మన తెలంగాణ/అక్కన్నపేట : కన్నతల్లి తొమ్మిదేళ్ల వయసులోని కుమార్తెను రోకలి బండతో మోది చంపేసింది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మల్చెరువు తండాలో ఈ విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. భూక్య తిరుపతి, మమత దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. తిరుపతి లారీ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇదిలా ఉండగా మంగళవారం రాత్రి తిరుపతి వృత్తిననుసరించి వేరే ఊరికి వెళ్లగా బుధవారం ఆ దంపతుల పెద్ద కుమార్తె అయిన సోని(09) ఉదయం లేచి ఇంట్లో ఉన్న బియ్యం తింటుండడంతో ఆ అలికిడికి నిద్ర లేచిన మమత ఒక్కసారిగా ఆగ్రహావేశాలకు గురై ఉదయం పూట బియ్యం తినడం ఏమిటని ప్రశ్నిస్తూనే తన కుమార్తె సోనిని పక్కనే ఉన్న రోకలిబండతో చితకబాదింది.
దీంతో సోనికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే రక్తపు మడుగుల్లో కుప్ప కూలిపోయింది. అది గమనించిన వారి కుమారుడు జగన్ తన చెల్లి అఖిలను తీసుకొని సంఘటన వివరాలను పొరుగువారికి తెలిపారు. స్థానికులు మమత ఇంటికి వచ్చే వరకే సోని రక్తమడుగులో పడి ఉండడాన్ని గమనించి, పరిశీలించగా సోని అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న భర్త భూక్య తిరుపతి తండాకు చేరుకున్నాడు. జరిగిన సంఘటనను పోలీసులకు తెలియజేయడంతో వారు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. భర్త తిరుపతి ఫిర్యాదు మేరకు మమతపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.