Wednesday, January 22, 2025

ఆ ఏడుగురే కారణం

- Advertisement -
- Advertisement -

Mother and son were set on fire and died

కామారెడ్డి లాడ్జి గదిలో శనివారం తెల్లవారుజామున నిప్పంటించుకొని
సజీవ దహనమైన రామాయంపేటకు చెందిన తల్లీకొడుకుల మరణ వాంగ్మూలం

రామాయంపేట మున్సిపల్ చైర్మన్ గౌడ్, అప్పటి సిఐ నాగార్జున గౌడ్, బాలు, మార్కెట్
కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, తోట కిరణ్, ఖన్నాపురం కృష్ణాగౌడ్, సరాఫ్ స్వరాజ్‌ల ఫొటోలు
సహా లేఖ రాసి చేసుకున్న గంగం సంతోష్, తల్లి పద వైరల్ అయిన సెల్ఫీ
వీడియోలు కుటుంబాలతో జితేందర్ గౌడ్ సహా ఏడుగురు నిందితులు
రామాయంపేటలో చైర్మన్ ఇంటి వద్ద మృతదేహాలతో నిరసన తెలిపిన పట్టణవాసులు,
బంధువులు జిల్లా ఎస్‌పి రోహిణి ప్రియదర్శిని జోక్యంతో ఆందోళన విరమణ
దోషులు ఎంతటివారైనా అరెస్టు చేస్తామని ఎస్‌పి హామీ

మన తెలంగాణ/మెదక్ ప్రతినిధి/కామారెడ్డి : తల్లి కొడుకులు సజీవదహనం చేసుకున్న ఘటన శనివారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. రాజకీయ నాయకులు, పోలీసుల వంచనే తమ ఆత్మహత్యలకు ముఖ్య కారణమంటూ సెల్ఫీ వీడియోతోపాటు సూసైడ్ నోట్ రాసి గంగం సంతోష్, అతని తల్లి గంగం పద్మ పెట్రోల్ పోసుకుని సజీవ దహనానికి గురయ్యారు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగం సంతోష్ మెదక్ జిల్లా రామాయంపేట నివాసి. ఇతను రియల్ ఎస్టేట్‌తోపాటు ఏజెన్సీ నిర్వాహకుడిగా వ్యాపారం చేసేవాడు. గత మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్‌గా పల్లె జితేందర్‌గౌడ్ గెలుపుకోసం సంతోష్‌కుమార్ 50లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఎన్నికల అనంతరం తన డబ్బులు ఇవ్వమని చైర్మన్ జితేందర్‌గౌడ్‌ను సంతోష్ అడగ్గా.. నేను, నీకు డబ్బులు ఇచ్చేది లేదు. నువ్వే నీ వ్యాపారంలో 50శాతం వాటా నాకు ఇవ్వాలి. మున్సిపాలిటీ పరిధిలో ఏ వ్యవహారంలోనైనా నీకు సహకరిస్తానంటూ సంతోష్‌ను జితేందర్‌గౌడ్ వాటా అడిగాడు. దీంతో ఇరువురి మధ్య మాట మాట పెరిగింది.

దీంతో బాధితుడు సంతోష్ పోలీసులను ఆశ్రయించగా అప్పట్లో అక్కడ సిఐగా పనిచేస్తున్న నాగార్జున గౌడ్ చైర్మన్ జితేందర్‌గౌడ్‌కు సన్నిహితు డు కావడంతో సంతోష్ ఫిర్యాదును తీసుకోకుండా అతని వద్ద ఉన్న సెల్‌పోన్ లాక్కొని ఇరువురు కలిసి చంపేస్తామని బెదిరించడం జరిగిందన్నారు. అంతేకాకుండా సంతోష్ సెల్‌ఫోన్‌లో ఉన్న డేటా పూర్తిగా సిఐ పరిశీలించగా అందులో కొన్ని వ్యక్తిగతమైన(సంతోష్ ఆశ్లీల) వీడియోలు, రికార్డింగ్‌లు లభ్యమయ్యాయి. వాటిని సిఐ, చైర్మన్‌లు లాక్కొని మా జోలికోస్తే వీటిని బయటపెడతామని బ్లాక్‌మెయిల్ చేశారు. అంతేకాకుండా 50శాతం బిజినెస్ వాటా కూడా ఖచ్చితంగా తమకు ఇవ్వాల్సిందేనని బెదిరింపులకు దిగారు. చైర్మన్, సిఐలకు తోడుగా మార్కెట్ కమిటి చైర్మన్ సరాఫ్ యాదగిరితోపాటు ఐరేని పృధ్విరాజ్(బాలు), తోట కిరణ్, కన్నాపురం కృష్ణా గౌడ్, బాషం శ్రీను అనే వ్యక్తులంతా కలిసి మృతుడు సంతోష్‌ను బెదిరింపులకు గురిచేశారు. ఈ విషయమై సంతోష్ ఎస్పితోపాటు డిజిపికి ఫిర్యాదుచేస్తూ ప్రధానమంత్రికి మెయిల్ ద్వారా ఫిర్యాదుకూడా చేశారు. అయినప్పటికీ వీరి ఆగడాలు ఏమాత్రం తగ్గకపోవడంతో ఈనెల 11వ తేదీన తన తల్లి పద్మకు ఆరోగ్యం బాగాలేదని కామారెడ్డి వెళ్లి అక్కడ ఒక లాడ్జిలో బస చేశారు.

అప్పుడు కూడా నిందితుల నుంచి అతనికి ఒత్తిడి పెరగడంతో తన తల్లికి పూర్తి విషయం చెప్పి వీరు మనల్ని మానసికంగా చంపేస్తారు, వీరి ద్వారా ఎప్పటికైనా ప్రమాదమేనని శనివారం తెల్లవారుజామున 4గంటల సమయంలో పెట్రోల్ పోసుకుని లాడ్జిలోనే సజీవదహనానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న కామారెడ్డి పోలీసులు మెదక్ జిల్లా పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఘటనాస్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు మొదలుపెట్టగా అప్పటికే మృతులు సంతోష్, పద్మల సెల్ఫీ వీడియోలు రామాయంపేటతో పాటు జిల్లా వ్యాప్తంగా వైరల్ అయ్యాయి. విషయం తెలుసుకున్న నిందితులు జితేందర్‌గౌడ్ సహా ఏడుగురు వ్యక్తులు కుటుంబసభ్యులతో సహా పరారయ్యారు. నిందితులలో ఒకరైన అప్పటి సిఐ నాగార్జున గౌడ్ ప్రస్తుతం నల్గొండ జిల్లా తుంగతుర్తి సిఐగా ఉన్నారు.

కాగా, కామారెడ్డి నుంచి తల్లికొడుకు మృతదేహాలను రామాయంపేటకు తీసుకువచ్చిన బంధువులు మున్సిపల్ చైర్‌పర్సన్ పల్లె జితేందర్ గౌడ్ ఇంట్లోకి తీసుకువచ్చి తమకు న్యాయం కావాలంటూ ఆందోళనకు దిగారు. వీరికి తోడుగా పట్టణంలోని ప్రజలు పలు రాజకీయ పార్టీల నాయకులు అండగా నిలిచి సంతోష్ కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. పెద్ద సంఖ్యలో వచ్చిన జనంతో ఆందోళన ఎంతకూ సద్దుమనగకపోవడంతో ఘటనాస్థలానికి జిల్లా ఎస్పి రోహిణి ప్రియదర్శిని చేరుకున్నారు. పరారీలో ఉన్న నిందితులను 24గంటల్లోగా అరెస్టు చేస్తామని, ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకొని శిక్షపడేలా చేస్తామని హామీ ఇవ్వడంతో పట్టణవాసులు, మృతుని బంధువులు ఆందోళనను విరమించారు. నిందితుల ఆస్తులను, వారు అక్రమంగా సంపాదించిన సంపాదన మొత్తం పేదలకు పంచాలని ఈ సందర్భంగా మృతుని బంధువులు డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పి తెలిపారు. మృతుల సెల్ఫీ వీడియోల ఆధారంగా నిందితులకు సాయంచేసిన వారు, సానుభూతిపరులపై కూడా దృష్టిపెట్టిన పోలీసులు ఇప్పటికే కూపీ లాగడం మొదలుపెట్టారు. అసలు నిందితులను అరెస్టు చేసిన తర్వాత పూర్తి వివరాలను తెలియజేస్తామని ఎస్పి రోహిణి ప్రియదర్శిని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News