Saturday, November 23, 2024

మాతృభాషల మనుగడ పోరాటం

- Advertisement -
- Advertisement -

భాష కేవలం భావాలు వ్యక్తం చేయడానికి ఉపయోగపడే సాధనం కాదు ఒక జాతి ఉనికిని, సంస్కృతిని మొత్తంగా జీవన విధానాన్ని పరిచయం చేస్తుంది. ఒక జాతి విశిష్టత, వారసత్వం, నైతికత ఆ జాతి మాతృభాషలో నిబిడీకృతమై ఉంటాయి. ఇలా ఏర్పడిన తల్లి భాషల్లో నేడు కొన్ని అంతరించిపోతుండటం ఆందోళనకలిగిస్తుంది. భాష కనుమరుగైతే అందులోని జ్ఞానం సైతం అంతరించిపోతుంది. ఆ భాషలోని గేయాలు, పురాణాలు, చరిత్ర, ఇతిహాసాలు, సాహిత్య సంపద సైతం కనుమరుగవుతోంది. భారతావనిలో ప్రస్తుతం కొన్ని గిరిజన తెగల భాషలు ప్రపంచీకరణ, వలసవాదం ఫలితంగా అంతరించిపోయే దశలో వున్నాయి.
మాతృభాష ఉద్యమానికి నివాళిగా ఈ దినోత్సవం

ప్రపంచంలో చిన్న, పెద్ద భాషలన్నీ రక్షించుకోవాలని, భాష సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారా మనం జీవ వైవిధ్యాన్ని కాపాడుకోగలమనే మొదలైన లక్ష్యాలతో ప్రతి ఏడాది ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం నిర్వహించాలని 1999 నవంబర్ 17న యునెస్కో ప్రకటించింది. 2000 ఈ సంవత్సరం నుండి ప్రతి ఏటా బంగ్లా దేశీయులు చేసిన భాష ఉద్యమానికి నివాళిగా ప్రపంచమంతటా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాం. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఏటా ఒక థిమ్‌ను కూడా యునెస్కో ప్రకటిస్తుంది. ‘బహు భాషా విద్యను మార్చే ఆవశ్యకత’ అనేది ఈ ఏడాది థీమ్. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భాషలను సంరక్షించడం ఇతర భాషలు నేర్చుకోవడానికి మాతృభాషను ఉపయోగించడమే ప్రధాన అంశంగా యునెస్కో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.
తల్లడిల్లుతున్న తల్లి భాషలు

యునెస్కో లెక్కల ప్రకారం ప్రపంచంలో ప్రస్తుతం 6 వేల భాషలు మాట్లాడుతున్నారు. మన దేశంలో 1652 భాషలు కలవు. దేశంలో పది వేల మంది కంటే ఎక్కువ మంది మాట్లాడే భాషలు 270 ఉన్నాయి. అందులో 117 భాషలు అంతరించిపోయే ప్రమాదముందని ఇటీవల కేంద్ర సాంస్కృతిక శాఖ విభాగమైన అంతరించిపోతున్న భాషల రక్షణ, పరిరక్షణ సంస్థ (SPPEL) తెలిపినది. వాటిలో అండమాన్ నికోబార్ దీవుల్లో సనె న్యో,సెంటిలీస్ తెగలకు సంబంధించి 11 భాషలు, మణిపూర్ రాష్ట్రంలో మాట్లాడే ఐ మొల్ , జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో మాట్లాడే బిరిజియా, హిమాచల్‌ప్రదేశ్‌లో మాట్లాడే చినాలి, జార్ఖండ్ రాష్ట్రంలో 7514 మంది మాట్లాడే బీర్వో ర్, ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాలలో మాట్లాడే ఎరుకల భాష, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మాట్లాడే కొండ దొర భాషలు, తెలంగాణలో గిరిజన తెగలు మాట్లాడే గోండు లాంటి గిరిజన భాషలు అంతరించిపోవడానికి దగ్గరలో ఉన్నాయి.

ప్రపంచీకరణ వలసవాదం ఫలితంగా పలు మాతృ భాషలు వేగంగా కనుమరుగవుతున్నాయి. భాషలు అంతరించి పోవడానికి ఆయా జాతుల సభ్యులు వారసత్వంగా వచ్చిన మాతృభాష నేర్చుకోకపోవడం ఒక కారణం. కొంత మంది ఆర్థిక పురోగతి ఆధునికతతో ముడిపడి ఉన్న ఆధిపత్య భాషలను నేర్చుకోవడానికి ఇష్టపడటంతో మాతృ భాషలు మనుగడ కోసం పోరాడుతున్నాయి. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లోని మణిపురి భాష సురక్షితం కాని భాషల జాబితాలో ఉండటం గమనార్హం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భాషల పరిరక్షణ కోసం అరకొర నిధులు కేటాయింపు కూడా పలు భాషలు అంతరించి పోవడానికి కారణం అవుతున్నాయి.

2015- 19 ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌కు రూ. 26.10 కోట్లు, అన్ని రాష్ట్రాల యూనివర్సిటీలకు రూ. 10.35 కోట్లు అంతరించిపోతున్న భాషల రక్షణ, పరిరక్షణ సంస్థ (SPPEL)కు రూ. 9.44 కోట్లు కేటాయించింది. నామమాత్రపు నిధులు విడుదల వల్ల వివిధ రాష్ట్రాలలో విశ్వవిద్యాలయాలు భాషల పరిశోధన కొరకు, నిఘంటువుల తయారీ కోసం సమయాన్ని వెచ్చించలేకపోతున్నాయి. అలాగే దేశంలో భాషల పరిరక్షణ కోసం ఏర్పడిన కేంద్ర పరిరక్షణ సంస్థకు ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించక పోవడం వల్ల అంతరించిపోతున్న భాషల అధ్యయనం కోసం పరిశోధనలు చేయలేకపోతున్నాయి.
మాతృభాష పరిరక్షణే ప్రథమ కర్తవ్యం

అమ్మ భాష మాత్రమే కాదు మహోన్నతం కూడా. మాతృభాషలో మాట్లాడట్లేదంటే నిన్ను నువ్వు గౌరవించుకోవడం లేదనే అర్థం. నీ గౌరవంను, నీబాల్యాన్ని, సంపదను తాకట్టుపెడుతున్నట్టే లెక్క. అన్యభాషలు ఎన్ని నేర్చుకున్నప్పటికీ మాతృభాషలో ప్రవీణుడు కాని వాడు విజ్ఞాన సముపార్జన చేయలేడు. కావున మాతృభాషను కాపాడుకుంటూ దాని ద్వారానే తక్కిన భాషల్లో నేర్చుకోవడం అనంత విజ్ఞానాన్ని పొందటం సరైనమార్గం. నూతన జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం ప్రాథమిక విద్య అంతా మాతృభాషలో జరగాలని పేర్కొనడం శుభపరిణామం. తద్వారా అంతరించిపోతున్న తల్లుల భాషలను కాపాడుకోగలం. ప్రభుత్వాలు, ప్రభుత్వేతర సంస్థలు యునెస్కో లాంటి అంతర్జాతీయ సంస్థలు అంతరించిపోతున్న భాషలను కాపాడే ప్రయత్నాలు చేయాలి.

తల్లి భాషను కాపాడే ప్రయత్నం భాష విశ్వవిద్యాలయాలు చేస్తున్నప్పటికీ వాటికి తగిన నిధులు విడుదల కావడం లేదు. కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంతరించిపోతున్న భాషలో పరిరక్షణ కోసం భాష యూనివర్సిటీలకు ఎక్కువ మొత్తంలో నిధులు విడుదల చేయాలి. అలాగే మన మాతృభాష అయిన తెలుగు భాషకు మాత్రమే మహత్తరమైన సాహిత్య సంపద ఉంది. గొప్ప కవులు రచయిత లెందరికో తెలుగునేల ఆలవాలం. తెలుగును అమితంగా ప్రేమించిన హాల్డేన్, అప్పయ్య దీక్షితులు, బ్రౌన్ వంటి వారి మాతృభాష తెలుగు కాదు. కావున మాతృభాషలో పట్టు సాధిస్తే ఇతర భాషలు నేర్చుకోవడం సులభమవుతుంది.బహు భాషల పుట్టినిల్లయిన మన భారతదేశంలో అమ్మ భాష వంటి మన తెలుగును కాపాడుకుంటూ అన్ని భాషలు నేర్చుకోవాలి. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట ప్రణాళికలు రూపొందించి రానున్న కాలంలో అంతరించిపోయే భాషల్లో తెలుగు లేకుండా జాగ్రత్త పడాలి.

అంకం నరేష్
6301650324

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News