మనతెలంగాణ/హైదరాబాద్ : పాల విక్రయ ధరలు మళ్లీ పెరిగాయి. లీటరు పాల ధరను రూ.2పెంచినట్టు మదర్‌డెయిరీ ప్రకటించింది. లీటరుకు ఫుల్‌క్రీం పాలపైన రూపాయి, టోకెన్ పాలపైన రూ.2 పెంచుతున్నట్టు తెలిపింది. పెంచిన పాల ధరలు సోమవారం నుంచే అమల్లోకి తెస్తున్నట్టు వెల్లడించింది. పాల విక్రయధరలు ఈ పెంపుదలతో ఈ ఏడాది నాలుగు సార్లు పెంచినట్టయింది. అంతకు ముందు మార్చిలో , ఆ తరువాత ఆగస్ట్‌లు, రెండు నెలల గ్యాప్‌తో మళ్లీ అక్టోబరులో ధరలు పెంచింది. దేశ రాజధాని ఢిల్లీలో అత్యధిక పాలు సరఫరా చేస్తున్న డెయిరీల్లో మదర్ డెయిరీ కూడా ఒకటిగా ఉంది.
ఈ సంస్థ రోజుకు 30లక్షల లీటర్ల పాలు విక్రయిస్తోంది. సోమవారం నుంచి పెరగనున్న ధరలను మదర్‌డెయిరీ విడుదల చేసింది.లీటరు ఫుల్ క్రీం పాల ధర రూ.64కు చేరుకోగా, టోకెన్ పాలు రూ.50కి పెరగనున్నాయి. అయితే అరలీటరు పాల ప్యాకెట్ ధరలో మాత్రం ఏ విధమైన మార్పులు చేయలేదని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. రైతుల నుంచి సేకరిస్తున్న పాలు రవాణ ,మార్కెటింగ్ వ్యయాలు పెరిగినందువల్లనే విక్రయ ధరలు పెంచాల్సివచ్చిందని మదర్ డెయిరీ వివరణ ఇచ్చింది. అంతే కాకుండా ఈ ఏడాది పాల మార్కెట్‌లో డిమాండ్‌కు సరిపడా పాల ఉత్పత్తి కూడా లేకపోవటం మరో కారణంగా తెలిపింది. పశువుల దాణ ధరలు పెరగటం, వాతావరణ సమస్యల వల్ల పాల ఉత్పత్తి తగ్గినట్టు తెలిపింది. అయినప్పటికీ పాడి రైతులకు మంచి ధర చెల్లించి వినియోగదారులకు నాణ్యమైన పాలు అందిస్తున్నామని మదర్ డెయిరీ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.