Saturday, November 16, 2024

రాష్ట్రంలో మొదలైన క్షీర విప్లవం

- Advertisement -
- Advertisement -
Mother Dairy New Directors Meets Minister KTR
సాగు నీటి అందుబాటులోకి రావడమే ఇందుకు ప్రధాన కారణం
మదర్ డెయిరీని లాభాల బాటలో పరుగులు పెట్టించాలి
కొత్తగా ఎన్నికైన డైరెక్టర్లకు దిశానిర్దేశం చేసిన మంత్రి కెటిఆర్

హైదరాబాద్ : రాష్ట్రంలో క్షీర విప్లవం మొదలైందని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. సాగునీరు పుష్కలంగా అందుబాటులోకి రావడమే ఇందుకు ప్రధాన కారణమన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల పలు రంగాల్లో తెలంగాణ విప్లవాత్మకమైన ప్రగతిని సాధిస్తోందన్నారు. అనేక విప్లవాలకు నాంది పలుకుతోందన్నారు. ఇప్పటికే హరిత విప్లవంలో రాష్ట్రం అగ్రస్థానంలో కొనసాగుతోందన్నారు. ఇప్పుడు క్షీర విప్లవం కూడా ప్రారంభమైందన్నారు. ఈ నేపథ్యంలో క్షీర విప్లవంలో గణనీయమైన వృద్ధి సాధించేందుకుగానూ సమగ్ర ప్రణాళికలను రూపొందించాలన్నారు.

నల్గొండ జిల్లాలోని నార్ముల్ ఎన్నికల్లో విజయం సాధించిన డైరెక్టర్లు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఉదయం ప్రగతి భవన్‌లో మంత్రి కెటిఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికయిన ఇద్దరు మహిళా డైరెక్టర్లతో పాటు ఎన్నికల్లో విజయం సాధించిన నలుగురు డైరెక్టర్లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం వారిని ఉద్దేశించి మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా మనపై బాధ్యత మరింతగా పెరిగిందన్నారు. ఈ నేపథ్యంలో మదర్ డైరీని పూర్తిగా లాభాల బాటలో నడిపించేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆయన సూచించారు. ఇప్పటికే విజయా డైరీని రాష్ట్ర ప్రభుత్వం బలోపేతం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు విజయ డెయిరీ అనేక ఇబ్బందులు ఎదుర్కొందని…. అటువంటి డెయిరీని రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా బలోపేతం చేసిందని మంత్రి కెటిఆర్ వెల్లడించారు.

కేవలం వ్యవసాయమే కాకుండా అనుబంధ రంగాల్లో ఉన్న అవకాశాలను సైతం అందిపుచ్చుకునేలా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. ఈ దిశగా ముఖ్యమంత్రి కెసిఆర్ అనునిత్యం దిశా నిర్దేశం చేస్తున్నారని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ముఖ్యంగా పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన రోజు నుండి సిఎం కెసిఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారన్నారు. కాగా కెటిఆర్‌ను కలిసిన వారిలో నార్ముల్ డైరెక్టర్లు కర్నాటి జయశ్రీ, అలివేలు, కోట్ల జలందర్ రెడ్డి, రచ్చ లక్ష్మినరసింహా రెడ్డి, గూడూరు శ్రీధర్ రెడ్డి, చల్లా సురేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News