Tuesday, March 4, 2025

కన్నకొడుకే కాలయముడై..

- Advertisement -
- Advertisement -

నవమాసాలు మోసి, కని, పెంచిన కన్నపేగు కసాయిగా మారింది. అల్లారుముద్దుగా చూసుకున్న చిన్నకొడుకే కాలయముడై కన్నతల్లినే కడతేర్చాడు. మద్యానికి బానిసై దారితప్పిన కన్నకొడుకును సరిచేయాలనుకున్నదే ఆ మాతృమూర్తి పాలిట శాపంగా మారింది. కర్కశంగా మారి కన్నతల్లిపైనే విచక్షణారహితంగా కత్తితో దాడి చేసి అంతమొందించాడు ఓ నరరూప రాక్షసుడు. సభ్య సమాజం తలదించుకునేలా చేసిన ఈ ఘటన సంగారెడ్డి జిల్లా, కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని తెల్లాపూర్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి ఇన్స్పెక్టర్ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. తెల్లాపూర్‌కు చెందిన రాధిక దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి మున్సిపల్ పరిధిలోని డివినో విల్లాస్ నివాసం ఉంటున్నారు. రాధిక చిన్న కుమారుడు నవారి కార్తీక్ రెడ్డి (26) తాగుడుకు బానిసై ప్రతినిత్యం ఇంట్లో అలజడి సృష్టించేవాడు. అతడి ఆగడాలు తట్టుకోలేక చికిత్స చేసేందుకు సైతం కొన్నిరోజులు కోయంబత్తూర్‌లోని రిహాబిలిటేషన్ సెంటర్లో ఉంచి ట్రీట్మెంట్ చేయించారు.

కొంతకాలం తరువాత ఇంటికి వచ్చిన కార్తీక్ రెడ్డి మళ్లీ అదేపనిగా ఇంట్లో గొడవలు సృష్టిస్తున్నాడు. ఇటీవల ఆ ఇంట్లో పెద్ద కొడుకు వివాహం జరిగిన అనంతరం కార్తీక్ రెడ్డి ఆగడాలు మరింత పెరిగిపోయి ఆస్తి వాటాలు చేయాలంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి పెంచాడు. దారితప్పిన కొడుకును సరిదిద్దాలన్న ప్రయత్నంలో తల్లిదండ్రులు విఫల ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఏదోవిధంగా గొడవ సృష్టిస్తున్న కార్తీక్ ఆదివారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చి తల్లిదండ్రులతో మళ్లీ గొడవపడ్డాడు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆస్తి పంపకాలు చేయాలని తీవ్రస్థాయిలో వాదనకు దిగాడు. అందుకు ససేమిరా అన్న తల్లిపై కక్ష పెంచుకున్న కార్తీక్ రెడ్డి తెల్లవారుజామున కత్తితో విచక్షణారహితంగా దాడి చేశారు. గాయాల పాలైన ఆమెను కుటుంబ సభ్యులు హుటాహుటిన సిటిజన్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు ఘటన స్థలం చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News