పాట్నా: డబ్బు కోసం తల్లి ప్రేమనే మర్చిపోయింది ఓ మహిళ. అది కూడా ప్రియుడి కోసం. ప్రేమించిన వ్యక్తితో కలిసి ఉండేందుకు ఇల్లు కట్టుకోవడానికి కన్న బిడ్డను కిడ్నాప్ చేయించింది. ఈ ఘటన బిహార్‌లోని చప్రా జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
చాప్రా జిల్లాలో 13 సంవత్సరాల బాలుడు ఆదిత్యకుమార్ కిడ్నాప్ అయ్యాడు అంటూ అతని బంధువు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రూ.25 లక్షలు ఇవ్వకపోతే బాలుడిని చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ.. ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ కేసు విచారణ చేస్తున్న క్రమంలో బాలుడి తల్లి బబితా దేవి ప్రవర్తన అనుమానస్పదంగా కనిపించింది. దీంతో ఆమెను విచారించగా.. బాలుడిని తానే కిడ్నాప్ చేయించినట్లు అంగీకరించింది.
తన ప్రియుడు నితీశ్ కుమార్‌తో కలిసి ఉండేందుకు ఓ ఇంటి నిర్మాణం చేయాలని అనుకున్నానని, దానికి కావాల్సిన డబ్బు కోసమే ఈ పని చేశానని బబిత పోలీసులకు తెలిపింది. దీంతో పోలీసులు నితీశ్ కుమార్‌ని కూడా అరెస్ట్ చేసి వారిచ్చిన సమాచారం మేరకు పాట్నాలో ఓ ప్రాంతంలో బంధించిన బాలుడిని క్షేమంగా ఇంటికి తీసుకువచ్చారు.