చెన్నై: బిడ్డను సరిగ్గా పట్టించుకోవడం లేదని సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో అవమానం తట్టుకోలేక ఓ తల్లి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తమిళనాడులోని చెన్నైలో జరిగింది. ఇటీవల ఏప్రిల్ 28న చెన్నైలోని ఓ అపార్ట్‌మెంట్‌లోని నాల్గవ అంతస్తు బాల్కనీ నుండి తన బిడ్డ ప్రమాదవశాత్తు ఆమె చేతుల్లోంచి జారి పడిపోయింది. విండోకు ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ షీట్ పై బిడ్డ పడడంతో ఆమె కేకలు వేసింది. ఇంటి పైకప్పుకు ప్రమాదకరంగా వేలాడుతున్న చిన్నారిని కుటుంబ సభ్యులు, స్థానికులు కాపాడారు. పైకప్పు కింద ఉన్న కిటికీలో నుంచి బయటకు వచ్చి శిశువును రక్షించారు. అయితే తల్లి రమ్యకు బిడ్డను సరిగ్గా చూసుకోవటం రాదని కొందరు స్థానికులు, న్యూస్ ఛానల్స్, నెటిజన్లు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు.
దీంతో అవమానాలు తట్టుకోలేక భర్త, బిడ్డను తీసుకొని కోయంబత్తూర్ కరమడైలోని తన పుట్టింటికి వెళ్లింది. ఆ విమర్శలతో మనస్తాపం చెందిన రమ్య ఆదివారం ఇంట్లో ఎవరు లేని సమయం చూసి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో వాళ్లు ఇంటికి వచ్చేసరికి రమ్య స్పృహలో లేకపోవడంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె దుర్మరణం చెందింది. ఈ ఘటనపై సింగర్ చిన్మయి స్పందించారు. నెటిజన్లు విచక్షణ కోల్పోయి కామెంట్లు చేయడంతో ఆ తల్లి ఆత్మహత్య చేసుకుందని మండిపడ్డారు. నెటిజన్ల ట్రోల్స్‌తోనే తల్లి చనిపోయిందని, ఇప్పుడు విమర్శకుల కళ్లు చల్లబడ్డాయా? అంటూ మండిపడింది. ఆ పాపకు మాతృమూర్తిని దూరం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.