Thursday, April 3, 2025

ప్రియుడి కోసం కన్నపేగులను చిదిమింది

- Advertisement -
- Advertisement -

ప్రియిడిని పెళ్లి చేసుకునేందుకు తన కన్నబిడ్డలను కడతేర్చిన తల్లిని, ఆమె ప్రియుడిని పోలీస్‌లు అరెస్టు చేశారు. సంచలనం సృష్టించిన ఈ అమానవీయ ఘటనకు సంబంధించి సంగారెడ్డి జిల్లా ఎస్‌పి పరితోష్ పంకజ్ బుధవారం సాయంత్రం తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం…అమీన్‌పూర్ రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉంటున్న అవురింతల చెన్నయ్య వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతని భార్య రజిత (లావణ్య) ప్రయివేట్ స్కూల్ టీచర్‌గా పనిచేస్తోంది. 2013లో వీరికి వివాహం జరిగింది. తనకంటే 20 ఏళ్లు పెద్దవాడైన చెన్నయ్యతో ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో రజితకు పెద్దలు వివాహం జరిపించారు. దీంతో ఆమె నాటి నుంచే భర్త పట్ల అయిష్టతతో ఉంది. దంపతుల మధ్య తరచుగా గొడవలు జరిగేవి. వీరికి సాయికృష్ణ (12), మధుప్రియ(10), గౌతమ్ (8) అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆరు నెలల క్రితం రజిత పదో తరగతి క్లాస్‌మేట్స్ అంతా కలిసి గెట్ టుగెదర్ జరుపుదామని ప్లాన్ వేశారు.

ఈ క్రమంలో తన పదోతరగతి క్లాస్‌మేట్ అయిన శివ అనే యువకుడితో ఆమెకు స్నేహం మరింతగా ఏర్పడి, అది రోజూ చాటింగ్, కాల్స్, వీడియో కాల్స్ మాట్లాడేవారు. చాలాసార్లు వారిద్దరూ శారీరకంగా కలిశారు. శివ కలిసినప్పటి నుంచి తన జీవితం ఆనందంగా ఉందని, అతనికి పెళ్లి కాకపోవడంతో ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకుంది. అదే విషయం శివతో ప్రస్తావించగా..‘నీకు పెళ్లి కాకుండా ఉంటే, పిల్లలు లేకుండా ఉంటే, ఒంటరిగా తనతో వస్తానంటే కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను’ అని చెప్పాడు. శివను పెళ్లి చేసుకోవాలంటే తన పిల్లలను అడ్డు తొలగించుకోవాలని రజిత నిర్ణయించుకుని, గత నెల 27వ తేదీ సాయంత్రం తన పిల్లలను చంపుతున్నానని శివకు సమాచారం ఇచ్చింది. పిల్లలను త్వరగా చంపేయాలని అతను చెప్పడంతో ఆమె సరే అంది. అదేరోజు రాత్రి 10 గంటలకు తన భర్త ట్యాంకర్ తీసుకుని వెళ్లగా, ఇదే అదనుగా భావించి తన ముగ్గురు పిల్లలను చంపేసింది. ముక్కు, మూతిపై టవల్ వేసి, చేతితో గట్టిగా అదిమి పట్టుకొని, ఊపిరాడకుండా చేసి పిల్లలను కడతేర్చింది.

ఈ మేరకు పోలీస్‌ల దర్యాప్తులో ఈ విషయమంతా తేలింది. ప్రియుడిని పెళ్లి చేసుకునేందుకు కన్నపాశాలనే కడతేర్చిన తీరు తలదించుకునేలా చేసింది. రజిత, శివ కలిసి కుట్ర పన్ని ముగ్గురు పిల్లలను ఊపిరాడకుండా చేసి చంపారని రుజువు కావడంతో నిందితులిద్దరినీ రిమాండ్‌కు తరలిస్తామని ఎస్‌పి చెప్పారు. మీడియా సమావేశంలో పటాన్‌చెరు డిఎస్‌పి రవీందర్‌రెడ్డి, అమీనన్ పూర్ ఇన్‌స్పెక్టర్ నరేష్, డిఐ రాజు, ఎస్‌ఐ సోమేశ్వరి పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News