్ కొనిచ్చారు.

అయినా.. రేఖకు వేధింపులు తప్పలేదు. రెండు రోజుల కిందట అత్త లక్ష్మి, భర్త రాజు రేఖను కొట్టినట్లు గ్రామస్థులు తెలిపారు. కాగా, రేఖ చిన్నారుల చావుకు అత్తింటివారే కారణం అంటూ ఆక్రోశించిన రేఖ బంధువులు రాజు ఇంట్లో ఫర్నిచర్‌ను ధ్వంసం చేసేందుకు ప్రయత్నం చేశారు. భర్త రాజు, అత్త లక్ష్మిని తమకు అప్పగించాలంటూ బంధువులు పట్టుపట్టారు. అప్పటి వరకు చెరువులోని మృతదేహాలను తీసేదిలేదంటూ వాధించారు. వేములవాడ డిఎస్‌పి చంద్రకాంత్, ఎస్‌బి సిఐ సర్వర్, చందుర్తి సిఐ శ్రీలత, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, వీర్నాపెల్లి, ముస్తాబాద్, తంగలపల్లి, ఎస్‌ఐలు పెద్దఎత్తున పోలీసు బలగాలతో చేరుకుని వారిని శాంతింప చేశారు. రేఖ బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్‌ఐ మహేష్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News