కుటుంబ కలహాలతో వివాహిత దురాగతం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలింపు
వేములవాడ: కనిపెంచిన తల్లె క్షణికావేశంలో చిన్నపిల్లలపై కర్కశత్వాన్ని ప్రదర్శించి స్థానికులకు కంటతడిపెట్టించిన వైనం వేములవాడ లో చోటుచేసుకుంది. సంఘటనకు సంబందించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన రమేష్‌తో కామారెడ్డి జిల్లా గాంధారి మండలం చెన్నపురం గ్రామానికి చెందిన మమతకు గత పది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. చిన్న చిన్న గొడవలతో మమత గత నెలరోజుల క్రితం పుట్టింటికి పిల్లలతో కలిసివెళ్లింది. అయితే శనివారం రోజున తాను తిరిగివస్తున్నానని భర్త రమేష్‌కు ఫోన్ చేసి సమాచారం అందించింది. తాను కూడా రమ్మని మమతకు చెప్పి వేములవాడకు చేరుకోగానే ఫోన్ చేయమని కూడా చెప్పాడు.
అయితే వేములవాడ బస్టాండ్‌లో దిగిన తరువాత మమత భర్త రమేష్‌కు ఫోన్ చేసి తాను చేరుకున్నానని వెంటనే రమ్మని చెప్పింది. రమేష్ పనిలో ఉన్నానని ఒక అరగంటలో వస్తానని ఉండమని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఇంతలోనే ఆవేశానికి లోనైన మమత బ్లేడ్‌తో ఇద్దరి పిల్లల గొంతు కోసి తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, భర్త రమేష్‌తో పాటు నాంపల్లిలో ఉన్న వారి బంధువులకు కూడా సమాచారం ఇచ్చింది. హుటాహుటిన బంధువులు, భర్త రమేష్ చేరుకుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి 108 వాహనంలో తరలించగా ప్రమాదం ఏమి లేదని వైద్యులు వెల్లడించినట్లు సమాచారం. కొంతకాలంగా ఉన్న కుటుంబ కలహాల నేఫథ్యంలోనే మమత క్షణికావేశానికి లోను అయినట్లు బంధువులు తెలిపారు.