Thursday, January 23, 2025

విశ్వమాత మదర్ థెరీసా

- Advertisement -
- Advertisement -

అన్ని మతాలవారు వారి వారి దేవుళ్ళను పూజిస్తారు, కొలుస్తారు. కానీ వారి కళ్ళ ముందు బాధపడే అభాగ్యులు, నిరాశ్రయులు, అనాథలు, జబ్బుతో ఉన్నవారిని గురించి పట్టించుకునేవారు చాలా తక్కువగా ఉంటారు. ఆధ్యాత్మికత మనకు ‘ఆత్మే పరమాత్మ’ అని బోధిస్తున్నది. భక్తితో కొలిచే భగవంతుడిని అంతటా చూడగలగాలి. ప్రతి వ్యక్తిలోనూ పరమాత్మను దర్శించాలి. అవసరార్థులకు సేవచేయడం మాధవ సేవ అవుతుంది. మానవ సేవే మాధవ సేవ అంటారు. సాటివారికి సాయపడి, మానవత్వం కలవారుగా నిరూపించుకున్న వారే మహనీయులవుతారు.అలాంటి మహనీయుల జాబితాలో ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారు మదర్ థెరీసా. అభాగ్యుల సేవే తన లక్ష్యమని, దీనులకు సేవ చేయాలని తన సొంత నేలను వదిలి వచ్చింది.

నేడు మదర్ థెరీసా జయంతి ఈమె అల్బేనియా దేశం ఉత్తర మాసిడోనియా స్కాప్డేలో నికోళ్లే, డ్రానా దంపతులకు ఆఖరి సంతానంగా జన్మించారు. పూర్తి పేరు ఆగ్నస్ గోక్ష భుజాక్షువు. ఆగ్నస్ చిన్నతనంలోనే మత ప్రచారకుల జీవిత కథలు, వారి సేవల పట్ల ఆకర్షించబడింది. పన్నెండు ఏళ్లకే ఇల్లు వదిలి సిస్టర్స్ ఆఫ్ లోరెటో అనే ప్రచార సంస్థలో చేరారు. మత ప్రచార పోషక సెయింట్ అయిన తెరిసే డి లిసే పేరు మీదుగా తన పేరును మదర్ థెరీసాగా మార్చుకుంది. 1937 మే 14న కలకత్తాలోని లోరేటో కాన్వెంట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ ఉన్నప్పటికీ తన జీవితంలో సంతృప్తిని మాత్రం పొందలేకపోయింది. కలకత్తా ప్రజలు అనుభవించే పేదరికం ఆమె మనస్సును కలచి వేసింది. కాన్వెంట్‌ని వదిలి పేదల మధ్య నివసిస్తూ సేవ చేయాలని నిర్ణయించుకున్నారు.

1948లో సంప్రదాయ లోరేటో సంస్థను వదిలి నిరాడంబరంగా నీలి అంచు కాటన్ చీర కట్టి, భారతీయ పౌరసత్వం స్వీకరించి మురికివాడలో ప్రవేశించి మోతీజిల్‌లో ఒక పాఠశాలను స్థాపించింది. తర్వాత అన్నార్తుల, అనాథల అవసరాలను తీర్చడానికి సిద్ధమయ్యారు.దీనికి ఆదాయం సరిపోక ఆహారం, ఇతర అవసరాలకు యాచించాల్సిన అవసరం ఏర్పడింది.1950 అక్టోబర్ 7న మత గురువుల సంఘం ప్రారంభించారు. ఇదే మిషనరీ ఆఫ్ చారిటీగా రూపొందింది. ఆకలిగొన్నవారు, నిరాశ్రయులు, కుంటివారు, కుష్టువారు, ప్రేమించబడని వారు, సమాజం నిరాకరింపబడినవారు, భారమైనవారు మొదలైన వారి నందరినీ జాగ్రత్తగా చూసుకోవడమే ఈ సంఘం ముఖ్య కర్తవ్యం.1952లో కలకత్తాలో పాడుపడిన దేవాలయాన్ని ధర్మశాలగా మార్చారు. ఇదే నిర్మల్ హృదయ్ ఇక్కడికి వచ్చిన వారికి పూర్తి వైద్య సదుపాయం అందించేవారు. కుష్టు వ్యాధిగ్రస్థులకు శాంతి నగర్ అనే పేరుతో ధర్మశాలను ప్రారంభించారు.

మిషనరీస్ ఆఫ్ చారిటీ కుష్టు వ్యాధిని అరికట్టడానికి కలకత్తా నగరంలో వైద్యశాలలు ఏర్పాటు చేసి వైద్యం, ఆహారాన్ని అందజేసేవారు. ఇందులో భాగంగా తప్పిపోయిన పిల్లల కోసం 1955లో అనాథల కోసం, నిరాశ్రయుల కోసం నిర్మల్ శిశు భవన్ ప్రారంభించింది. ఈ సంస్థలు చేసే కార్యకలాపాల వల్ల అనేక మంది ఆకర్షితులై విరివిగా విరాళాలను అందించేవారు
తన సేవా సంస్థలను భారత దేశం వెలుపల మొదటగా వెనిజులా ఆ తర్వాత రోమ్, టాంజనియా, ఆస్ట్రియా, ఆసియా, ఆఫ్రికా, అమెరికాలో అనేక ఫౌండేషన్లు స్థాపించారు. అంతర్జాతీయంగా ఎన్నో సందర్భాల్లో ఆమె తన సేవలను అందించింది. థెరిసా మరణించే నాటికి మిషనరీస్ ఆఫ్ చారిటీస్ నాలుగు వేల మంది సన్యాసినులతో, 300 మంది అనుబంధ సభ్యులతో, 133 దేశాల్లో 610 శాఖలను కలిగి ప్రాణాంతక వ్యాధులతో భయపడుతున్న, బాధపడుతున్న వారికి సంరక్షణ గృహాలు, ఆహార కేంద్రాలు, అనాథ శరణాలయాలు, పాఠశాలలు నెలకొల్పారు.

1983లో పోప్ జాన్ పాల్ 2 సందర్శనార్థం వెళ్ళినప్పుడు గుండెపోటుకు గురయ్యారు. హృద య సంబంధిత సమస్యలతో పోరాడారు, శస్త్ర చికిత్స చేసినా ఆరోగ్యం క్షీణించి 1997 సెప్టెంబర్ 5న మరణించింది. 2012లో ద హిస్టరీ ఛాన ల్, రిలయన్స్ మొబైల్ భాగస్వామ్యంతో అవుట్ లుక్ మ్యాగజైన్ నిర్వహించిన ది గ్రేటెస్ట్ ఇండియన్ పోల్‌లో ఆమె ఐదవ స్థానంలో ఎంపిక అయ్యారు. 1962లో రామన్ మెగాసేసే అవార్డు, పద్మశ్రీ అవార్డు, 1972లో జవహర్ లాల్ నెహ్రూ పురస్కారం, 1979లో నోబెల్ శాంతి పురస్కారం, 1980లో భారత రత్న అవార్డులను స్వీకరించడం జరిగింది. నేటి సమాజం థెరీసా నుండి సేవ దృక్పథం అలవర్చుకొని ముందుకు సాగాలి. అంతేకానీ ప్రచారాలు, ప్రశంసల కోసం చేసే పనులను పుణ్యకార్యాలు అనిపించుకోవు. ఏ చిన్న సేవ అయినా నిస్వార్థంగా చేయడం చాలా ముఖ్యం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News